బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్‌కు చారిత్రాత్మక మైలురాయి: నాంచిక్ నాంఫుక్ వద్ద రాష్ట్రంలోనే తొలి వాణిజ్య బొగ్గు గనిని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 06 OCT 2025 5:46PM by PIB Hyderabad

 కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఆరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండుతో కలిసి నేడు చాంగ్లాంగ్ జిల్లాలోని నాంచిక్ నాంఫుక్ వద్ద బొగ్గు గనిని  ప్రారంభించారు. ఇది ఆరుణాచల్ ప్రదేశ్‌లో తొలి వాణిజ్య బొగ్గు గని ప్రాజెక్టుగా చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమం ఆరుణాచల్ ప్రదేశ్ ఆర్థిక ప్రగతికి కొత్త అధ్యాయాన్ని అందించనుంది. భారత బొగ్గు, ఇంధన పటంలో రాష్టం స్థిరమైన స్థానాన్ని సంపాదించింది. స్థానిక ఉపాధి, వనరుల వినియోగం, శక్తి స్వావలంబనకు కీలకంగా మారనుంది.

నాంచిక్ నాంఫుక్ బొగ్గు గని ప్రాజెక్టు స్థలంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండు భూమి పూజను నిర్వహించారు. అక్కడే ‘‘100 చెట్ల నాటింపు కార్యక్రమం’’లో పాల్గొని చెట్లను నాటారు. అనంతరం నాంచిక్ నాంఫుక్ బొగ్గు గనిని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీపీఎల్‌ మైనింగ్‌ లీజును, యంత్రాలను  నాంచిక్-నాంఫుక్ కేంద్ర బొగ్గు బ్లాక్‌కు అప్పగించడం ద్వారా గనుల తవ్వకం కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను  వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ  ప్రారంభాన్ని "కొత్త ఆశకు చిహ్నంగా, ఈశాన్య ప్రాంతంలో ఇంధన భద్రత, ప్రాంతీయ అభివృద్ధి వైపు చారిత్రాక అడుగు’’గా ఆయన అభివర్ణించారు. అలాగే నాంచిక్‌ నాంఫుక్ బొగ్గు గనిలో సుమారు 1.5 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, నేటి నుంచి ఇక్కడ అధికారికంగా పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండు నాంచిక్ నాంఫుక్ బొగ్గు గనిని స్వాగతించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, అరుణాచల్ ప్రదేశ్‌కు స్థిరమైన ఆదాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే  ఈ ప్రాజెక్టు స్థానిక సముదాయాలను శక్తిమంతం చేయడంలో, రాష్ట్ర బొగ్గు గనుల తవ్వకం, పారిశ్రామిక రంగాల్లో భవిష్యత్తు పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

నాంచిక్-నాంఫుక్ బొగ్గు గని ఈశాన్య ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ వైపు ప్రయాణాన్ని బలోపేతం చేస్తుంది. స్థానిక ఉపాధి, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా దేశ ఇంధన భద్రత, స్వావలంబన లక్ష్యాలను సాధించడంలో ప్రాంతీయ భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది.

 

***


(Release ID: 2175847) Visitor Counter : 17