పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మానవ, వన్యప్రాణుల సహజీవనం ఇతివృత్తంతో డెహ్రాడూన్ లో జరిగిన వన్యప్రాణుల వారోత్సవాలు - 2025 వేడుకలకు అధ్యక్షత వహించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
జాతుల సంరక్షణ, సంఘర్షణ నిర్వహణ కోసం 5 జాతీయ స్థాయి ప్రాజెక్ట్‌లను, జాతుల జనాభా అంచనా, పర్యవేక్షణ కార్యక్రమాల కోసం 4 జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికలు, ఫీల్డ్ గైడ్‌లను ప్రారంభించిన మంత్రి
మానవ, వన్యప్రాణుల సంఘర్షణ (హెచ్డబ్ల్యూసీ), సహజీవనంపై జరిగిన జాతీయ హ్యాకథాన్ ఫైనలిస్టులను సత్కరించిన శ్రీ యాదవ్
Posted On:
06 OCT 2025 6:15PM by PIB Hyderabad
వన్యప్రాణి వారోత్సవం 2025 వేడుకలను వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ), ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ (ఐజీయన్ఎఫ్ఏ), ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) తో కలసి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ,2025 అక్టోబర్ 6వ తేదీన డెహ్రాడూన్‌లోని ఎఫ్ఆర్ఐ క్యాంపస్‌లోని చారిత్రాత్మక హరిసింగ్ ఆడిటోరియం, ఐజీఎన్ఎఫ్ఏలో ఘనంగా నిర్వహించింది.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, రాష్ట్ర అటవీ శాఖల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ ఏడాది వన్యప్రాణి వారోత్సవాల వేడుకలు వన్యప్రాణుల సంరక్షణ, పరిశోధన, విధానాల ఏకీకరణకు సమగ్రమైన, అంతర్ సంస్థాగత విధానాన్ని ప్రదర్శిస్తూ, డబ్ల్యూఐఐ, ఐసీఎఫ్ఆర్ఈ, ఐజీయన్ఎఫ్ఏ, ఎఫ్ఆర్ఐ మధ్య సమన్వయాన్ని చాటి చెప్పాయి. గత కొన్ని సంవత్సరాలుగా మానవులు, వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలను, సంఘటనలను దృష్టిలో ఉంచుకుని 'సంఘర్షణ నుంచి సహజీవనం' వైపు పయనించడానికి సమాజ మద్దతును కూడగట్టే లక్ష్యంతో, ఈ సంవత్సరం 'మానవ-వన్యప్రాణి సహజీవనం' ఇతివృత్తాన్ని నిర్ణయించారు.
మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తన ప్రసంగంలో, 7వ జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశంలో ప్రధానమంత్రి చేసిన వివిధ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రకటనలను ప్రస్తావిస్తూ, ప్రజలు, వన్యప్రాణుల మధ్య సహజీవనాన్ని పెంపొందిస్తూనే జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వన్యప్రాణుల నిర్వహణకు వినూత్నమైన, సాంకేతికత ఆధారితమైన, సమాజ కేంద్రీత విధానాల పెరుగుతున్న అవసరాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని మంత్రి సంబంధిత వర్గాలను కోరారు. వన్యప్రాణుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదని, ప్రకృతికి, ప్రజలకు మధ్య సామరస్యాన్ని పెంచడానికి అది ఒక ఉమ్మడి నిబద్ధత అని అన్నారు.
జాతీయ ప్రాజెక్టుల ప్రారంభం
జాతుల పరిరక్షణ, సంఘర్షణ నిర్వహణ కోసం ఐదు జాతీయ స్థాయి ప్రాజెక్టులను మంత్రి ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. జాతుల పరిరక్షణ నిర్వహణకు సంబంధించి ఏడో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో చర్చించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, మార్గదర్శకత్వాన్ని ఈ ప్రాజెక్టులు ముందుకు తీసుకువెడతాయి. మంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులలో ఈ క్రిందివి ఉన్నాయి.
1.ప్రాజెక్ట్ డాల్ఫిన్ (దశ-II) కార్యాచరణ ప్రణాళిక అమలు: ఇది భారతదేశం అంతటా నదులు, సముద్ర జలచరాల (సెటాసియన్) సంరక్షణ చర్యలను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా కలిగి ఉంది.
2.ప్రాజెక్ట్ స్లాత్ బేర్ - స్లోత్ బేర్ (అడవి ఎలుగుబంటి) సంరక్షణ కోసం జాతీయ అమలు ప్రణాళిక ప్రారంభం, ప్రాజెక్ట్ బ్రోచర్ విడుదల.
