రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో భారత్, ఇథియోపియాల తొలి సంయుక్త రక్షణ సహకార సమావేశం.. ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయానికి ఇది నాంది
Posted On:
15 OCT 2025 10:36PM by PIB Hyderabad
భారత్, ఇథియోపియాల మధ్య ఒకటో సంయుక్త రక్షణ సహకార (జేడీసీ) సమావేశాన్ని ఈ నెల 15న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంతో, ఉభయ దేశాలూ రక్షణ సంబంధాల విస్తరణ బాటలో ముందడుగు వేసినట్లయింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి (అంతర్జాతీయ సహకారం) శ్రీ అమితాభ్ ప్రసాద్, రక్షణ సంబంధిత విదేశీ వ్యవహారాలు, సైన్య సహకార డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తెశోం గెమేచూలు సహాధ్యక్షత వహించారు.
సమావేశంలో ఇరుపక్షాలూ ప్రస్తుత రక్షణ సహకారాన్ని సమీక్షించాయి. శిక్షణ, సంయుక్త సైన్య విన్యాసాలు, వైద్యపరమైన సహకారం, రక్షణ పరిశ్రమల మధ్య సహకారం.. ఈ రంగాల్లో కొత్త అవకాశాలపైనా సమావేశంలో చర్చించారు. రక్షణ రంగ సహకార కార్యకలాపాలను మరింత బలపరచుకోవడంతో పాటు విభిన్న కార్యక్రమాలను చేపట్టాలని ఉభయ ప్రతినిధి వర్గాలు అంగీకరించాయి.
భారత్, ఇథియోపియా రక్షణ శాఖ మంత్రుల మధ్య 2025లో కుదిరిన రక్షణ సహకార అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థాగత తంత్రంలో ఈ సమావేశం ఓ భాగం. రెండు దేశాల మధ్య క్రమం తప్పక బృందాల రాకపోకలకు తోడు, వ్యూహాత్మక చర్చకు ఒక పటిష్ఠ వ్యవస్థకు కూడా ఆ ఎంఓయూ మార్గాన్ని సుగమం చేసింది.
ఆఫ్రికాలో భారత్‌కు రక్షణ భాగస్వాములుగా ఉన్న ప్రముఖ దేశాల్లో ఇథియోపియా కూడా ఒకటి. ఇథియోపియాతో 1958 నుంచీ రక్షణ సహకారం కొనసాగుతుండడమే కాక ఈ సంబంధం అంతకంతకూ బలపడుతోంది. భారత్ ఈ నెల 14, 16 తేదీల మధ్య యునైటెడ్ నేన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ (యూఎన్‌టీసీసీ) ప్రధానాధికారుల సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహిస్తుండగా ఈ సమావేశంలో ఇథియోపియా సైన్య ప్రధానాధికారి పాల్గొనడం ఇరు దేశాల మధ్య సంబంధాలకు అద్దం పడుతోంది.
రక్షణ రంగానికి మించి, భారత్ ఇథియోపియాల మధ్య చారిత్రక సంబంధాలూ, నాగరికతా పరమైన సంబంధాలూ 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. రెండు దేశాలూ 1950లో పూర్తి స్థాయిలో దౌత్య సంబంధాలను నెలకొల్పుకొన్నాయి. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, సంస్కృతి, విద్య, అభివృద్ధి రంగాల్లో సహకారం వృద్ధి చెందుతోంది.
జేడీసీ తొలి సమావేశాన్ని ఫలప్రదంగా నిర్వహించడం భారత్, ఇథియోపియాల మధ్య రోజురోజుకూ విస్తరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తెలియజేస్తోంది. ఇది ఇరు పక్షాల ప్రయోజనాలూ ముడిపడ్డ రంగాల్లో సహకారాన్ని ఇప్పటికన్నా మరింత ఎక్కువ స్థాయికి పెంచుకోవాలన్న ఉమ్మడి నిబద్ధతనూ పునరుద్ఘాటిస్తోంది. ఈ సమావేశంలో పాలుపంచుకున్న భారతీయ ప్రతినిధి వర్గంలో త్రివిధ దళాల రక్షణ విభాగం (డీఓడీ), ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (హెచ్‌క్యూ ఐడీఎస్), రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ)తో పాటు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు.
***
(Release ID: 2179939)
Visitor Counter : 10