గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పురోగతిని సమీక్షించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


ఈశాన్య ప్రాంతంలో గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి పిలుపు

త్వరలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశం

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పురోగతిపై చర్చ- తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో రహదారుల పాత్ర కీలకమని వ్యాఖ్య

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మారిన గ్రామాల ముఖచిత్రం, భవిష్యత్తు

2025 డిసెంబరులో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న పీఎమ్‌జీఎస్‌వై-ఈ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వేడుకలు

प्रविष्टि तिथि: 16 OCT 2025 3:54PM by PIB Hyderabad

ఈ రోజు న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎమ్‌జీఎస్‌వై) పురోగతిని సమీక్షించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో అధికారులు రాష్ట్రాల వారీగా పీఎమ్‌జీఎస్‌వై పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని కొండ ప్రాంతాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పనుల వేగం తాత్కాలికంగా మందగించినప్పటికీ, మిగతా అన్ని ప్రాంతాల్లో పథకం అమలు సజావుగా సాగుతోందని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు.

ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్ సహా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలపై సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈశాన్య ప్రాంతంలో ప్రయత్నాలను ముమ్మరం చేయాలని శ్రీ చౌహాన్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని తన అధ్యక్షతన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పీఎమ్‌జీఎస్‌వై, ఎంజీఎన్ఆర్ఈజీఏ, నైపుణ్యాభివృద్ధి, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ సహా అన్ని పథకాలను సమర్థంగా, నిర్ణీత సమయంలో అమలు చేసేలా అన్ని గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

2025 డిసెంబరులో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 25వ వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్త వేడుకల ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గ్రామీణ భారతంలో పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చిన చరిత్రాత్మక కార్యక్రమంగా పీఎమ్‌జీఎస్‌వైని శ్రీ చౌహాన్ అభివర్ణించారు. “ఈ పథకం మన గ్రామాల దశను, దిశనూ రెండింటినీ మార్చివేసింది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన విజయం” అని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రభావాన్ని ప్రజలకు వివరించడం కోసం పీఎమ్‌జీఎస్‌వై 25 సంవత్సరాల విజయగాథపై సమగ్ర నివేదికను రూపొందించి విడుదల చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు.

పనులను మరింత వేగవంతం చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఏవైనా సవాళ్లను వెంటనే పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి అధికారులను కోరారు. అన్ని రహదారి నిర్మాణ ప్రాజెక్టులు అధిక నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, నిర్ణీత సమయాల్లో పనులను పూర్తి చేయాలని, సమ్మిళిత గ్రామీణాభివృద్ధికి తోడ్పడే మన్నికైన మౌలిక సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేస్తూ ఆయన సమావేశాన్ని ముగించారు.

 

 

***

 

(रिलीज़ आईडी: 2179925) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali-TR , Gujarati , Tamil , Kannada