సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార రంగాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జాతీయ స్థాయి వర్క్‌షాప్, సమీక్ష సమావేశం.. ప్రారంభించిన సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటాని


'సహకారంతో సమృద్ధి' దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోన్న సహకార ఉద్యమం

వ్యవసాయం, రుణాలు వంటి సంప్రదాయ రంగాలకు దాటి ఆరోగ్య సంరక్షణ, సేవలు, వాణిజ్య కార్యకలాపాల ఏకీకరణ వంటి రంగాలకు విస్తరిస్తోన్న సహకార సంస్థలు

పీఏసీఎస్ కార్యకలాపాలు పూర్తి డిజిటలైజ్ అయ్యేలా చూసుకోవటం, పీఏసీఎస్ సిబ్బంది- సభ్యుల డిజిటల్ నైపుణ్యాలను పెంచటం.. వ్యవసాయానికి కావాల్సిన వనరులు, రుణాలు, పంటల కొనుగోలు, నిల్వ వంటి సమగ్ర సేవలను అందించే ఏకైక కేంద్రాలుగా పీఏసీఎస్‌లు మారేందుకు వీలు కల్పించే పనులను ప్రధానంగా తెలియజేసిన వర్క్‌షాప్

వర్క్‌షాప్‌ ప్రధాన ఇతివృత్తాలలో ఒకటిగా నిలిచిన సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ ప్రణాళిక

అన్ని పంచాయతీలు, గ్రామాలలో రెండు లక్షల బహుళ ప్రయోజనాల ప్రాథమిక సహాకార సంఘాలు, పాడి- మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, బలోపేతంపై దృష్టిసారించిన వర్క్‌షాప్

అంతర్జాతీయ సహకార సంవత్సరం (ఐవైసీ) కింద ప్రధాన కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

ప్రామాణికతల ప్రకారం సహకార సంస్థలు సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుంటూ సహకార అవార్డులను ఇవ్వాలని కోరిన సహకార శాఖ

రాష్ట్రాల్లో సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి 'సంస్కరణ, పనితీరు, పరివర్తన, ఇతరులతో పంచుకోవటం’ అనే ఇతివృత్తం పని చేయాలని కోరిన సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి

Posted On: 09 OCT 2025 6:38PM by PIB Hyderabad

సహకార రంగాన్ని బలోపేతం చేయడంపై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్- సమీక్ష సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో నిర్వహించారు. సహకార మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రతినిధులు, కార్యదర్శులు, సహకార సంఘాల రిజిస్ట్రార్లు (ఆర్‌సీఎస్), సహకార రంగానికి చెందిన కీలక భాగస్వాములు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌ను సహాకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ భూటాని..  అదనపు కార్యదర్శి శ్రీ పంకజ్ కుమార్ బన్సాల్, మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భూటాని కీలకోపన్యాసం ఇచ్చారు. ‘సహాకారంతో సమృద్ధి’ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో సహకార ఉద్యమానికి ఉన్న కీలక పాత్రను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నేడు సహకార సంస్థలు.. వ్యవసాయం, రుణాలు వంటి సంప్రదాయ రంగాలకు మించి ఆరోగ్య సంరక్షణ, సేవలు, వాణిజ్య కార్యకలాపాల ఏకీకరణ వంటి రంగాలకు విస్తరించాయని పేర్కొన్నారు. సహకార సంస్థలను ప్రజా కేంద్రీకృత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వ్యవస్థలుగా ఉండేలా చూసుకునేందుకు సంస్థాగత, మానవ వనరుల అభివృద్ధికి సాంకేతిక పురోగతిని ఉపయోగించేందుకు మంత్రిత్వ శాఖ నిబద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

సహకార రంగ డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ పీఏసీఎస్, ఏఆర్‌డీబీలు, సహకార సంఘాల రిజిస్ట్రార్ల కార్యాలయాల కంప్యూటరీకరణపై ఒక ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. పీఏసీఎస్ కార్యకలాపాలు పూర్తిగా డిజిటలైజ్ అయ్యేలా చూసుకోవటం, పీఏసీఎస్ సిబ్బంది - సభ్యుల డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించటం.. వ్యవసాయ వనరులు, రుణాలు, పంటల కొనుగోళ్లు, నిల్వ వంటి సమగ్ర సేవలను అందించే ఒకే కేంద్రంగా పీఏసీఎస్‌లను మార్చేందుకు ఉపయోగపడే పనులకు ఈ చర్చల్లో ప్రముఖ స్థానం లభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం సాఫ్ట్‌వేర్ తయారు చేయటం, హార్డ్‌వేర్ కొనుగోళ్లు, సామర్థ్య నిర్మాణంలో సహకారంపై తాజా సమాచారాన్ని నాబార్డ్ తెలియజేసింది. 

సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వకు సంబంధించిన ప్రణాళిక ఈ సెషన్‌లో మరో ముఖ్యమైన అంశంగా ఉంది. ప్రయోగాత్మక దశలో 500 ప్యాక్స్‌తో ప్రారంభించే ఈ ప్రాజెక్ట్‌ను 29,000 ప్యాక్స్‌లకు విస్తరించనున్నారు. ఈ ప్రణాళిక అమలును వేగవంతం చేయడంపై వర్క్‌షాప్ దృష్టి సారించింది. వ్యాపార వైవిధ్యీకరణ ద్వారా గోడౌన్ల ఆర్థిక వెసులుబాటును చూసుకోవటం, భూ లభ్యత- సహకార సామర్థ్యాలు - కలిగి ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా ప్యాక్స్‌లను మ్యాపింగ్ చేయడం, కార్యకలాపాలు సుస్థిరంగా కొనసాగేలా చూసుకునేందుకు సాంకేతిక- నిర్వాహక మద్దతును అందించడం వంటి అంశాలను ప్రధానంగా చర్చించారు. 

ఈ సెషన్‌లో అన్ని పంచాయతీలు, గ్రామాలలో రెండు లక్షల బహుళ ప్రయోజనాల పీఏసీలు, పాడి పరిశ్రమ- మత్స్య సహకార సంఘాల ఏర్పాటు.. వాటి బలోపేతం గురించి కూడా చర్చించారు. కొత్త సహకార సంస్థల ఏర్పాటుకు ఆస్కారం ఉన్న జిల్లాలు, బ్లాక్‌లను గుర్తించడం.. వ్యాపారాన్ని మెరుగుపరచటం, వైవిధ్యీకరణ ద్వారా ఇప్పటికే ఉన్న సహకార సంస్థలను బలోపేతం చేయడం.. గ్రామీణ జీవనోపాధి కల్పనకు అట్టడుగు వరకు అనుసంధానత ఉండేలా చూసుకోవటంపై ఈ సెషన్ దృష్టి సారించింది. 

అంతర్జాతీయ సహకార సంవత్సరం (ఐపైసీ), మీడియా అనుసంధానతను ఈ వర్క్‌షాప్‌ ప్రత్యేక విభాగంగా తీసుకుంది. ఐవైసీ -2025కి ఉన్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోంది. దీనికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రియాశీలకంగా నిర్వహించాలని ఇది పిలుపునిచ్చింది. “తల్లి పేరు మీద ఒక చెట్టు” నామంతో చేపట్టిన మొక్కలను నాటే కార్యక్రమం వంటి కీలక కార్యక్రమాలను ప్రాముఖ్యత Fof ప్రస్తావించింది. కీలక ప్రామాణికతల ప్రకారం సహకార సంస్థలు సాధించిన పురోగతి పరిగణనలోకి తీసుకుంటూ సహకార అవార్డులను ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. ప్రజలను చేరుకోవటం అనే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ విభాగం ప్రముఖంగా ప్రస్తావించింది. ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఈ సెషన్ తెలియజేసింది. 

సహకార బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై మరో సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌ చర్చల్లో ఆర్‌బీఐ సీనియర్ అధికారులు కూడా చురుకుగా పాల్గొన్నారు.

