రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సోనిక్‌లో ‘ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ హబ్‌’ సహా ‘మూలం నుంచి గమ్యం’ దాకా రెండు కొత్త సరకు రవాణా-పార్శిల్’ సేవలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శ్రీకారం


· “మూలం నుంచి గమ్యం’ దాకా సేవలు దేశానికెంతో ప్రధానం… వాటితో సామర్థ్యం పెరుగుదల సహా రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి”

· “ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ హబ్ ద్వారా ఎరువులు.. ఆహార ధాన్యాలు.. సిమెంట్.. ట్రాక్టర్లు సహా ‘మూలం నుంచి గమ్యం’ దాకా రవాణా-వస్తు సరఫరా సేవలు లభ్యం”

· “ట్రాక్టర్లు స్వల్ప రవాణా వ్యయంతో రైతులకు నేరుగా చేరుతాయి”

· “ఢిల్లీ-కోల్‌కతా మధ్య నిర్దిష్ట ‘ట్రాన్సిట్ కంటైనర్ రైళ్లు’.. ముంబయి-కోల్‌కతా మార్గంలో ‘మూలం నుంచి గమ్యం’ దాకా పార్శిల్ సేవలను రైల్వే ప్రారంభించింది”

· “కంకోర్‌’ (కంటెయినర్‌ కార్పొరేషన్‌) ఇ-లాజిస్టిక్స్ మొబైల్ యాప్‌ ద్వారా తొలి అంచె నుంచి తుది అంచెదాకా నిరంతరాయ రవాణాకు భరోసా”

· “రోడ్డు రవాణాతో పోలిస్తే ముంబై-కోల్‌కతా మధ్య 7.5 శాతం ఖర్చు ఆదా.. 30 శాతం అదనపు వేగంతో ‘మూలం నుంచి గమ్యం’ దాకా రవాణా-పార్శిల్‌ సేవలు”

Posted On: 14 OCT 2025 7:25PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని సోనిక్‌లో సమీకృత రవాణా కూడలి (ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ హబ్‌)తోపాటు రెండు కొత్త ‘మూలం నుంచి గమ్యం’ దాకా రవాణా-పార్శిల్ సేవలను కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు ప్రత్యక్ష సాదృశ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

‘మూలం నుంచి గమ్యం’ దాకా సేవలు దేశానికెంతో ప్రధానమని, తద్వారా సామర్థ్యం ఇనుమడించడతో పాటు రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పారు. పరిశ్రమలు నిర్దిష్ట సంఖ్యలో కంటెయినర్ల ద్వారా తమ ఉత్పత్తులను గమ్యానికి పంపవచ్చునని, ఇకపై రవాణా రైలు మొత్తాన్నీ అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ‘మూలం నుంచి గమ్యం’ దాకా సమగ్ర సేవలతో ఫ్యాక్టరీలు, రైళ్ల లోడింగ్-అన్‌లోడింగ్ కేంద్రాల మధ్య రవాణా సదుపాయంలో అంతరాన్ని భారతీయ రైల్వేలు తొలగిస్తాయని ఆయన పేర్కొన్నారు. కంటైనర్లు ఎక్కించడానికి, దించడానికి తగిన సౌకర్యాలను గూడ్స్ షెడ్లు లేదా రవాణా టెర్మినళ్లలో కల్పిస్తామన్నారు. తద్వారా వినియోగదారులు ఈ కొత్త సేవా ప్రదానం ద్వారా సంపూర్ణ ప్రయోజనం పొందవచ్చునని సూచించారు.

సోనిక్‌ గ్రామం ఈ సౌకర్యం సమకూర్చే తొలి ‘సమీకృత రవాణా కూడలి’గా రూపొందిందని తెలిపారు. ‘గతి శక్తి కార్గో టెర్మినల్స్’ కార్యక్రమం కింద ఈ బహుళ రవాణా సేవల ప్రదానం కోసం 115 టెర్మినళ్లను ఏర్పాటు చేశామని, వీటిద్వారా వినియోగదారులకు గణనీయ ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పారు.

