రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ ఖాతాల విభాగం 214వ ‘స్పర్శ్’ ప్రజాసంబంధాల కార్యక్రమాన్ని కేరళలో నిర్వహించిన సీజీడీఏ
Posted On:
17 OCT 2025 2:15PM by PIB Hyderabad
రక్షణ ఖాతాల విభాగం 214వ ‘స్పర్శ్’ ప్రజాసంబంధాల కార్యక్రమాన్ని, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీజీడీఏ) ఈ నెల 16న కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించింది. కేరళ గవర్నరు శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరువనంతపురం, చుట్టుపక్కల జిల్లాల నుంచి రక్షణ శాఖకు ఇదివరకు సేవలను అందించిన వారు, కుటుంబ పింఛనుదారులు 1100 కన్నా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్పర్శ్ ద్వారా ఫిర్యాదులకు పరిష్కారాన్ని అందుకున్న అయిదుగురు రక్షణ శాఖ పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులకు రూ.40 లక్షల విలువైన చెక్కులను కేరళ గవర్నరు ఈ సందర్భంగా అందజేశారు. ఆయన ఆరుగురు వీర నారులను కూడా సత్కరించారు. ఈ ఆరుగురి భర్తలు యుద్ధభూమిలో కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రాణత్యాగానికైనా సరే, వెనుదీయలేదు.
వీర నారుల త్యాగాలను గవర్నరు ప్రశంసించారు. వారిని ఆయన ‘‘వీర మాతలు’’గా కొనియాడారు. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో స్పర్శ్ సేవాకేంద్రాలను ప్రారంభించినందుకు రక్షణ ఖాతాల విభాగాన్ని ఆయన అభినందించారు. స్పర్శ్ సేవాకేంద్రాల సేవలు రాష్ట్రమంతటికీ అందేలా చూడడానికి స్పర్శ్ సేవాకేంద్రాలను మరో రెండిటిని ఇడుక్కీలోనూ, మలప్పురంలోనూ ప్రారంభించాల్సిందిగా రక్షణ విభాగానికి ఆయన విజ్ఞప్తి చేశారు. స్పర్శ్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో రక్షణ శాఖ పింఛనుదారులకూ, కుటుంబ పింఛనుదారులకూ సాయపడడానికి సీజీడీఏ ప్రధాన కేంద్రం సమన్వయంతో 30 సహాయక విభాగాలనూ, ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా పనిచేస్తున్న పీసీడీఏ (పింఛన్లు) సమన్వయంతో ఎనిమిది రికార్డు కార్యాలయాలనూ, నాలుగు బ్యాంకులనూ, ఇతర ఏజెన్సీలనూ ఏర్పాటు చేసినందుకు సీడీఏ చెన్నైని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సీజీడీఏ, న్యూఢిల్లీ శ్రీ రాజ్ కుమార్ అరోడా, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీడీఏ), చెన్నై శ్రీ టి. జయశీలన్‌లు పాల్గొన్నారు. గరిష్ఠ సంఖ్యలో ఫిర్యాదులను పరిష్కరించడానికీ, పింఛనుకు సంబంధించిన సేవలను పింఛనుదారుల ఇంటి ముంగిటే అందించడానికీ దేశం నలుమూలలా స్పర్శ్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ రాజ్ కుమార్ అరోడా చెప్పారు. 20 లక్షల కన్నా ఎక్కువ మంది రక్షణ శాఖ పింఛనుదారులకూ, కుటుంబ పింఛనుదారులకూ 3 సంవత్సరాల నుంచి చెల్లించవలసి ఉన్న ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’ (ఓఆర్ఓపీ) తాలూకు రూ.1200 కోట్లకు పైగా మొత్తాన్ని సీజీడీఏ 15 రోజుల స్వల్ప వ్యవధిలో అందజేసిందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
***
(Release ID: 2180398)
Visitor Counter : 12