సహకార రంగాన్ని బలోపేతం చేయడంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌ రెండో రోజు "వ్యాపార వైవిధ్యీకరణ ద్వారా ప్యాక్స్‌ల పరిధిని పెంచటం" అనే విషయంలో ఉత్తమ పద్ధతులపై దృష్టి సారిస్తూ ఉత్తమ పద్ధతులకు సంబంధించిన సెషన్‌తో ప్రారంభమైంది. ఈ విషయంలో కీలక కార్యక్రమాలపై కూడా ఈ సెషన్‌లో చర్చించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత ఉత్తమ పద్ధతులను హాజరైన వారితో పంచుకున్నాయి.

ఈ వర్క్‌షాప్ ఆత్మనిర్భర్‌ భారత్ అభియాన్ కింద నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్), భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ (బీబీఎస్ఎస్ఎల్) అనే మూడు జాతీయ స్థాయి బహుళ రాష్ట్రాల సహకార సంఘాల పురోగతిని కూడా సమీక్షించింది. 

మార్చి 2024లో ప్రారంభించిన జాతీయ సహకార డేటాబేస్ (ఎన్‌సీడీ) అమలును కూడా సహకార మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఎన్‌సీడీ పరిధిలోకి 30 రంగాలకు చెందిన 8.4 లక్షలకు పైగా సహకార సంస్థలు, 32 కోట్ల మంది సభ్యులు వస్తారు. సహకార కార్యకలాపాలు, ఆర్థిక ప్రదర్శన, ఆడిట్ పరిస్థితి, మౌలిక సదుపాయాలపై వివరణాత్మక సమాచారాన్ని ఎన్‌సీడీ అందిస్తుంది. 

ఇఫ్కో-టోకియో ప్రతినిధుల సమక్షంలో బీమా రంగంలో సహకార సంఘాల పాత్రపై చేపట్టిన చర్చ ఈ వర్క్‌షాప్‌లో మరో ముఖ్యమైన సెషన్‌గా ఉంది. 

వర్క్‌షాప్ చివరి సెషన్‌లో బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి రాష్ట్రాలకు సీఆర్‌సీఎస్ వివరించింది. మెరుగైన సమన్వయం కోసం రాష్ట్రాల సహాయం చేయాలని కోరింది.

వర్క్‌షాప్‌ ముగింపు సందర్భంగా సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడారు. వర్క్‌షాప్‌లో చేపట్టిన నిర్మాణాత్మక చర్చలను ఆయన ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధి, ఆత్మనిర్భరత, డిజిటల్ పరివర్తనకు ఉత్ప్రేరకంగా పీఏసీఎస్, బహుళ రాష్ట్రాల సహకార సంస్థల పాత్రను చెప్పారు. సహకార సంస్థలను ప్రభావవంతంగా నిర్వహించటం కోసం కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సహకారాన్ని పెంచడం, డిజిటల్ సాధనాలు- డేటా ఆధారిత పరిశీలనలను ఉపయోగించటానికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి 'సంస్కరణ, పనితీరు, పరివర్తన, ఇతరులతో పంచుకోవటం’ అనే ఇతివృత్తం ఆధారంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా సహాకార వ్యవస్థ సమానంగా అభివృద్ధి చెందేలా చూసుకునేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు డేటాను జాతీయ సహకార డేటాబేస్‌తో (ఎన్‌సీడీ) పంచుకోవాలని ఆయన కోరారు. సహకార బ్యాంకింగ్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని కూడా ఆయన తెలిపారు. దీనికోసం ఆదాయ అవకాశాలను పెంచటం, స్థానిక వ్యవస్థాపకతను బలోపేతం చేయటానికి సహకార వ్యాపారాల వైవిధ్యీకరణను ప్రోత్సహించటంపై పని చేస్తున్నట్లు చెప్పారు. పథకాలను సకాలంలో అమలు చేయటం, ఆర్థిక కార్యకలాపాలలో పారదర్శకత, సహకార వనరులు సుస్థిరంగా నిర్వహించేలా చూసుకునే అవసరాన్ని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సహకార విభాగాలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ప్రసంగాన్ని ముగించారు. 

సంయుక్త కార్యదర్శి శ్రీ రామన్ కుమార్ ధన్యవాదాలతో సెషన్ ముగిసింది. క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విలువైన సహకారాన్ని అందించిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ  భాగస్వాములను ఆయన అభినందించారు. 

 

***


(Release ID: 2177517) Visitor Counter : 9