బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర ఇంధన కేంద్రం ఏర్పాటుకు ‘కోల్ ఇండియా…ఐఐటీ-మద్రాస్’ మధ్య అవగాహన ఒప్పందం

Posted On: 22 OCT 2025 4:45PM by PIB Hyderabad

ఐఐటీ-మద్రాస్‌ ప్రాంగణంలో “సుస్థిర ఇంధన కేంద్రం ఏర్పాటుకు ‘కోల్ ఇండియా లిమిటెడ్’ (సీఐఎల్‌), ఐఐటీ-మద్రాస్‌ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం ఖరారైంది. ‘సీఐఎల్‌’ చైర్మన్ శ్రీ పి.ఎం.ప్రసాద్‌ సహా రెండు సంస్థల సీనియర్ అధికారుల సమక్షంలో ‘సీఐఎల్‌’ డైరెక్టర్ (టెక్నికల్) శ్రీ అచ్యుత్ ఘటక్, ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ శ్రీ వి.కామకోటి ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

సుస్థిర ఇంధన సాంకేతికతలపై అత్యాధునిక పరిశోధన-ఆవిష్కరణలు సహా సామర్థ్య వికాస కార్యక్రమాల కూడలిగా ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ‘సీఐఎల్‌’ నుంచి నిధుల తోడ్పాటుతో నిర్దేశిత వ్యూహాత్మక వైవిధ్యీకరణ లక్ష్యాలకు తగినట్లుగా ఈ కేంద్రం పనిచేస్తుంది. ఈ మేరకు భిన్న లక్ష్యాల కోసం బొగ్గు గనుల వినియోగం, స్వల్ప కర్బన ఉద్గార సాంకేతికతల ఆవిష్కరణ, భారత భవిష్యత్‌ కాలుష్య రహిత ఇంధనంలో విలువైన ముడిసరకుగా బొగ్గు సద్వినియోగానికి మార్గాన్వేషణపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. నికర శూన్య ఉద్గారాల దిశగా 2070 నాటికి దేశం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనతోపాటు స్వదేశీ పరిశోధన-ఆవిష్కరణలు, సాంకేతికతల రూపకల్పన ద్వారా భారత ఇంధన రంగ రూపాంతరీకరణకు సారథ్యంలో సంయుక్త నిబద్ధతను ఈ భాగస్వామ్యం స్పష్టం చేస్తుంది.

ఈ సందర్భంగా ‘సీఐఎల్‌’ చైర్మన్ శ్రీ పి.ఎం.ప్రసాద్‌ మాట్లాడుతూ- దేశానికి ఇంధన ప్రదాత పాత్ర నుంచి భారత కాలుష్య రహిత ఇంధన రూపాంతరీకరణకు కీలక దోహదకారిగా కోల్ ఇండియా రూపొందుతున్నదని పేర్కొన్నారు. “సుస్థిర వృద్ధి దిశగా కోల్‌ ఇండియా పయనంలో చరిత్రాత్మక ముందడుగుకు ఈ అవగాహన ఒప్పందం ఒక సూచిక. ఇందులో భాగంగా ఐఐటీ-మద్రాస్‌ సహకారంతో ఇంధన భద్రత, కర్బన ఉద్గారాల తగ్గింపు, సామాజిక-ఆర్థిక పురోగతికి భరోసా ఇవ్వగల స్వదేశీ పరిష్కారాన్వేషణ కోల్ ఇండియా భవిష్యత్‌ లక్ష్యాలు” అని ఆయన ప్రకటించారు.

అనంతరం ఐఐటీ-మద్రాస్‌ డైరెక్టర్‌ వి.కామకోటి ప్రసంగిస్తూ- స్వల్ప కర్బన ఉద్గార ఆర్థిక వ్యవస్థగా భారత్‌ రూపాంతరీకరణ వైపు తమ సంస్థ పురోగమనానికి పారిశ్రామిక-విద్యా రంగాల సహకారం ఒక మూల స్తంభమని పేర్కొన్నారు. “ఈ లక్ష్య సాధనలో మా నిబద్ధతను కోల్ ఇండియాతో భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ఆ మేరకు భారత సుస్థిర ఇంధన భవిష్యత్తుకు తోడ్పడే ప్రభావశీల, ఆచరణాత్మక పరిష్కారాల రూపకల్పనకు కృతనిశ్చయంతో ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కేంద్రం ‘పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టరల్, ఇంటర్న్‌ షిప్’ వంటి కార్యక్రమాల ద్వారా దేశానికి అవసరమైన మానవ మూలధన సంపత్తిని కూడా సమకూరుస్తుంది. ఆ మేరకు భారత కాలుష్య రహిత ఇంధన రూపాంతరీకరణకు సారథ్యం వహించగల భావితరం పరిశోధకులను, ఇంజినీర్లను అందిస్తుంది.

 

***


(Release ID: 2181611) Visitor Counter : 45