3.ప్రాజెక్ట్ ఘరియాల్ - ఘరియాల్ (మొసలి) జాతికి చెందిన అరుదైన జలచరాల సంరక్షణ కోసం అమలు కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం, ప్రాజెక్ట్ బ్రోచర్ విడుదల.
4.సాకాన్‌లోమానవ-వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ - హెచ్డబ్ల్యూసీ) - భారతదేశంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణలకు సంబంధించి విధానం, పరిశోధన, క్షేత్ర ఆధారిత నివారణ చర్యలకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక జాతీయ కేంద్రం ఏర్పాటు, సమాచార కరపత్రం విడుదల.
5.టైగర్స్ అవుట్‌సైడ్ టైగర్ రిజర్వ్ (టీఓటీఆర్) కార్యక్రమం పులుల సంరక్షణ ప్రాంతాల (టైగర్ రిజర్వ్స్) వెలుపల చోటుచేసుకునే మానవ - పులి సంఘర్షణలను పరిష్కరించేందుకు ల్యాండ్‌స్కేప్ దృక్పథం, సాంకేతిక జోక్యాలు, సామర్థ్యాభివృద్ధి, సమాజ మద్దతు ద్వారా అమలు
జాతుల జనాభా అంచనా, పర్యవేక్షణ కార్యక్రమాలు
జాతుల జనాభా అంచనాలు, పర్యవేక్షణ కార్యక్రమాల కోసం నాలుగు జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికలు, ఫీల్డ్ గైడ్‌లను కూడా మంత్రి ఆవిష్కరించారు.
1.బ్రోచర్, ఫీల్డ్ గైడ్ విడుదలతో సహా నదీ, సముద్ర డాల్ఫిన్‌లు, ఇతర జలచరాల జనాభా రెండవ దశ అంచనా
2.అఖిల భారత పులుల గణన ఆరో దశ - ఎనిమిది ప్రాంతీయ భాషలలో ఫీల్డ్ గైడ్ విడుదల.
3.స్నో లెపర్డ్ (మంచు చిరుత పులి) జనాభా అంచనా రెండవ దశ కోసం కార్యాచరణ ప్రణాళిక.
4.గ్రేట్ ఇండియన్ బస్టార్డ్, లెసర్ ఫ్లోరికాన్ పక్షుల జనాభా అంచనా పై పురోగతి నివేదిక.
ఈ కార్యక్రమంలో భాగంగా కోయంబత్తూర్‌లోని సీఏఎస్ఎఫ్ఓఎస్ వద్ద ఎస్ఎఫ్ఎస్ అధికారుల మెస్ ను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు.
ప్రజలు, వన్యప్రాణుల సహజీవనంపై భారత్ నలుమూలల నుంచి వచ్చిన యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, సాంకేతిక అభివృద్ధిదారులతో నిర్వహించిన జాతీయ హ్యాకథాన్ ముగింపు వేడుక కార్యక్రమంలో ప్రత్యేక అంశంగా నిలిచింది. ఈ హ్యాకథాన్ మానవ, వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడం, సహజీవనాన్ని ప్రోత్సహించడం, కృత్రిమ మేధ, స్థల విశ్లేషణ, సమాజ భాగస్వామ్య నమూనాలవంటి ఆధునిక సాధనాల ద్వారా తక్షణ నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరచే సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించింది.
గత మూడు వారాలుగా 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 75 సంస్థలలోని 420 మంది యువకులతో కూడిన మొత్తం 120 జట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రాథమిక రౌండ్ల అనంతరం, ఈ కార్యక్రమంలో భాగంగా డెహ్రాడూన్‌లో ఫినాలే నిర్వహించారు. ఇందులో టాప్ ఆరుగురు ఫైనలిస్టులు మంత్రి, నిపుణుల జ్యూరీ, పెద్ద సంఖ్యలో పాల్గొన్నవారి సమక్షంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. టాప్ ముగ్గురు ఫైనలిస్టులకు సర్టిఫికెట్‌తో పాటు నగదు బహుమతిని అందజేశారు, మిగతా ఫైనలిస్టులందరికీ మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఐజీఎన్ఎఫ్ఏ నిర్వహించిన క్విజ్ పోటీ విజేతలకు కూడా ఆయన బహుమతులు అందజేశారు.
***
(Release ID: 2175853)
Visitor Counter : 15