కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎఫ్ఎం రేడియో ఛానళ్ల వేలం కోసం ప్రాథమిక ధరలపై ట్రాయ్ సిఫార్సులు
Posted On:
23 SEP 2025 4:23PM by PIB Hyderabad
ఎఫ్‌ఎం రేడియో ఛానళ్ల వేలానికి సంబంధించిన ప్రాథమిక ధరలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సులను విడుదల చేసింది.
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 2023 డిసెంబర్ 21 నాడు ఇచ్చిన సూచనలు, అలాగే 19 మార్చి 2024.. 9 ఏప్రిల్ 2024 నాటి స్పష్టీకరణల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 'ఈ' కేటగిరీలోని 18 నగరాల్లో ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో సేవలను విస్తరించేందుకు రేడియో ఛానళ్ల వేలానికి ప్రాథమిక ధరలపై ట్రాయ్ సిఫార్సులను కోరింది. బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), రూర్కెలా (ఒడిశా), రుద్రపూర్ (ఉత్తరాఖండ్) నగరాలకు ప్రాథమిక ధరలను సూచించాలని ఐఎంబీ ట్రాయ్‌ను అభ్యర్థించింది.
దీని ప్రకారం ఎఫ్‌ఎం రేడియో ఛానళ్ల వేలం ధరలకు సంబంధించిన సమస్యలపై భాగస్వాముల అభిప్రాయాలు కోరుతూ ఆగస్టు 1, 2024న సంప్రదింపు పత్రం జారీ చేసింది. సంప్రదింపు పత్రంపై వచ్చిన వ్యాఖ్యలు, ప్రతివాదనలు ట్రాయ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అనంతరం 10 అక్టోబర్ 2024న బహిరంగ సభ చర్చ జరిగింది.
ఈ సంప్రదింపుల ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను, సమస్యలపై ట్రాయ్ చేసిన లోతైన విశ్లేషణను పరిగణనలోకి తీసుకొని అధికారులు తుది సిఫార్సులను రూపొందించారు. వాటిలో ముఖ్యమైన అంశాలు:
-
కేటగిరీ ‘ఈ’ నగరాలకు కనిష్ఠ నికర విలువ రూ. 30 లక్షలు ఉండాలి. మిగతా అన్ని కేటగిరీల నగరాల కోసం (ఏ+, ఏ, బీ, సీ, డీ, ఇతరాలు) కోసం ప్రస్తుత ఎఫ్‌ఎం దశ-III విధాన మార్గదర్శకాల్లో (25.07.2011 తేదీ) సూచించిన కనిష్ఠ నికర విలువ ప్రమాణాలే వర్తిస్తాయి.
-
నోటీస్ ఇన్వైటింగ్ అప్లికేషన్/ సమాచార మెమోరాండం లేదా ఇతర మార్గదర్శకాల్లో కింది అంశాలు తప్పనిసరిగా పొందుపరచాలి. అవి ఫ్రీక్వెన్సీ కేటాయింపు నిబంధనలు, ఫ్రీక్వెన్సీ కేటాయింపు ప్రక్రియ, నగరాల వారీగా కనిష్ఠ నికర విలువ అవసరాలు, ముందస్తు డిపాజిట్ వివరాలు, ప్రాథమిక ధర, చెల్లింపు విధానం .
-
సేవలు ప్రారంభించే గడువు, బ్లాక్లిస్ట్ చేయడం, డిపాజిట్ల ఉపసంహరణ, బ్లాక్లిస్టింగ్, జప్తులు మొదలైన ఇతర సంబంధిత అంశాలు నమోదు చేయాలి. వీటికి నిబంధనలు, షరతులను వర్తిస్తాయి. అంతేగాక పైన పేర్కొన్న వివరాలు అన్నీ గతంలో ఎఫ్‌ఎం దశ-III విధాన మార్గదర్శకాలలో భాగమైన అనుమతి మంజూరు ప్రక్రియ, అనుమతి ఒప్పంద పత్రం (జీఓపీఏ) నిబంధనల పరిధిలో ఉండాలి.
