వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సుస్థిరతతోనే వాణిజ్యంలో పాల్గొంటూ సమతుల్య, ప్రయోజనకరమైన భాగస్వామ్యాల కోసం పోటీ లేని దేశాలపై దృష్టి సారిస్తున్న భారత్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏలు)తో భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు - పారిశ్రామిక భాగస్వామ్యం, సరఫరా వ్యవస్థల సుస్థిరతకు ప్రోత్సాహం
భారత సేవారంగానికి కీలకమైన శక్తిగా గుర్తింపు - స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థ సుస్థిరతపై ప్రత్యేక దృష్టి
సుస్థిరత, స్వావలంబన కోసం సరఫరా మార్గాల బలోపేతం అత్యంత కీలకం… దేశీయ సామర్థ్యానికి, పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం: శ్రీ పీయూష్ గోయల్
Posted On:
17 OCT 2025 3:52PM by PIB Hyderabad
భారత వాణిజ్య విధానంలో ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యమైన మార్పు జరిగిందని, పటిష్టమైన స్థితిలో ఉండి ఆర్థిక పరంగా పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ, అంతర్జాతీయ పరిస్థితికి అనుగుణంగా స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపైనా, ఇతర వాణిజ్య ఒప్పందాలపైనా భారత్ చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఆ రోజు న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ వార్షిక సమావేశం, 105వ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీ గోయల్ మాట్లాడుతూ, భారత్ ఇప్పుడు ప్రధానంగా తమకు పోటీగా లేని దేశాలతో మాత్రమే వాణిజ్య సంబంధాలను పెట్టుకుంటోందని, తద్వారా వాణిజ్య భాగస్వామ్యాలు సమతుల్యంగా, పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు.
ఈ వ్యూహాత్మక విధానం దేశీయ పరిశ్రమలను పరిరక్షించడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి, పెట్టుబడులకు, సాంకేతిక సహకారానికి అవకాశాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా మరో దేశానికి ఎక్కువ లాభాలను అందించే ఒప్పందాలను నివారించేందుకు కూడా ఈ విధానం సహాయపడుతోందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశ విదేశీ మారక నిల్వలు సుమారు 700 బిలియన్ల డాలర్లతో బలంగా ఉన్నాయని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన మూలాలను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. భారత ప్రజలు, వ్యాపారాలు, పరిశ్రమలు ప్రతి కోణంలోనూ కొన్ని సంవత్సరాల క్రితం వరకు లేని కొత్త చైతన్యం, ఉత్సాహం, విశ్వాసాలను ఇప్పుడు ప్రదర్శిస్తున్నాయని శ్రీ గోయల్ తెలిపారు.
ఈ రోజు ప్రపంచం భారత్ ను ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా, కలిసి పనిచేయడానికి విశ్వసనీయ దేశంగా గుర్తిస్తోందని శ్రీ గోయల్ అన్నారు. బలహీన స్థితిలో ఉంటూ, వాణిజ్య ఒప్పందాలపై చర్చించాల్సిన పరిస్థితిలో భారత్ నేడు లేదని, ఇపుడు భారతీయ పాస్‌పోర్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం, విలువ లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనేక ప్రపంచ దేశాలు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ సుస్థిరతను ప్రదర్శిస్తూనే ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి రేటు అంచనాను 6.4 నుంచి 6.6 శాతానికి పెంచిన ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాను ప్రస్తావిస్తూ, సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంతో గత ఎనిమిది సంవత్సరాలలోనే అత్యల్పంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
భారత్ తన సొంత బలాలను గుర్తించకుండా అసమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే రోజులు పోయాయని మంత్రి పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక స్పష్టమైన దార్శనికత, ‘దేశానికే తొలి ప్రాధాన్యం‘ (నేషన్ ఫస్ట్) నిబద్ధతతో, వర్తమాన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యవస్థాపరంగా సిద్ధమైందని చెప్పారు. ప్రధానమంత్రి 15 ఆగస్టు 2022న ప్రకటించిన ఐదు సూత్రాలను (పంచ్ ప్రాణ్) ఆయన గుర్తు చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ఈ సూత్రాలు మార్గాన్ని సూచిస్తాయని ఆయన తెలిపారు.
మారిషస్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈటీటీఏ) దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు) ప్రపంచంతో భారత వాణిజ్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఒప్పందాలు భారత ఆర్థిక ప్రాధాన్యతలు, దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఒక వ్యూహాత్మక సమతుల్య విధానంతో ఖరారయ్యాయని చెప్పారు. ఇతర వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే, ఈ దేశాలు కీలక ఉత్పాదక రంగాలలో భారతదేశంతో నేరుగా పోటీ పడవని, అందువల్ల భారతీయ పరిశ్రమలు అన్యాయమైన పోటీ ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఎక్కువ మార్కెట్ లభ్యతతో ప్రయోజనం పొందగలవని ఆయన వివరించారు.
ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఎగుమతిదారులకు అధిక ఆదాయ మార్కెట్ల లోకి ప్రవేశం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికతల స్వీకరణను అనుమతించడం ద్వారా కొత్త అవకాశాలను తెరిచాయని శ్రీ గోయల్ తెలిపారు. ఈ భాగస్వామ్యాలు పారిశ్రామిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, సరఫరా మార్గాల సుస్థిరతను పెంచడానికి, భారత్ ను ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించినవని ఆయన అన్నారు. ఈ ఒప్పందాలలో ఆవిష్కరణ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో సహకారానికి గట్టి నిబంధనలు కూడా ఉన్నాయని, తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దృశ్యంలో భారతీయ వ్యాపారాలు పోటీదాయకంగా ఉండేలా చూస్తాయని మంత్రి వివరించారు.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో భారత ప్రయోజనాలకు ముఖ్యంగా సున్నితమైన రంగాలలో, పూర్తి రక్షణ లభించేలా ప్రభుత్వం చూసుకుందని శ్రీ గోయల్ తెలిపారు. ఈ సమగ్రమైన, దూరదృష్టి గల వాణిజ్య ఒప్పందాల ద్వారా, భారత్ ప్రపంచ వాణిజ్యంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే గాకుండా మరింత సమానమైన, సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
వ్యాపారాలను సులభతరం చేసే చర్యలు, చట్టాల నేర రాహిత్య (డీక్రిమినలైజేషన్) ప్రక్రియలు, నిబంధనల సరళీకరణ ద్వారా భారత్ ను ఆకర్షణీయమైన వ్యాపార గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేసిందని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారతదేశం తన సుస్థిరత లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉందని, దేశ ప్రసార గ్రిడ్‌లో 50 శాతం వాటా ఉన్న 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఇప్పటికే సాధించిందని మంత్రి తెలిపారు. 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని సాధిస్తుందని, డేటా సెంటర్లు, స్వచ్ఛ ఇంధన పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా మారుతుందని ఆయన అన్నారు.
సేవారంగాన్ని భారత్ తన ప్రధాన బలంగా గుర్తిస్తోందని, మరో రెండేళ్లలో దేశ సేవల ఎగుమతులు.. సరుకుల ఎగుమతులను మించిపోయే అవకాశం ఉందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సేవల రంగంలో భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉందని, ఇది ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ముందుకు నడపడమే కాకుండా.. తయారీ, రియల్ ఎస్టేట్, వస్తువులు, సేవల మొత్తం డిమాండ్‌కు బలమైన ఊపునిస్తుందని ఆయన పేర్కొన్నారు.వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా లోమ్, ఆల్డో వంటి అరుదైన భూ మూలకాలను వెలికితీసే స్టార్టప్‌లతో ప్రభుత్వం క్రియాశీలక భాగస్వామ్యం కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పరిమిత ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్న రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ సదుపాయాలను భారతదేశంలో అభివృద్ధి చేసేందుకు కూడా స్టార్టప్‌లతో చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్వావలంబన, సుస్థిరత ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటాదారులందరూ తమ తమ సరఫరా వ్యవస్థలను క్రమం తప్పకుండా అంచనా వేసుకుంటూ బలోపేతం చేసుకోవాలని ఆయన కోరారు.
సరఫరా వ్యవస్థలను సమీక్షించి, బలోపేతం చేయడం ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు, తద్వారా దీర్ఘకాలిక దృఢత్వం, స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఇటీవలి ప్రపంచవ్యాప్త అంతరాయాలు దేశాలు, పరిశ్రమలు సురక్షితమైన, వైవిధ్యమైన, స్వయం సమృద్ధమైన సరఫరా మార్గాలను నిర్మించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేశాయని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని భౌగోళిక ప్రాంతాలపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గించడానికి, అవకాశం ఉన్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి భారత్ తన సరఫరా శ్రేణిలో ప్రతి భాగాన్ని ముడి పదార్థాల సేకరణ నుంచి ఉత్పత్తి, పంపిణీ వరకు జాగ్రత్తగా అంచనా వేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తన సరఫరా మార్గాలను గుర్తించడానికి, దేశీయ సామర్థ్యాలను పెంచగల ప్రాంతాలను గుర్తించడానికి పరిశ్రమ భాగస్వాములను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఎక్కువ సహకారం ద్వారా, దేశీయ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వాములుగా పనిచేసే బలమైన విలువ శ్రేణులను భారత్ అభివృద్ధి చేయగలదని ఆయన అన్నారు. ఈ ప్రయత్నం, భారత్ ను మరింత లోతుగా ప్రపంచ విలువ వ్యవస్థలతో ఏకీకృతం చేస్తూ, ప్రభుత్వ విస్తృత ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
వివిధ ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు (ఈపీసీలు), పరిశ్రమల సంఘాలతో తాను జరిపిన సంప్రదింపులను కూడా శ్రీ గోయల్ ప్రస్తావించారు, ఆవిష్కరణ, స్థానిక తయారీ, సమర్థవంతమైన రవాణా మార్గాల ద్వారా సరఫరా వ్యవస్థలను గొలుసులను బలోపేతం చేయవలసిన అవసరాన్ని తాను వారికి పదేపదే స్పష్టం చేసినట్టు తెలిపారు. పరిశ్రమలు భవిష్యత్ సవాళ్లు, అవకాశాలకు సమర్థంగా స్పందించగలిగేలా, భారత్ తన వాణిజ్య వ్యవస్థలలో చురుకుదనాన్ని, సులభ అన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అసోచామ్ వంటి పారిశ్రామిక సంఘాల సమష్టి కృషితో వాటిని సమర్థంగా పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలతో మమేకమవడంలో అసోచామ్ పాత్రను ఆయన ప్రశంసించారు. విధానపరమైన చర్చలు, వాణిజ్య సౌలభ్యం, అంతర్జాతీయ సహకారంలో ఈ సంస్థ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉందని అన్నారు. సమష్టి సంకల్పం, సమష్టి కృషి, నిబద్ధతతో భారత్ సవాళ్లను అధిగమిస్తూనే, 2047 నాటికి అభివృద్ధి చెందిన, స్వావలంబన గల దేశంగా స్థిరంగా ముందుకు సాగగలదని శ్రీ గోయల్ అన్నారు.
***
(Release ID: 2180749)
Visitor Counter : 5