బొగ్గు మంత్రిత్వ శాఖ
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2025 3:20PM by PIB Hyderabad
బొగ్గు రంగానికి చెందిన ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యంగా భావిస్తూ బొగ్గు రంగాన్ని బలోపేతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ గత కొద్ది నెలలుగా శ్రమిస్తోంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి తిరుగులేని నాయకత్వంలో, దార్శనిక మార్గదర్శకత్వంలో- మేం సాధించిన కొన్ని కీలక విజయాలను ఈ రోజు మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను.
బొగ్గు రంగం ఉత్పత్తి, సామర్థ్యంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా, మన ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సంక్షేమం కోసం అపూర్వమైన చర్యలు చేపట్టింది. కొన్ని ముఖ్యమైన విజయాలు:
-
ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా మెరుగైన బీమా రక్షణ: ఉద్యోగుల బీమా కవర్ రూ. 1 కోటి వరకు గణనీయంగా పెంచాం. ఇది వారి కుటుంబాలకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. దీని కోసం ఉద్యోగులు ఎటువంటి బీమా ప్రీమియంను చెల్లించాల్సిన అవసరం లేదు.
-
తాత్కాలిక ఉద్యోగులకూ ఎటువంటి ప్రీమియం చెల్లించే అవసరం లేకుండా అదనపు రక్షణ: సంపూర్ణ సంక్షేమం దిశగా ముందడుగు వేస్తూ మొదటిసారిగా తాత్కాలిక ఉద్యోగుల కోసం బీమా రక్షణను అందిస్తున్నాం. దీని కోసం ఈ ఉద్యోగులు ఎటువంటి బీమా ప్రీమియంను చెల్లించాల్సిన అవసరం లేదు.
-
సమానత్వం, ఐక్యత, కోల్ పరివార్ గుర్తింపును సూచిస్తూ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), దాని అనుబంధ సంస్థల్లో సీఎండీ నుంచి కార్మికుల వరకు అందరికీ యూనిఫాం డ్రెస్ కోడ్ ప్రారంభించాం.
-
పెరిగిన ఎక్స్-గ్రేషియా ప్రయోజనాలు: ఎక్స్-గ్రేషియాను రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచాం. ఇది కష్ట సమయాల్లో బాధిత కుటుంబాలను ఆదుకోవడం పట్ల మా నిబద్ధతకు నిదర్శనం.
ప్రతి కార్మికుడి సహకారాన్ని గౌరవించాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లోని కార్మికులందరి కోసం పనితీరు ఆధారిత రివార్డు (పీఎల్ఆర్) అందించే నిర్ణయానికి ఆమోదం లభించిందని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రతి కార్మికుడు వారి అంకితభావం, అవిశ్రాంత కృషికి బహుమతిగా రూ. 1,03,000 అందుకుంటారు.
పండగ ప్రారంభంలో వస్తున్న ఈ ప్రకటన ప్రతి కార్మికుడి గౌరవం, సంక్షేమంతో అభివృద్ధి కలిసి సాగుతుందన్న ప్రభుత్వ పరిపాలనా దృక్పథాన్ని ఇది సూచిస్తోంది. ఇది కేవలం నగదు బహుమతి మాత్రమే కాదు... దేశాన్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా నిలిచే బొగ్గు పరివార్‌కు అందించే గుర్తింపు, కృతజ్ఞత, సాధికారతల సందేశం.
ప్రభుత్వ విధానాల్లో ప్రజలే కేంద్రంగా ఉండాలన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వం నిరంతరం మాకు మార్గనిర్దేశం చేస్తోంది. పనితీరులో సుదృఢంగా ఉండటమే కాకుండా, స్ఫూర్తిమంతమైన రంగాన్ని నిర్మించడానికి ఆయన అందిస్తున్న మార్గదర్శకత్వమే కారణం.
భారత్ గొప్పదనం కార్మికుల ఐక్యతలోనూ, భవిష్యత్తుపట్ల వారికున్న అవగాహనలోనూ ఉందని కలిసికట్టుగా బొగ్గు రంగానికి చెందిన కార్మికులు నిరూపించారు. మరిన్ని విజయాలను సాధిస్తాం... అలాగే మా అందరిలో ప్రతి ఒక్కరి భవిత కోసం శ్రమిస్తాం.
"సంస్కరణ, పనితీరు, పరివర్తన.. భారత్ తారక మంత్రం. మందగమనంలో ఉన్న ప్రపంచ వృద్ధికి భారత్ తన వంతు సహకారాన్ని అందించే స్థితిలో ఉంది’’ అంటూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పిన మాటలే మాకు స్ఫూర్తి. దేశ పురోగతికీ, సంక్షేమానికీ బొగ్గు రంగం మూలస్తంభంగా ఉంటుందన్న దృఢ సంకల్పంతో ముందుకువెళతాం.
***
(రిలీజ్ ఐడి: 2171949)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26