గనుల మంత్రిత్వ శాఖ
పునర్వినియోగం ద్వారా కీలక ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహం
ఇ-వ్యర్థాలు, వాడిన బ్యాటరీలు, ఇతర వ్యర్థాల పునర్వినియోగం దిశగా పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచే వేదికగా రూ.1,500 కోట్ల ప్రోత్సాహక పథకం
నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2025 2:40PM by PIB Hyderabad
కీలకమైన ఖనిజాల పునర్వినియోగం (రీసైక్లింగ్) కోసం రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2025 సెప్టెంబరు 3న ఆమోదించింది. ఈ పథకాలు జాతీయ కీలక ఖనిజాల మిషన్‌లో భాగం. సమీప కాలంలో సరఫరా వ్యవస్థలో సుస్థిరత దిశగా విచక్షణతో కూడిన మార్గాన్ని నిర్దేశించడం వీటి లక్ష్యం. అనంతరం 2025 అక్టోబరు 2న భాగస్వాములందరితో సంప్రదింపుల అనంతరం.. పథకాలకు సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను గనుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబరు 2నే ప్రారంభమైంది. పథకం వేగవంతమైన అమలును భాగస్వాములంతా అభినందించారు. మంత్రిత్వ శాఖతో వారు క్రియాశీలంగా భాగస్వాములయ్యారు.
ఇ-వ్యర్థాలు, వాడిన లిథియం అయాన్ బ్యాటరీలు (ఎల్ఐబీలు), గడువు ముగిసిన వాహనాల్లోని కేటలైటిక్ కన్వర్టర్ల వంటి ఇతర వ్యర్థాలు ఈ పథకం కింద అర్హత ఉన్న ముడిపదార్థాలు. కొన్ని అంచనాల ప్రకారం దేశంలో ఏటా 1.75 మిలియన్ టన్నుల ఇ-వ్యర్థాలు, దాదాపు 60 కిలో టన్నుల వాడిన లిథియం అయాన్ బ్యాటరీలు ఉత్పన్నమవుతున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీ వ్యర్థాల టారిఫ్ లైన్లలో కస్టమ్స్ సుంకం తొలగింపును 2025-26 కేంద్ర బడ్జెట్ ద్వారా అమలు చేయడంతో దిగుమతులు సులభతరమవుతాయి. వచ్చే నాలుగైదేళ్లలో.. ఈ వ్యర్థ ఉత్పత్తుల లభ్యత చాలా రెట్లు పెరగనుంది.
ఉత్పత్తిదారు బాధ్యతా విస్తృతి (ఈపీఆర్) ఫ్రేమ్‌వర్క్ కింద సేకరణను క్రమబద్ధీకరించడం ద్వారా, సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో వ్యర్థాలను రీసైక్లింగ్ వ్యవస్థలో ఏకీకృతం చేయడం ద్వారా ముడి పదార్థాల లభ్యత సమస్యను కూడా పరిష్కరిస్తున్నారు. ఈపీఆర్ వ్యవస్థాగత ఏర్పాటు కింద.. ఇ-వ్యర్థాలు, బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం నిర్దిష్ట తుది ఉత్పత్తుల వెలికితీత తప్పనిసరి. అయినా, బ్లాక్ మాస్/పౌడర్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం దేశంలో పరిమితంగా ఉంది. అందువల్ల వాటిలో ఉన్న విలువైన కీలక ఖనిజాలను మొదట వెలికితీయకుండా వాటిని ఎగుమతి చేస్తున్నారు. బ్లాక్ మాస్ ఉత్పత్తిలో మాత్రమే భాగమైన కార్యకలాపాలకు కాకుండా.. కీలక ఖనిజాల వాస్తవ వెలికితీతలో భాగమైన రీసైక్లింగ్ కార్యకలాపాలన్నింటికీ ఈ పథకం ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. మరింత ఎక్కువ మంది రీసైక్లర్లను.. ముఖ్యంగా డిస్‌మాంట్లర్లు, క్రషర్లు, షెడ్డర్లు వంటి అప్‌స్ట్రీమ్ సంస్థలను క్రమబద్ధీకరించిన వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. అనేక ప్రైవేటు రీసైక్లింగ్ కంపెనీలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఇప్పటికే సమర్థంగా నడుపుతున్నాయి.
దేశంలో ఆర్ 4 రీసైక్లింగులో (బ్యాటరీ వ్యర్థాల నుంచి లోహాన్ని వెలికితీసే వరకు పూర్తి ప్రక్రియ) పనిచేస్తున్న వారు చాలా తక్కువ. వీరిలో కొందరు విస్తరణ ప్రణాళికలపై ఆసక్తి వ్యక్తపపరచవచ్చు. ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులను నమోదు చేయడం కోసం విస్తృత భాగస్వామ్యాన్ని ఈ పథకం అందిస్తుంది. మొత్తం ప్రోత్సాహకాన్ని పెద్ద రీసైక్లర్లకు రూ. 50 కోట్లుగా, చిన్న రీసైక్లర్లకు రూ. 25 కోట్లుగా పరిమితం చేశారు.
హైడ్రోమెటలర్జీ వంటి ప్రక్రియలను ఉపయోగించి రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పథకం సహాయపడుతుంది. ప్రారంభం నుంచి తుది దశ (ఎండ్-టు-ఎండ్) వరుకు రీసైక్లింగ్ కోసం నిరూపిత సాంకేతికతలు దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, సీఎస్ఐఆర్, ఇతర పరిశోధన- అభివృద్ధి ప్రయోగశాలల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు లోహాల వెలికితీత, రీసైక్లింగ్, శుద్ధిలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేసి ప్రదర్శించాయి. ఈ సంస్థల్లో కొన్ని ఖనిజాల ప్రాసెసింగ్, శుద్ధి, సంగ్రహణ లోహశాస్త్రంలో శిక్షణ కూడా అందిస్తున్నాయి. ఈ పథకం కింద అవసరమైన ఏదైనా నైపుణ్యాన్ని.. అవసరమైన సంస్థాగత భాగస్వామ్యం ద్వారా లబ్ధిదారులు పొందవచ్చు.
దేశంలో ఇ-వ్యర్థాలను పూర్తిగా వినియోగించుకోవడానికి, కొన్నేళ్లలో వివిధ కీలక ఖనిజాలను తిరిగి పొందేలా తగిన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ రంగంతో కలిసి గనుల మంత్రిత్వ శాఖ క్రియాశీలంగా పనిచేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2183577)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18