వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సాంకేతికత, ఆవిష్కరణల్లో ముందుంటూ ప్రపంచస్థాయిలో భారత్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్న రసాయనాలు, పెట్రోకెమికల్ పరిశ్రమ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్
భారత వృద్ధి అంచనాను ఐఎమ్ఎఫ్ పెంచడం దేశ ఆర్థిక సామర్థ్యం, బలమైన మూలాలకు నిదర్శనం: శ్రీ గోయల్
Posted On:
15 OCT 2025 5:46PM by PIB Hyderabad
కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం.. ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు అత్యాధునిక పరిష్కారాలను అందించడం ద్వారా దేశాన్ని అగ్రగామిగా మార్చడంలో రసాయనాలు, పెట్రోకెమికల్ పరిశ్రమ ముందంజలో ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ రోజు సీఐఐ నిర్వహించిన 7వ భారతీయ రసాయనాలు, పెట్రోకెమికల్స్ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.
సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనాన్ని చేకూర్చే సమతుల్య వృద్ధిని నిర్ధారించడం, దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రపంచ వేదికపై దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రభుత్వ విధానాల లక్ష్యమని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి 2025లో భారత వృద్ధి అంచనాను 6.6 శాతానికి సవరించిందని, ఇది దాని మునుపటి అంచనా 6.4 శాతం కంటే మరింత పెరుగుదలను సూచిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇది దేశ ఆర్థిక సామర్థ్యానికీ, బలమైన ఆర్థిక మూలాలకు నిదర్శనమన్నారు.
సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించడం ద్వారానే ఈ హోదాను సాధించాయని, భారత్ తన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ మార్గాన్ని అనుసరించాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశాలు కూడా విలువ ఆధారిత ఉత్పత్తులు, పరిశుద్ధ ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ఇది ఆవిష్కరణ ఆధారిత వృద్ధి దిశగా ప్రపంచ మార్పును ప్రదర్శిస్తుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గులను ఎదుర్కొంటోందనీ.. అయితే వాతావరణ మార్పులను పరిష్కరించడంతో పాటు సాంకేతికంగా పురోగతి సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి, వికసిత్ భారత్ దార్శనికతను సాధించడానికి సైన్స్, పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణలు ఎంతో కీలకమని శ్రీ గోయల్ తెలిపారు.
దేశం మొత్తం అభివృద్ధిలో రసాయనాలు, పెట్రోకెమికల్ పరిశ్రమ గణనీయమైన సామర్థ్యాన్ని, దాని వ్యూహాత్మక పాత్రను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, ఇంధనం, రవాణా వంటి బహుళ రంగాల్లో ఈ పరిశ్రమ విస్తృత అనువర్తనాలు, ప్రభావాన్నీ కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, సేవలు విస్తరించాయనీ.. తయారీ, వినియోగ వ్యవస్థలో దాదాపు ప్రతి అంశాన్నీ ఇవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తాయని ఆయన తెలిపారు. పరిశ్రమ నాయకులు తమ బలాలను జాగ్రత్తగా అంచనా వేస్తూ, ప్రపంచస్థాయిలో భారత్ సమర్థమైన ప్రయోజనాలను పొందగల ప్రాంతాలను గుర్తించాలని శ్రీ గోయల్ కోరారు. ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను పెంచడం ద్వారా, ప్రస్తుత నామమాత్రపు సహకారాలను మించి అంతర్జాతీయ వాణిజ్య నాయకత్వం లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సమర్థమైన సరుకు రవాణాతో పాటు, అనేక దేశాలకు సరుకులు రవాణా చేయడం కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఒకే సరఫరాదారు లేదా పరిమిత సంఖ్యలో దేశాలపై ఆధారపడటం వల్ల వెనకబడిపోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఉత్పత్తుల్లో స్వయం-సమృద్ధినీ, సురక్షితమైన సరుకు రవాణాను నిర్ధారించడానికి దేశీయ భద్రత అవసరం అయినప్పటికీ.. సామర్థ్యం, పోటీతత్వం, సుస్థిరమైన వృద్ధిని సాధించడానికి ఈ రంగం ప్రపంచ మార్కెట్లతో ఏకీకృతం కావాలని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
