రక్షణ మంత్రిత్వ శాఖ
చర్చలు విఫలమైనప్పుడు భారత్ ఎంచుకునే మార్గానికి ఆపరేషన్ సిందూర్, 2016 సర్జికల్ స్ట్రయిక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులే నిదర్శనం: రక్షణ మంత్రి
Posted On:
17 SEP 2025 3:33PM by PIB Hyderabad
“ఆపరేషన్ సిందూర్, 2016 సర్జికల్ స్ట్రయిక్స్, 2019 బాలకోట్ వైమానిక దాడులు భారత్ సహనమో, బలహీనతో కాదు... అతిపెద్ద బలమని రుజువు చేస్తున్నాయి. చర్చలు ఎటువంటి పరిష్కారాన్నీ ఇవ్వనప్పుడు మనం శక్తితో కూడిన కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటాం" అని ఈనెల 17న నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని బలమైన, దృఢ నిశ్చయంతో కూడిన నవ భారత్ చర్చల ప్రక్రియను విశ్వసిస్తుందన్నారు. శాంతి, సద్భావన భాషను అర్థం చేసుకోలేని వారికి తగిన సమాధానం ఎలా ఇవ్వాలో కూడా నవ భారత్‌కు తెలుసునని ఆయన స్పష్టం చేశారు.
మతం ఆధారంగా అమాయక పౌరులను పహల్గామ్‌లో ఉగ్రవాదులు చంపితే.. వారి కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వారు భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో హతమయ్యారనీ.. పాకిస్తాన్, పీఓకేలోని వారి ఆవాసాలు పూర్తిగా నాశనమయ్యాయని రక్షణ మంత్రి తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలు చేసిన సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని ప్రశంసిస్తూ.. ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగానే నిలిపివేశామన్నారు. సరిహద్దు అవతల నుంచి తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగితే పూర్తిస్థాయిలో దాడి తిరిగి ప్రారంభమవుతుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణపై మూడో పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించిందనీ.. భారత అంతర్గత విషయాల్లో మూడో పక్షం ఏదీ జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని ఏకం చేయడంలో 'ఉక్కు మనిషి' గా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం.. ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17నే జరుపుకొంటున్నామని గుర్తుచేసిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్... "సర్దార్ పటేల్ లాగే మన ప్రధానమంత్రి దేశాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.
దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ప్రధానమంత్రి శ్రీ మోదీకే చెందుతుందన్న రక్షణ మంత్రి.. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “"నేటి భారత్ ఎవరి ఆదేశాలూ తీసుకోదు... తన సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగుతుంది" అని ఆయన తెలిపారు.
ఆపరేషన్ పోలోలో పాల్గొన్న సైనికుల ధైర్యాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్ కేవలం సైనిక చర్య కాదన్నారు. సర్దార్ పటేల్ నిర్ణయాత్మక వ్యూహంతో రజాకార్ల కుట్రలను బద్దలు కొట్టి హైదరాబాద్‌ను తిరిగి భారత్‌లో విలీనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ పోలో విజయం.. భారత్‌లో హైదరాబాద్ విలీనం.. జాతి ఐక్యతను కాపాడుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ సమర్థంగా, శక్తిమంతంగా ఉందని ప్రపంచానికి నిరూపించిన అద్భుతమైన అధ్యాయంగా రక్షణ మంత్రి అభివర్ణించారు.
“1948లో రజాకార్ల కుట్ర విఫలమైనట్లే... నేడు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, ఆ దేశపు ఏజెంట్లూ విఫలమయ్యారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ మరోసారి తగిన సమాధానమిచ్చింది. మన ఐక్యత, సాంస్కృతిక వైవిధ్యమే మన గొప్ప బలమని మనం మరోసారి నిరూపించాం" అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శననూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తిలకించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2167915)