ముంబయి-కోల్‌కతా కారిడార్‌తో ప్రారంభమైన ఈ సదుపాయం వస్తువుల నిరంతరాయ రవాణాకు భరోసా ఇస్తుందని శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. దీంతోపాటు ఇతర కీలక నగరాలకు ఈ సంధాన సౌకర్యాన్ని విస్తరిస్తూ మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాకుండా రైతుల ప్రయోజనార్థం స్వల్ప వ్యయంతో ట్రాక్టర్ల వంటి వ్యవసాయ ఉపకరణాలను నేరుగా చేరవేసే మరో ప్రయోగాత్మక రవాణా కార్యక్రమం కూడా విజయవంతమైందని మంత్రి తెలిపారు. కార్ల తరలింపును సమర్థంగా నిర్వహిస్తున్న రీతిలో ఇకపై ట్రాక్టర్లు, పొక్లెయినర్ల (జేసీబీ)వంటి భారీ పరికరాలకూ ఈ సౌకర్యాన్ని విస్తరింపజేస్తామని ఆయన వివరించారు.

రైల్వే బోర్డు చైర్మన్-సీఈవో శ్రీ సతీష్ కుమార్ మాట్లాడుతూ- ‘మూలం నుంచి గమ్యం’ దాకా కార్యక్రమం రైలు ఆధారిత రవాణాలో ఒక వినూత్న పరిణామాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు భారతీయ రైల్వేలు సరకును గిడ్డంగి యజమాని లేదా ఫ్యాక్టరీ నుంచి స్వీకరించి, నేరుగా గమ్యస్థానానికి చేరవేస్తాయి. వికసిత భారత్ రవాణా సదుపాయాల దృక్కోణానికి అనుగుణంగా సరకు రవాణాదారు పాత్ర నుంచి వినియోగదారులకు సకల రవాణా సదుపాయాలు అందించగల వ్యవస్థగా భారతీయ రైల్వేల ప్రగతిశీల మార్పును ఈ కార్యక్రమం సూచిస్తున్నదని తెలిపారు.

ఏటా 1.6 బిలియన్ టన్నుల వస్తువులను రవాణా చేస్తున్న భారతీయ రైలు ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద సరకు రవాణా సంస్థగా పరిగణనలో ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.

సమీకృత రవాణా కూడలి: సేవలు

1.  సమీకృత రవాణా కూడలిగా రైల్వే గూడ్స్‌ షెడ్లు (సోనిక్‌, లక్నో డివిజన్‌)

వ్యూహాత్మక స్థానం: ఈ టెర్మినల్ లక్నో నుంచి దాదాపు 50 కిలోమీటర్లు, కాన్పూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల రాష్ట్ర రాజధానితో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రాన్ని ప్రయోజనకరంగా అనుసంధానిస్తుంది.

సమగ్ర సేవలు: కాన్పూర్-లక్నో ప్రాంతాల్లో నానాటికీ పెరుగుతున్న రవాణా అవసరాలను ఈ కూడలి తీర్చగలదు. వినియోగదారులకు ‘మూలం నుంచి గమ్యం’ దాకా రవాణా, సరకుల సంబంధిత పంపిణీ కేంద్రాలు, వస్తు నిర్వహణ సేవలు సహా 'మొదలు నుంచి తుది' దాకా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.

ఆచరణాత్మక నిర్వహణ: అన్నిరకాల టెర్మినల్‌ కార్యకలాపాలను ‘కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (కంకోర్‌) నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తొలి, తుది అంచెల అనుసంధాన సదుపాయంతో సరకుల రవాణాకు భరోసా ఇస్తుంది.

నిర్వహించే సరకులు: ఈ టెర్మినల్‌లో ఎరువులు, ఆహార ధాన్యాలు, సిమెంట్, ట్రాక్టర్లు సహా విభిన్న శ్రేణి వస్తు నిర్వహణ సదుపాయాలున్నాయి.

మౌలిక సదుపాయాలు: ఇక్కడ అత్యాధునిక సదుపాయాలు సహా ‘మూలం నుంచి గమ్యం’ దాకా రవాణా సేవల లభ్యతతోపాటు వినియోగదారులు-కార్మికులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి.

2.  నిర్దిష్ట రవాణా కంటైనర్ రైలు సేవ (ఢిల్లీ-కోల్‌కతా మార్గం)

లక్ష్యం - మార్గం: ఈ అధిక మూల్యంగల సేవలు రవాణా వ్యవధికి నిర్దిష్ట హామీ ఇస్తాయి. అంటే- రోడ్డు రవాణాకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఈ మార్గం ఢిల్లీ-ఆగ్రా-కాన్పూర్-కోల్‌కతా నగరాలను జోడిస్తుంది.

