కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాలతో స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ను పాటిస్తున్న ఈఎస్ఐసీ ఆసుపత్రులు
Posted On:
18 SEP 2025 1:48PM by PIB Hyderabad
8వ జాతీయ పోషకాహార మాసోత్సవంతో పాటు దేశవ్యాప్తంగా పక్షం రోజుల ఆరోగ్య ప్రచారం - “స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" ను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ) ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17 సెప్టెంబర్, 2025న 8వ జాతీయ పోషకాహార మాసోత్సవంతో పాటు పక్షం రోజుల ఆరోగ్య ప్రచారం - "స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్" ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) దేశవ్యాప్తంగా 160 ఈఎస్ఐ ఆసుపత్రులలో సంపూర్ణ ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ ప్రచారంలో పాల్గొంటోంది.
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఫరీదాబాద్
దేశవ్యాప్త స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ ప్రచారం మొదటి రోజున, ఫరిదాబాద్ లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, ఆసుపత్రి మహిళల ఆరోగ్యం, ముందస్తు జాగ్రత్తలు, సమాజ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. అధ్యాపకులు, వైద్య అధికారులు, సిబ్బంది సమక్షంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పూజా గోయల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్ ధాకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందు జాగ్రత్తలు ద్వారా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, పని చేసే మహిళలకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించడంపై ఈఎస్ఐసీ నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
షాహి ఎక్స్ పోర్ట్ , ధృవ్ గ్లోబల్ సంస్థల్లో కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఇక్కడ మహిళలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సిడిలు), క్షయవ్యాధికి సంబంధించి ప్రశ్నావళి ఆధారిత స్క్రీనింగ్ చేయించుకున్నారు. హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, బీపీ, మధుమేహం, రక్తహీనత, సాధారణ క్యాన్సర్ల నిర్ధారణ కోసం క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహించారు. జీవనశైలి రుగ్మతలు, రుతుక్రమ సమయంలో పరిశుభ్రత, వ్యాక్సినేషన్, పోషకాహారం, రక్తహీనత నివారణపై అవగాహన, కౌన్సెలింగ్ సెషన్లు జరిగాయి. నిక్షయ్ మిత్రల నమోదు, క్షయవ్యాధి నివారణ ప్రతిజ్ఞలు కూడా నిర్వహించారు.
స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ఫరీదాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. రక్త దాతలను,సింగిల్ డోనర్ ప్లేట్ లెట్ (ఎస్డిపి) దాతలను సత్కరించారు. దాతలకు హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేశారు. సురక్షితమైన రక్త మార్పిడి పద్ధతుల కోసం దాతల రక్తం యూనిట్లకు వైరల్ మార్కర్ల స్క్రీనింగ్ చేశారు. సమాజంలో స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత ప్రోత్సహించడానికి ఈ శిబిరంలో అవగాహన సెషన్లు కూడా ఏర్పాటు చేశారు.
ఫరీదాబాద్లోని ఈఎస్ఐసీలో క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ కోసం సంపూర్ణ మహిళా ఆరోగ్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. మహిళా లబ్ధిదారులు క్షయ, రక్తపోటు, డయాబెటిస్, రక్తహీనత కోసం స్క్రీనింగ్ తో పాటు ప్రసవానికి ముందు పరీక్షలు, పోషకాహార స్క్రీనింగ్, కౌన్సెలింగ్ పొందారు. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల కోసం ప్రత్యేక పరీక్షలు జరిగాయి. గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు పాప్ స్మెర్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా, మహిళా సాధికారతకు, కుటుంబాల శ్రేయస్సుకు ముఖ్యమైన సాధనాలుగా ముందస్తు రోగ నిర్ధారణ, నివారణ సంరక్షణ, ఆరోగ్య విద్య ప్రాముఖ్యతను ఈఎస్ఐసీ చాటిచెప్పింది.
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ , హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్
హైదరాబాద్ సనత్‌నగర్ లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ కొత్తగా నిర్మించిన 200 పడకల ఆసుపత్రి భవనంలో 17 సెప్టెంబర్ 2025న ఇన్ హౌస్ క్యాంప్ సేవలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ' స్వస్థ్ నారి, సశక్త్ పరివార్' అభియాన్‌లో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధి నివారణ, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం, కుటుంబాలను శక్తిమంతం చేయడం ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం.
ఈ ప్రారంభోత్సవానికి ఈఎస్ఐసీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ సౌరవ్ కుమార్ దత్తా అధ్యక్షత వహించారు. హైదరాబాద్ లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ లాల్, ఇతర సీనియర్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఈఎస్ఐసీ సనత్‌నగర్‌లో ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ, బీమా లబ్ధిదారులకు, సమాజానికి మెరుగైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవడంలోనూ ఒక ప్రధాన సూచికగా నిలుస్తుంది. సమగ్ర శిబిర సేవలతో కూడిన కొత్త 200 పడకల సౌకర్యం, రోగులకు తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్య సంరక్షణను అందించాలనే ఈఎస్ఐసీ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
ప్రచార కార్యక్రమం ప్రణాళికకు అనుగుణంగా క్యాంపస్ లో ఆరోగ్య పరీక్షా శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ప్రతిజ్ఞ, స్వచ్ఛతా హి సేవా ప్రతిజ్ఞ, యోగా సెషన్లు, ఫార్మా-కో-విజిలెన్స్ వీక్ వేడుకలతో సహా అనేక కార్యకలాపాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలు ఆరోగ్య అవగాహన, వ్యాధి నివారణ, సమాజ భాగస్వామ్యం పట్ల ఈఎస్ఐసీ సమగ్ర విధానాన్ని ప్రముఖంగా తెలియచేశాయి.
స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కింద రోజంతా జరిగిన కార్యకలాపాలు క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడమే కాకుండా జీవనశైలి మార్పు, పోషకాహారం, మహిళల ఆరోగ్య సవాళ్లపై అవగాహన పెంచాయి. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి, ఆరోగ్యకరమైన, సాధికార, సుస్థిర సమాజాన్ని నిర్మించడానికి ఈఎస్ఐసీ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2168327)