-
ఈ కేటగిరీ పట్టణాల్లో ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లకు కేటాయించిన గరిష్ఠ ఎఫ్‌ఎం ఛానళ్ల సంఖ్య మూడు ఉండాలి. మిగతా అన్ని వర్గాల పట్టణాలకు (ఏ+, ఏ, బీ, సీ, డీ, ఇతరాలు) సంబంధించి 25.07.2021 నాటికి ఉన్న ఎఫ్‌ఎం దశ-III విధాన మార్గదర్శకాల ప్రకారం గరిష్ఠ ఛానళ్ల సంఖ్య కొనసాగించాలి.
ఎఫ్‌ఎం రేడియో ఆపరేటర్ల ఆర్థిక స్థిరత్వం కోసం ట్రాయ్ ఈ కింది చర్యలను సిఫార్సు చేసింది.
-
ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో ఆపరేటర్లకు గంటకు 10 నిమిషాల వరకు వార్తలు, ఇతర కార్యక్రమాలు ప్రసారం చేయడానికి అనుమతించాలి.
-
అనుమతినిచ్చిన సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి సమయానుగుణంగా సూచించిన వార్తా సమాచారం కోసం కార్యక్రమ నిబంధనను పాటించాలి.
-
టెరెస్ట్రియల్ రేడియో సేవల కోసం అనుమతినిచ్చిన సంస్థకు వినియోగదారుని నియంత్రణ లేకుండా రేడియో ఛానల్ కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి అనుమతి ఇవ్వాలి. అంటే వినియోగదారులకు డౌన్లోడ్, ప్లేబ్యాక్, రీప్లే వంటి నియంత్రణ ఫీచర్లు అందుబాటులో ఉండకూడదు.
-
ఎఫ్‌ఎం రేడియో ఛానల్‌కు సంబంధించిన వార్షిక లైసెన్స్ రుసుమును తిరిగి చెల్లించని ప్రవేశ రుసుము నుంచి వేరుచేయాలి. ఇది ప్రస్తుత లైసెన్స్ కలిగిన వారితో పాటు ఇతర లైసెన్సీలకు కూడా వర్తిస్తుంది. లైసెన్స్ రుసుమును ఆయా ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎం రేడియో చానల్ సర్ధుబాటు చేసిన స్థూల ఆదాయంలో 4 శాతంగా లెక్కించాలి. ‘ఇతరులు’ కేటిగిరిలో ఉన్న నగరాలైన ఎన్ఈ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, దీవుల ప్రాంతాల కోసం తొలి మూడు సంవత్సరాలకు 2 శాతం ఏజీఆర్ మేరకు అధికార రుసుమును వసూలు చేయాలి. ఆ తరువాత నుంచి లైసెన్స్ రుసుమును 4 శాతం ఏజీఆర్‌గా వసూలు చేయాలి. ఏజీఆర్‌ను లెక్కించేటప్పుడు వస్తు సేవల పన్నును జీఆర్ నుంచి మినహాయించాలి.
-
ప్రసార మౌలిక సదుపాయాల తప్పనిసరి సముదాయ నిబంధనను తొలగించాలి. ప్రాంతీయ రేడియో సేవ కోసం అధికారం పొందిన సంస్థలు సాంకేతిక వాణిజ్య సాధ్యాసాధ్యాల ప్రకారం ప్రసార సేవలు, టెలికాం సేవలు, మౌలిక సదుపాయాల ప్రదాతలు మొదలైన సంస్థలతో స్వచ్ఛంద ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి అనుమతించాలి.
-
ఓకేచోట ప్రసార మౌలిక సదుపాయాల ఏర్పాటు తప్పనిసరి అనే షరతును తొలగించాలి. ప్రాంతీయ రేడియో సేవల కోసం అనుమతి పొందిన సంస్థలు.. ప్రసార సేవలు, టెలికం సేవలు, మౌలిక వసతుల ప్రొవైడర్లు వంటి ఇతర సంస్థలతో సాంకేతిక, వాణిజ్య పరంగా సాధ్యమైన మేరకు స్వచ్ఛందంగా మౌలిక వసతులను పంచుకోవడానికి అనుమతించాలి.
సిఫార్సుల పూర్తి వివరాలు ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.in లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం సలహాదారు డాక్టర్ దీపాలి శర్మ, (ప్రసార, కేబుల్ సేవలు) టెలిఫోన్ నంబర్ +91-11- 20907774 ద్వారా సంప్రదించవచ్చు.
(Release ID: 2170543)
Visitor Counter : 6