|
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి గతిశక్తి’కి నాలుగేళ్లు: వివిధ పరిణామాత్మక కార్యక్రమాలకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ శ్రీకారం
· సమీకృత డేటా ఆధారిత ప్రణాళికలో భాగంగా 112 ఆకాంక్షాత్మక జిల్లాల్లో జిల్లా బృహత్ ప్రణాళిక దశలవారీగా అమలు · విజ్ఞాన నిర్వహణ వ్యవస్థ ద్వారా మంత్రిత్వ శాఖలు-విభాగాలు.. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనుసరణ.. పరిమాణ వృద్ధి.. పరస్పర నైపుణ్యాభివృద్ధి బలోపేతం · ‘ఎన్‌ఎంపీ’ డాష్‌బోర్డ్.. వికేంద్రీకృత డేటా అప్‌లోడింగ్ వ్యవస్థతో పారదర్శకత.. సామర్థ్యం.. బహుళ-రంగ సమన్వయం మెరుగుదల · మౌలిక సదుపాయాలు, సామాజిక-ఆర్థిక రంగాల్లో క్షేత్రస్థాయి విజయాలను సంగ్రహ సంపుటం-3 వెల్లడిస్తుంది
प्रविष्टि तिथि:
13 OCT 2025 5:36PM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక’ (ఎన్‌ఎంపీ)కు నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ వివిధ పరిణామాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతర్గత వాణిజ్యం-పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)లోని లాజిస్టిక్స్ విభాగం ఈ కార్యక్రమాలను రూపొందించింది. మౌలిక సదుపాయాల ప్రణాళిక బలోపేతం, చివరి అంచెదాకా అనుసంధానం మెరుగుదల, సమగ్రాభివృద్ధికి తోడ్పడే మౌలిక వసతులకు భరోసా ద్వారా సామాజిక-ఆర్థిక ప్రగతిని వేగిరపరచడమే వీటి లక్ష్యం.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ గోయల్ మాట్లాడుతూ- వివిధ రాష్ట్రాల పరిధిలోని 28 ఆకాంక్షాత్మక జిల్లాల కోసం కేంద్ర ప్రభుత్వం 2024 అక్టోబరులో ‘పీఎం గతిశక్తి’ కింద జిల్లాస్థాయి బృహత్ప్రణాళికను (పీఎంజీఎస్-డీఎంపీ) రూపొందించి, అమలులోకి తెచ్చిందని గుర్తుచేశారు. ‘పీఎం గతిశక్తి’ వేదిక ద్వారా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, రోడ్లు, నీటి సరఫరా పైపులైన్ల వంటి కీలక సామాజిక-ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన సంబంధిత భూగోళ-ప్రాదేశిక ప్రణాళికల అమలుకు ‘డీఎంపీ’ తోడ్పడుతుంది.
పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, రోడ్లు, నీటి సరఫరా పైప్‌లైన్ల నిర్మాణం దిశగా ఐదు రంగాల్లో ప్రణాళికల సమర్థ రూపకల్పన లక్ష్యంగా నిర్దిష్ట ఉపకరణాలను రూపొందించారు. అటుపైన భాగంగా 2024 డిసెంబరులో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘బైశాగ్-ఎన్’ వద్ద జిల్లాస్థాయి బృందాల కోసం సమగ్ర సామర్థ్య వికాస శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు, జిల్లాల స్థాయి అధికారుల కోసం క్రమం తప్పకుండా ప్రాంతీయ వర్క్ షాప్‌లు, ఆన్‌లైన్ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం రూపొందించిన ప్రణాళికల కింద గుజరాత్‌లోని జిల్లాల పరిధిలో దామోహ్-జబల్‌పూర్ రహదారి 2 నుంచి 4 వరుసలకు విస్తరణ, దామోహ్‌లో సౌరపార్కుల ఏర్పాటు స్థల ఎంపిక, పాలన సరిహద్దు ప్రణాళిక, జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సరఫరా, కరెంటు లేని గ్రామాల్లో విద్యుదీకరణ, అనుసంధానం సదుపాయం లేని ఆవాసాలకు రహదారుల నిర్మాణం, బరాన్ జిల్లాలో వాటర్‌షెడ్ నిర్వహణ ప్రణాళిక వంటి అమలు వంటి ఆచరణాత్మక కార్యకలాపాలు కొనసాగించారు.
ఈ విజయాలు ప్రాతిపదికగా ‘పీఎంజీఎస్-డీఎంపీ’ని ఇప్పుడు 112 ఆకాంక్షాత్మక జిల్లాల్లో దశలవారీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశమంతటా సామాజిక-ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన కోసం డేటా ఆధారిత, సమగ్ర ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు.
