రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వేగవంతమైన రెండు గస్తీ నౌకలు - ఐసీజీఎస్ అజిత్, ఐసీజీఎస్ అపరాజిత్-లను ప్రారంభించిన భారత తీర రక్షక దళం

Posted On: 24 OCT 2025 6:05PM by PIB Hyderabad

సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడంలో భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్- ఐసీజీ) ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. 2025 అక్టోబర్ 24న గోవా షిప్ యార్డ్ (జీఎస్ఎల్) లో వేగవంతమైన రెండు ఆధునిక గస్తీ నౌకలు (ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్ - ఎఫ్పీవీ) - ఐసీజీఎస్ అజిత్, ఐసీజీఎస్ అపరాజిత్‌ - లను ప్రారంభించడం ద్వారా ఈ విజయాన్ని సాధించింది. భారత తీర రక్షక దళం కోసం గోవా షిప్‌యార్డ్ సంస్థ (జిఎస్ఎల్) నిర్మిస్తున్న ఎనిమిది దేశీయ ఎఫ్పీవీ  శ్రేణిలో ఇవి చివరి రెండు నౌకలు.  దేశ తీరప్రాంత నిఘా,  ప్రతిస్పందన సామర్థ్యాలను పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.

గోవా షిప్‌యార్డ్ పూర్తిగా డిజైన్ చేసి నిర్మించిన ఈ ఎఫ్పీవీలు భారత స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యాల పెరుగుతున్న శక్తిని ప్రతిబింబిస్తున్నాయి. 52 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువుతో ఉన్న ఈ నౌకలు, భారతదేశంలో ఈ తరగతిలోనే తొలిసారిగా కంట్రోలబుల్ పిచ్ ప్రొపెల్లర్స్ (సీపీపీ) ను కలిగివున్నాయి. ఇవి అత్యుత్తమ చలనశీలతను, చోదన సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ నౌకలు బహుళ లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశ దీవుల ప్రాంతాలు,  ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతాల చుట్టూ  మత్స్య సంరక్షణ, తీర గస్తీ,  స్మగ్లింగ్ నిరోధం,   దోపిడీ నిరోధం,  సోదా, రక్షణ కార్యకలాపాలు వంటి సేవలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

రక్షణ సర్వీసుల ఆర్థిక సలహాదారు డాక్టర్ మయాంక్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో శ్రీమతి మంజు శర్మ  ఈ నౌకలను ప్రారంభించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ పశ్చిమ ప్రాంతం కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్ భీష్మ శర్మ తో పాటు ఐసీజీ, గోవా షిప్‌యార్డ్ లకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ ఘనత సాధించినందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్  గోవా షిప్‌యార్డ్ లను డాక్టర్ మయాంక్ శర్మ అభినందిస్తూ, ఈ ప్రాజెక్ట్ దేశీయ పరిశ్రమ, ఉపాధి సృష్టి, ఎంఎస్ఎంఈ రంగాలకు అందించిన సహకారాన్ని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు సముద్ర సామర్థ్యాలలో భారత స్వావలంబనను బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వేగవంతమైన ఈ రెండు గస్తీ నౌకలను  చేర్చుకోవడం ద్వారా, భారత తీర రక్షక దళం తన ఆధునిక, వేగవంతమైన నౌకల సంఖ్యను విస్తరించుకుంటూ, విస్తారమైన భారత తీరరేఖ సముద్ర భద్రత,  కార్యకలాపాల సంసిద్ధతను మరింత బలోపేతం చేసింది. ఈ నౌకల ప్రారంభంతో దేశానికి తదుపరి తరం స్వదేశీ రక్షణ నౌకలను నిర్మించే ప్రధాన సంస్థగా గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ స్థానం మరింత బలపడింది.

 

***


(Release ID: 2182338) Visitor Counter : 13