రక్షణ మంత్రిత్వ శాఖ
కాన్ బెర్రాలో ఆస్ట్రేలియా మంత్రితో రక్షణ మంత్రి ద్వైపాక్షిక సమావేశం
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు కలిసి రావాలని కోరిన రక్షణమంత్రి
ఉగ్రవాదం, చర్చలు.. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగవు... నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు: రక్షణ మంత్రి
సమాచార భాగస్వామ్యం, జలాంతర్గామి అన్వేషణ- రక్షణ సహకారం,
సంయుక్త సిబ్బంది చర్చల ఏర్పాటుపై విధివిధానాలకు సంబంధించి కీలక ఒప్పందాలు
Posted On:
09 OCT 2025 2:12PM by PIB Hyderabad
ఆస్ట్రేలియాలో రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్టోబర్ 9, 2025న కాన్ బెర్రాలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మిస్టర్ రిచర్డ్ మార్లెస్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో సైనిక విన్యాసాలు, సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమ సహకారం, సైన్స్ అండ్ టెక్నాలజీలో సంయుక్త పరిశోధన సహా రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఇరుదేశాలు సంసిద్ధతను తెలియజేశాయి.
భారత్-ఆస్ట్రేలియా మధ్య సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలే ఆధారమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి సంబంధాలు మెరుగయ్యాయని, రక్షణ రంగంలో సహకారం విస్తృతమైందని ఆయన తెలిపారు. సమాచార భాగస్వామ్యం, జలాంతర్గామి శోధన, రక్షణ సహకారం, సంయుక్త సిబ్బంది చర్చల ఏర్పాటుపై విధివిధానాలకు సంబంధించి సమావేశం చివర్లో మూడు ఒప్పందాలు కుదిరాయి.
ఈ సమావేశంలో ఉగ్రవాద ముప్పుపై భారత్ వైఖరిని స్పష్టం చేస్తూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని, ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి కొనసాగవని, నీళ్లు, రక్తం కలసి ప్రవహించలేవని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్ సాదర స్వాగతం పలికారు. మే 2025 ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అల్బనీస్‌కు అభినందనలు తెలిపిన రక్షణ మంత్రి... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అద్భుతమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, ముఖ్యంగా రక్షణ, సైబర్ భద్రత, ఐటీ రంగాల్లో సాధించిన అభివృద్ధిని శ్రీ ఆంథోనీ ఆల్బనీస్ ప్రశంసించారు. కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడాన్ని అభినందించిన ఆయన.. రాబోయే ఏళ్లలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఆసక్తి కనబరిచారు.
భారత్-ఆస్ట్రేలియా రక్షణ భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తూ ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని తెలియజేసేలా సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
పర్యటన ప్రారంభంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు ఆస్ట్రేలియా రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ పీటర్ ఖలీల్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రక్షణ మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కేసీ-30ఏ మల్టీరోల్ ట్రాన్స్పోర్ట్, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఆర్ టీటీ)... గాలిలో ఇంధనాన్ని నింపే ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించారు. ఇది కాన్‌బెర్రాకు వెళ్తున్న ఎఫ్-35 విమానానికి ఇంధనాన్ని నింపింది. గాలిలో ఇంధనం నింపే ఏర్పాట్ల అమలుపై గతేడాది కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి ఉమ్మడి కార్యాచరణ సామర్థ్య ప్రదర్శనగా ఇది నిలిచింది. ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న తర్వాత, శ్రీ రిచర్డ్ మార్లెస్ సమక్షంలో... రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు.
***
(Release ID: 2177524)
Visitor Counter : 9