శ్రీ గోయల్ ప్రారంభించిన వాటిలో మౌలిక సదుపాయాల ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయ విధానం, వివిధ రంగాల మధ్య సహకార విస్తృతి లక్ష్యంగా పలు పరిణామాత్మక కార్యక్రమాలున్నాయి. వీటిలో నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (కేఎంఎస్), వికేంద్రీకృత డేటా అప్‌లోడింగ్-నిర్వహణ వ్యవస్థ (డీయూఎంఎస్), బహుళ-రంగ, సమీకృత నివేదన వ్యవస్థ, ‘పీఎంజీఎస్-ఎన్‌ఎంపీ' డాష్‌బోర్డ్, ‘పీఎం గతిశక్తి’ సంగ్రహ సంపుటం-3 కూడా భాగంగా ఉన్నాయి.
గడచిన నాలుగేళ్లుగా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు వినూత్న చర్యలు చేపట్టాయని శ్రీ పీయూష్ గోయల్ ఈ సందర్భంగా చెప్పారు. ఇందులో భాగంగా డిజిటల్ ఉపకరణాలను రూపొందించాయని, మౌలిక సదుపాయాల కల్పన, నిర్ణయాత్మకత మెరుగుదల కోసం భూగోళ-ప్రాదేశిక ప్రణాళిక వినియోగం పద్ధతులకు రూపకల్పన చేశాయని వివరించారు. డిజిటల్ ఉపకరణాలు, వినియోగ ఉదాహరణలు, ‘ఎస్‌ఓపీ’లు, సంకలనాలు, శిక్షణ వనరులు తదితరాలకు నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (కేఎంఎస్) ఓ కేంద్రీకృత భాండాగారంగా ఉపయోగపడుతుంది. అలాగే వివిధ మంత్రిత్వ శాఖలు-విభాగాలు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనుసరణ, పరిమాణ వృద్ధి, పరస్పర నైపుణ్యాభివృద్ధి బలోపేతం తదితరాలను ఈ వ్యవస్థ ప్రోత్సహిస్తుంది.
‘కేఎంఎస్’లో సమీకృత ‘ఎన్‌ఎంపీ’ డాష్‌బోర్డ్ అత్యంత ప్రధాన భాగం. ఇది అందుబాటులోగల సమాచార దశలు, నమోదిత వినియోగదారులు, ప్రణాళికాబద్ధ ప్రాజెక్టులు, నివేదిత అంశాలపై ప్రత్యక్ష అవగాహనకు ఉపయోగపడుతుంది. బహుళ-రంగ, సమగ్ర నివేదన వ్యవస్థకు ప్రాతిపదికగా ఉంటుంది. వికేంద్రీకృత డేటా అప్‌లోడింగ్-నిర్వహణ వ్యవస్థ దీనికి అనుబంధంగా ఉంటుంది. నిర్దిష్ట నిర్వహణ వ్యవస్థల ద్వారా డేటా అప్‌లోడ్ సంబంధిత మూడు-దశల వర్క్ ఫ్లో, నోడల్ అధికారుల సమీక్ష సహా బైశాగ్-ఎన్’ ద్వారా తుది నివేదనతో కచ్చితమైన, ఏకరూప, జవాబుదారీ సమాచార నిర్వహణకు భరోసా ఇస్తుంది. అలాగే పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యం, బహుళ-రంగాల సమన్వయం మెరుగుపడేందుకు తోడ్పడుతుంది.
మౌలిక సదుపాయాలు, సామాజిక-ఆర్థిక రంగాల్ల విస్తృత క్షేత్రస్థాయి విజయగాథలను ‘పీఎం గతిశక్తి సంగ్రహ సంపుటం-3’ ప్రస్ఫుటం చేస్తుంది. దేశవ్యాప్తంగా సమగ్రాభివృద్ధికి దోహదం చేయడంలో, అనుసంధానం మెరుగుదలలో సర్వతోముఖ వృద్ధికి తోడ్పాటులో ‘పీఎం గతిశక్తి’కిగల పరిణామాత్మక ప్రభావాన్ని చాటుతుంది.
ఈ కార్యక్రమాలు ప్రారంభమైన నేపథ్యంలో సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక, డేటా-ఆధారిత పాలన, సమగ్రాభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ- ఆధునిక, అనుసంధానిత, పునరుత్థాన భారత్ దృక్కోణాన్ని ‘పీఎం గతిశక్తి’ మరింత బలోపేతం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2178754)
|