కీలక సేవల పారామితులు:

·      నిర్దిష్ట రవాణా సమయం: 120 గంటలు

·      రవాణా వ్యవధులు: వారంలో రెండు (ప్రతి బుధ, శని) రోజులు బయల్దేరుతాయి

కార్యకలాపాలు: తుగ్లకాబాద్ (ఢిల్లీ), ఆగ్రా, కాన్పూర్ (ఐసీడీజీ సైడింగ్), కోల్‌కతా (ఐసీడీజీ సైడింగ్) మధ్య టెర్మినళ్లలో లోడింగ్-అన్‌లోడింగ్ (లిఫ్ట్ ఆన్/లిఫ్ట్ ఆఫ్) కార్యకలాపాలు ఈ సేవలలో భాగంగా ఉంటాయి. ప్రతి ప్రదేశంలో ప్రామాణిక నిలుపుదల సమయం 6 గంటలుగా ఉంటుంది.

బుకింగ్‌ సరళం: వినియోగదారులు తమ సరఫరా వ్యవస్థ అవసరాలకు తగినట్లు “మూలం నుంచి గమ్యం’, ‘మూలం నుంచి టెర్మినల్’, ‘టెర్మినల్ నుంచి గమ్యం’, ‘టెర్మినల్ నుంచి టెర్మినల్” వంటి బుకింగ్‌ పద్ధతులలో దేన్నయినా ఎంచుకోవచ్చు.

డిజిటల్‌ ఏకీకరణ: నిర్దిష్ట రవాణా సేవ కోసం తొలి అంచె నుంచి తుది అంచె సేవలను వినియోగదారు హిత ‘కంకోర్‌ ఇ-లాజిస్టిక్స్’ మొబైల్ యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవడమేగాక స్వయంగా నిర్వహించుకోవచ్చు.

3.  రైల్వే పార్శిల్ వ్యాన్ (ముంబయి-కోల్‌కతా మధ్య) ద్వారా ‘మూలం నుంచి గమ్యం’ దాకా పార్శిల్ సేవలు బుక్‌ చేసుకోవచ్చు.

సేవల విధానం: ఈ సమీకృత సేవలో మూడు భాగాల ప్రక్రియ ఉంటుంది:

·      తొలి అంచె: ‘కంకోర్‌’ ధ్రువీకృత వ్యాపార అనుబంధ సంస్థల నిర్వహణలో ఉంటుంది.

·      మధ్య అంచె: భారతీయ రైల్వేల పార్శిల్‌ సర్వీసు ద్వారా ప్రధాన రవాణా 48 నుంచి 60 గంటల కచ్చితమైన వ్యవధితో సాగుతుంది.

·      తుది అంచె:  తుది సరఫరా సేవను ‘కంకోర్‌’ ధ్రువీకృత వ్యాపార అనుబంధ సంస్థలే అందిస్తాయి.

ప్రయోగాత్మక మార్గం - వినియోగదారులు: ఈ సేవ ప్రస్తుతం ముంబయి (భివాండీ రోడ్)-కోల్‌కతా (సంక్రైల్) మార్గంలో 1930 కిలోమీటర్ల మేర లభిస్తోంది. ఈ మేరకు “కాస్ట్రోల్ ఇండియా (లూబ్ ఆయిల్), వీఐపీ ఇండస్ట్రీస్ (బ్యాగ్స్), గోద్రేజ్ అండ్‌ బోయ్స్ మాన్యుఫాక్చరింగ్‌ లిమిటెడ్ (రిఫ్రిజిరేటర్లు, కన్స్యూమర్ డ్యూరబుల్స్), నెస్లే (ఎఫ్‌ఎంసీసీ ఉత్పత్తులు) వంటి ప్రధాన కంపెనీల సరకులను విజయవంతంగా నిర్వహిస్తోంది.

మౌలిక సదుపాయాల తోడ్పాటు: ముంబయి, కోల్‌కతా కూడళ్లలో విశాలమైన 5400 సీఎఫ్‌టీ విస్తీర్ణంలోగల సరకుల నిల్వ సదుపాయం ఈ సేవల ప్రదానంలో తోడ్పడుతుంది.

రోడ్డు రవాణాతో పోలిస్తే 7.5 శాతం ఖర్చు తగ్గుదల సహా 30 శాతం అదనపు వేగంతో ‘మూలం నుంచి గమ్యం’ దాకా రవాణా-పార్శిల్ సేవలు లభిస్తాయి కాబట్టి సమయం కూడా కలిసివస్తుంది.

 

***


(Release ID: 2179273) Visitor Counter : 3