వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2025-26 ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పెద్దమొత్తంలో పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు కోసం ప్రణాళికలను ఆమోదించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
తెలంగాణ నుంచి పెసర, మినుములు, సోయాబీన్ 100% కొనుగోలు చేయడానికి అనుమతి
ఒడిశా నుంచి కందిపప్పు 100% సేకరణకు ఆమోదం
మహారాష్ట్ర నుంచి ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద భారీగా పెసర, మినుములు, సోయాబీన్ కొనుగోలు
మధ్యప్రదేశ్‌లో పీడీపీఎస్ కింద సోయాబీన్ కొనుగోలుకు అనుమతి
తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో లక్షలాది మంది రైతులకు లాభం చేకూరేలా
మొత్తం రూ. 15,095.83 కోట్లతో కొనుగోళ్ళు
పంటల కొనుగోలు ప్రయోజనం నేరుగా రైతులకే చేరేలా సరైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసిన శ్రీ శివరాజ్ సింగ్
Posted On:
27 OCT 2025 7:51PM by PIB Hyderabad
2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు ప్రణాళికను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించారు. ఈ రాష్ట్రాల కోసం మొత్తం రూ. 15,095.83 కోట్ల విలువైన కొనుగోలు ప్రణాళికకు ఆమోదం లభించింది. దీని ద్వారా ఆయా రాష్ట్రాలలో లక్షలాది మంది రైతులకు విశేషంగా లాభం కలుగుతుంది.
ఈ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులతో వర్చువల్ గా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షన్ అభియాన్ (పీఎం - ఆశా), వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇతర పథకాల కింద కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ అనుమతులను మంజూరు చేశారు.
ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) కింద తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో 25% అంటే 4,430 మెట్రిక్ టన్నుల పెసలను రూ. 38.44 కోట్ల వ్యయంతో కొనుగోలు చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ చౌహాన్ ఆమోదం తెలిపారు. అలాగే తెలంగాణా నుంచి నూరు శాతం మినముల కొనుగోలుకు, 25% సోయాబీన్ కొనుగోలుకు కూడా ఆమోదం లభించింది. ఒడిశాలో, రాష్ట్రం మొత్తం ఉత్పత్తిలో 100% అంటే 18,470 మెట్రిక్ టన్నుల కందులను రూ. 147.76 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో పీఎస్ఎస్ కింద కొనుగోలు చేయడానికి ఆమోదం లభించింది
మహారాష్ట్రలో, పీఎస్ఎస్ కింద రూ. 289.34 కోట్లతో 33,000 మెట్రిక్ టన్నుల పెసల కొనుగోలుకు, రూ. 2540.30 కోట్లతో 3,25,680 మెట్రిక్ టన్నుల మినములు, రూ. 9860.53 కోట్లతో 18,50,700 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలుకు శ్రీ శివరాజ్ సింగ్ ఆమోదం తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రైస్ డిఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ (పీడీపీఎస్) కింద 22,21,632 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలుకు మంత్రి ఆమోదం తెలిపారు. ఇందుకు రూ. 1,775.53 కోట్లు కేటాయించారు.
రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన రాబడి పొందడానికి, వారి ఆదాయాలను మార్కెట్ మార్పులతో కలిగే నష్టాల నుంచి కాపాడేందుకు ఈ అనుమతులు ఇచ్చినట్టు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' (స్వావలంబన భారతదేశం) దిశగా ఒక ముఖ్యమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, రైతుల ఆదాయాన్ని, గౌరవాన్ని పరిరక్షించడం కేంద్ర ప్రభుత్వ మొట్టమొదటి ప్రాధాన్యత అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఖరీఫ్ 2025–26 సీజన్ లో ఈ రాష్ట్రాల నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజల రికార్డు స్థాయి కొనుగోలు... వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని, రైతులకు కచ్చితమైన ఆదాయాన్ని అందిస్తుందని, స్వావలంబన భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు మార్గాన్ని సుగమం చేస్తూ, ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్) ద్వారా కంది, మినుము, పప్పులను 100% కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. పంటల కొనుగోలు ప్రయోజనం నేరుగా రైతులకు చేరేలా చూడాలని, ఈ విషయంలో కఠినమైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
***
(Release ID: 2183454)
Visitor Counter : 2