దేశీయ పరిశ్రమలు పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం కావడానికి భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాన్ని శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లతో క్రియాశీల భాగస్వామ్యం, వాణిజ్యానికి అవకాశాలను అన్వేషించడం, పెట్టుబడులను ఆకర్షించడం, అదే సమయంలో ప్రపంచ సమగ్రత-దేశీయ పరిశ్రమల రక్షణ మధ్య సమతుల్యతను కొనసాగించడం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చించడం.. ప్రపంచస్థాయి వాణిజ్య కార్యకలాపాలను విస్తరించడంపై తమ ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, లీక్టెన్స్టెయిన్, నార్వే, ఐస్ల్యాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ సహా అనేక దేశాలు, ప్రాంతాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఆయన ప్రస్తావించారు. భారతీయ ఉత్పత్తుల కోసం అనేక మార్కెట్లు అందుబాటులో ఉండేలా చేయడం.. సాంకేతికతనూ, పెట్టుబడులను ఆకర్షించడం.. ఆవిష్కరణ ఆధారిత రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా ఈ వాణిజ్య భాగస్వామ్యాలను రూపొందించామని కేంద్ర మంత్రి తెలిపారు. దేశీయ పరిశ్రమలు అనవసరమైన ముప్పునకు గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనీ శ్రీ గోయల్ పేర్కొన్నారు. భారతీయ వ్యాపారాలు అంతర్జాతీయంగా పోటీ పడేందుకు వీలు కల్పించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దేశీయ ఉత్పత్తిని రక్షిస్తూనే 140 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ద్వారా సున్నితమైన సమతుల్యతను సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రపంచ సమైక్యతను కోరుకుంటున్నప్పటికీ.. మార్కెట్ డైనమిక్స్, సమర్థమైన సరుకు రవాణా, పరిశ్రమ-వినియోగదారులకు ప్రయోజనాన్ని చేకూర్చే న్యాయమైన, స్థిరమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
పరిశ్రమలో భాగస్వాములు పరస్పర సహకారంతో పనిచేయాలనీ, వాణిజ్య కార్యకలాపాలన్నింటిలో పరస్పర మద్దతు అవసరమని, ఎగుమతులను ప్రభావితం చేసే ప్రిడేటరీ ప్రైసింగ్, డంపింగ్, నాన్-టారిఫ్ అవరోధాలను గురించి చర్చించాలని కేంద్ర మంత్రి కోరారు. పరిశ్రమ ప్రయోజనాలను కాపాడటానికి మంత్రిత్వ శాఖ సకాలంలో జోక్యం చేసుకుంటుందనీ, పరిష్కారాలనూ అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యాపార సౌలభ్యాన్ని పెంచడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి విధానాలను సరళీకరించడం, అనుమతుల భారాన్ని తగ్గించడం, చిన్న నేరాలను నేరరహితం చేయడం వంటివి సూచించాలని శ్రీ గోయల్ పరిశ్రమను ప్రోత్సహించారు. ఆధునికీకరణ, సామర్థ్యాలు... వృద్ధినీ, పోటీతత్వాన్ని ఎలా పెంపొందిస్తాయో పేర్కొంటూ, పేటెంట్ ప్రక్రియలు, మేధో సంపత్తి హక్కులలో సంస్కరణల ఉదాహరణలను ఆయన ఉటంకించారు.
ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో స్థిరమైన, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం పట్ల ప్రభుత్వ ధృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ శ్రీ గోయల్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక మార్గదర్శనం, నాయకత్వంలో భారత్ తన అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా క్రమంగా పురోగమిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
***
(Release ID: 2179666)
Visitor Counter : 5