బొగ్గు మంత్రిత్వ శాఖ
కోల్ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం, కార్పొరేట్ వేతన ప్యాకేజీ, మెరుగైన పరిహారం: ప్రకటించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
‘కార్మికులే ప్రథమం’, ‘కార్మికుల సంక్షేమం’.. ఈ రెండింటికీ ప్రాధాన్యమివ్వాలన్న
ప్రధాని శ్రీ మోదీ దార్శనికతకు అనుగుణంగా చర్యలు
కోల్ ఇండియా ‘వి కేర్’ కార్యక్రమం ద్వారా గని ప్రమాద మరణాలకు పరిహారం
రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంపు
ఆర్థిక భద్రతను బలోపేతం చేసేలా.. ‘సురక్ష హర్ కర్మచారీకి
అందరికీ భద్రత, భవిష్యత్తు సాధికారత’ ట్యాగ్‌లైన్‌తో కార్పొరేట్ వేతన ప్యాకేజీ (సీఎస్పీ) ప్రారంభం
సీఎస్పీ ద్వారా బీమా కవరేజీ: రెగ్యులర్ ఉద్యోగులకు రూ. కోటి, ఒప్పంద కార్మికులకు రూ. 40 లక్షలు...
ఇప్పటికే 2.15 లక్షలకు పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 44,000 మంది ఒప్పంద కార్మికుల నమోదు
కోల్ ఇండియా కార్మికుల్లో ఉమ్మడి గుర్తింపు, వృత్తి నైపుణ్యం, భద్రతను పెంపొందించేలా కొత్త యూనిఫాం
Posted On:
16 SEP 2025 5:35PM by PIB Hyderabad
కోల్ ఇండియా ఉద్యోగులకు ఇకపై కొత్త యూనిఫాం, కార్పొరేట్ వేతన ప్యాకేజీ, మెరుగైన పరిహారం లభించనుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు వీటిని ప్రకటించారు. బొగ్గు గని కార్మికుల గౌరవం, భద్రత, సంక్షేమాన్ని మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించి.. మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశంలో అత్యంత జాగ్రత్తతో ఈ కార్యక్రమాలను రూపొందించారు. ఉద్యోగుల అస్తిత్వాన్ని శక్తిమంతం చేసే, ఆర్థిక భద్రతను పెంపొందించే సమగ్ర విధానాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల నుంచి పరిపాలన కార్యాలయాల వరకు.. అన్ని స్థాయుల్లో సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ సమ్మిళిత వృద్ధి, కార్మికులే కేంద్రంగా విధానాల రూపకల్పన దిశగా కోల్ ఇండియా అంకితభావాన్ని చాటేలా ఈ కార్యక్రమాలున్నాయి.
దేశ అభివృద్ధిలో బొగ్గు గని కార్మికుల శ్రేయస్సు, భద్రత, గౌరవాన్ని కేంద్ర స్థానంలో నిలిపేలా చేపట్టిన ఈ చర్యలు... ‘కార్మికులే ప్రథమం’, ‘కార్మికుల సంక్షేమం’ అన్న అంశాలకు ప్రాధాన్యమివ్వాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు కట్టుబడి ఉన్నాయి. ఈ దృక్పథం ద్వారా.. దేశ ఇంధన భద్రతలో కార్మికుల సహకారానికి తగిన గౌరవం, రక్షణతోపాటు నిరంతర చేయూత లభిస్తుంది.
కోల్ ఇండియా తన ‘వి కేర్’ కార్యక్రమంలో భాగంగా.. దురదృష్టవశాత్తు గని ప్రమాదాల్లో మృతిచెందిన వారికి చెల్లించే పరిహారం మొత్తాన్ని రూ. 15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. ఈ మెరుగైన పరిహారం రెగ్యులర్ ఉద్యోగులకు, ఒప్పంద కార్మికులకు సమానంగా వర్తిస్తుంది. మృతుల కుటుంబాలకు నేరుగా పరిహారాన్ని చెల్లించడం ద్వారా.. సకాలంలో, పారదర్శకంగా వారికి అండగా నిలుస్తారు. ‘ప్రమాద రాహిత్యం’ లక్ష్యంగా ఉన్నప్పటికీ.. పరిహారంలో ఈ పెరుగుదల నష్ట సమయాల్లో క్రియాశీలంగా, కారుణ్యంతో వ్యవహరించడంలో కోల్ ఇండియా సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
‘సురక్ష హర్ కర్మచారీ కి - అందరికీ భద్రత, భవిష్యత్తు సాధికారత’ అనే ట్యాగ్‌లైన్‌తో కార్పొరేట్ వేతన ప్యాకేజీని ప్రారంభించారు. కోల్ ఇండియా ఉద్యోగులకు ఆర్థిక భద్రతలో గణనీయమైన పురోగతికి ఇది దోహదపడుతుంది. నిరంతర, సురక్షిత, ఆధునిక బ్యాంకింగ్ సౌకర్యాలతో ప్రతి కార్మికుడికి, వారి కుటుంబాలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక కార్యక్రమమిది. రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని, ఒప్పంద కార్మికులకు రూ. 40 లక్షల కవరేజీని ఈ ప్యాకేజీ ద్వారా అందిస్తారు. 2.15 లక్షల రెగ్యులర్ ఉద్యోగులు, 44,000 మంది ఒప్పంద కార్మికులు ఇప్పటికే ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. కార్మికులకు విస్తృత ప్రయోజనాలు సమర్థంగా లభించేలా.. పది ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, చత్తీస్‌గఢ్ రాష్ట్ర గ్రామీణ బ్యాంకుతో అవగాహన ఒప్పందం ద్వారా దీనిని అమలు చేశారు. ఉద్యోగులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. భాగస్వామ్య బ్యాంకుల ద్వారా నేరుగా ప్రయోజనాలను అందించే ఈ కార్యక్రమం.. సంక్షేమమే కేంద్రంగా రూపొందించినదని ఈ చర్యలతో స్పష్టమవుతోంది.
ఈ సంక్షేమ చర్యలతో పాటు.. కోల్ ఇండియా ఉద్యోగులకు ఉమ్మడి గుర్తింపు, వృత్తి నైపుణ్యం, భద్రతను పెంపొందించడానికి వీలుగా కొత్త యూనిఫాంను కూడా ప్రారంభించారు. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనుల నుంచి పరిపాలన కార్యాలయాలు, క్షేత్ర స్థాయి ప్రాజెక్టుల వరకు.. కోల్ ఇండియా కుటుంబ ఐక్యత, కీర్తి, గౌరవాన్ని ఈ యూనిఫాం ప్రతిబింబిస్తుంది. కార్మికుల్లో ఆత్మీయ భావనను, ఐక్యతను బలోపేతం చేస్తుంది.
కోల్ ఇండియా కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని నిలబెట్టడంలో సంస్థ అంకితభావాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి. బలమైన సామాజిక రక్షణ, సమగ్ర ఆర్థిక భద్రత, సమ్మిళిత అస్తిత్వం ద్వారా.. ఉద్యోగుల సంక్షేమం, కార్మిక శక్తి నిర్వహణలో కోల్ ఇండియా కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దేశ ఇంధన రంగాన్ని సురక్షిత, స్ఫూర్తిదాయక, విలువైన శ్రామిక శక్తి ముందుకు నడిపిస్తోందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశ ఇంధన భద్రతకు బొగ్గు గని కార్మికులను వెన్నెముకగా గుర్తిస్తున్నాయి.
***
(Release ID: 2167475)
Visitor Counter : 2