మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమన్వయం, ఆవిష్కరణ, సమ్మిళిత వృద్ధి ద్వారా దేశ వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చనున్న ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎం డీడీకేవై) - శ్రీ రాజీవ్ రంజన్ సింగ్.


రూ. 1,166 కోట్ల పశుసంవర్థక, రూ. 693 కోట్ల మత్స్య పరిశ్రమ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం/శంకుస్థాపనతో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ ఊపు

प्रविष्टि तिथि: 11 OCT 2025 4:36PM by PIB Hyderabad

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో సుస్థిరమైన,  సమగ్ర వృద్ధిని ప్రోత్సహించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎం డీడీకేవై) ను,  పప్పుధాన్యాల ఉత్పత్తిలోస్వయంసమృద్ధి మిషన్‍ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా, పశు సంవర్ధక రంగంలో రూ. 947 కోట్ల విలువైన 16 ప్రధాన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు.  రూ. 219 కోట్ల విలువైన ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే, మత్స్య రంగంలో రూ. 572 కోట్ల విలువైన ఏడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రూ. 121 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులను ప్రారంభించారు. కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, అలియాస్ లాలన్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగిస్తూ, సమన్వయం, ఆవిష్కరణ,  సమ్మిళిత అభివృద్ధి ద్వారా దేశంలోని వ్యవసాయ ఆధారిత జిల్లాలలో ఈ కార్యక్రమాలు గణనీయమైన మార్పు తెస్తాయని తెలిపారు.

2019లో ఏర్పాటయిన మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ ఈ రంగాలకు ప్రత్యేక విధాన మద్దతును అందించి, అభివృద్ధిని వేగవంతం చేసిందని శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. ఈ రంగాలు ఇప్పుడు 10 కోట్లమందికి పైగా ప్రజల సుస్థిర జీవనోపాధులకు తోడ్పడుతున్నాయని, వీరిలో 70% పైగా మహిళలు పాల ఉత్పత్తి రంగంలో పని చేస్తూ దేశంలో మహిళల సాధికారతను,  గ్రామీణ సౌభాగ్యాన్ని ప్రతిబింబిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై), మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ - ఎఫ్ఐడీఎఫ్) వంటి పథకాల ద్వారా, ఫిషింగ్ హార్బర్లు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, కోల్డ్ చైన్లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం మత్స్య రంగానికి ఎంతో  ప్రోత్సాహం లభించిందని శ్రీ సింగ్ తెలిపారు. భారత్ ఈ రోజు చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉందని, 2013-14లో 96 లక్షల టన్నుల నుంచి  2024-25లో 195 లక్షల టన్నులుగా 104 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన 693 కోట్ల రూపాయల విలువైన 16 ప్రధాన మత్స్య రంగ ప్రాజెక్టులు దేశంలో ఉత్పాదకత, ఎగుమతులు, ఉపాధిని మరింత పెంచుతాయని ఆయన తెలిపారు.

పాడి, పశుసంవర్ధక రంగాల విజయాల గురించి మాట్లాడుతూ, పాల ఉత్పత్తి 63 శాతం పెరిగిందని (2014-15లో 146 మిలియన్ టన్నుల నుంచి  2024-25లో 239 మిలియన్ టన్నులకు), పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. పశువులు,  గేదెల ఉత్పాదకత 25 శాతానికి పైగా పెరిగిందని (ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రేటు) ఆయన తెలిపారు. పశువుల ఆరోగ్యం విషయంలో, గాలికుంటు వ్యాధి, బ్రుసెల్లోసిస్, పిపిఆర్ వంటి వ్యాధుల నివారణకు ఉచిత జాతీయ టీకా కార్యక్రమాల కింద 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారని, తొమ్మిది రాష్ట్రాలు వేగంగా ఎఫ్ఎండీ రహిత స్థితి వైపు వేగంగా కదులుతున్నందున దేశం నుంచి పాల ఎగుమతులు ఇంకా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

రైతుల ఆదాయాన్ని పెంచడం, భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు  మత్స్య, పశుసంవర్ధక,  పాడి పరిశ్రమ రంగాలను ఆత్మనిర్భర్ భారత్ కు మూల స్తంభాలుగా నిలబెట్టాలన్న  ప్రధానమంత్రి దార్శనికతను పీఎం డీడీకేవై ప్రతిబింబిస్తుందని శ్రీ సింగ్ తెలిపారు. “గ్రామీణ సౌభాగ్యం నుంచి జాతీయ సౌభాగ్యం వరకు” నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత వృద్ధి, మెరుగైన జీవనోపాధి అవసరాన్ని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

 

****


(रिलीज़ आईडी: 2177968) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Urdu , Tamil