గనుల మంత్రిత్వ శాఖ
ఖనిజాల విషయంలో స్వావలంబన, ఆవిష్కరణలపై జాతీయ స్థాయి సెమినార్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గనుల మంత్రిత్వ శాఖ
జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ను ముందుకుతీసుకెళ్తున్న మంత్రిత్వ శాఖ
ఖనిజాల విషయంలో స్వావలంబన, ఆవిష్కరణలకు సంబంధించి
రోడ్‌మ్యాప్‌ను ప్రకటించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
Posted On:
16 SEP 2025 6:10PM by PIB Hyderabad
జాతీయ కీలక ఖనిజాల మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ - ఎన్సీఎంఎం) ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై హైదరాబాద్‌లో జరిగిన సెమినార్‌కు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఖనిజాల విషయంలో స్వావలంబనను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం.. ఈ రంగంలో సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించటంపై ప్రభుత్వానికి ఉన్న దార్శనికతను మంత్రి వివరించారు. ఖనిజాన్వేషణను వేగవంతం చేయడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు.. రక్షణ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన కీలక ఖనిజాలకు సంబంధించిన బలమైన వ్యవస్థను సృష్టించేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఖనిజ రంగంలో స్థిరమైన వృద్ధి ఉండేలా చూసుకునేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రభుత్వం ఏకోన్ముఖంగా పనిచేయటం వంటి అంశాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు.
ఈ సెమినార్‌లో భాగంగా జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద గుర్తింపు పొందిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలు).. వాటికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆర్అండ్డీ సంస్థల భాగస్వామ్యంతో కీలక ఖనిజాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏడు సీఓఈల (ఐఐటీ బాంబే, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్, సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ భువనేశ్వర్, సీఎస్ఐఆర్-ఎన్ఎంఎల్ జంషెడ్పూర్, ఎన్ఎఫ్టీడీసీ హైదరాబాద్) అధిపతులు ఆయా సంస్థల్లో కీలక ఖనిజాలకు (ముడి పదార్థాల) సంబంధించి కొనసాగుతోన్న పరిశోధన, ఆవిష్కరణలు, ఆచరణాత్మకత గురించి తెలియజేశారు. ప్రాధాన్యతలు, మద్దతు విధానాలు, పరిశోధన- అభివృద్ధికి సంబంధించిన విధివిధానాలను పరిశ్రమ ప్రతినిధులుపంచుకున్నారు.
ఈ సదస్సులో నాలుగు సాంకేతిక సమావేశాలు జరిగాయి. ఇవి కీలక ఖనిజాల సమర్థవంతమైన ప్రాసెసింగ్, శుద్ధికి సంబంధించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన సంస్థాగత ఆర్అండ్‌డీ దార్శనికతపై దృష్టి సారించాయి. ఈ సమావేశాల్లో ‘పాలన, తక్షణమే ఉపయోగించుకునే పద్ధతిలో సీఓఈలను సంస్థాగతీకరించడం.. పరిశ్రమ ప్రాధాన్యతలను గుర్తించడం, అర్అండ్డీ ప్రాజెక్టులలో భాగస్వామ్యాన్ని పెంచడం.. ఆర్‌అండ్‌డీ స్థాయి నుంచి టీఆర్ఎల్ 7/8 పైలట్ కేంద్రాలు, వాణిజ్యపరమైన విడుదల ముందు చేసే ప్రదర్శనల స్థాయి వరకు ఆవిష్కరణలను తీసుకెళ్లేందుకు భారీగా ఆచరణాత్మక ఆర్అండ్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటం.. భారతదేశ వ్యూహాత్మక రంగాల అవసరాలకు అనుగుణంగా సీఓఈల ఆర్అండ్‌డీ ఎజెండా ఉండేలా చూసుకోవటం’ అనే అంశాలపై చర్చించారు.
ఈ చర్చలు ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం, సీఓఈలు- వాటి భాగస్వాముల మధ్య సన్నిహిత సహకారం.. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, కీలక ఖనిజాలలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి పరిశ్రమల చురుకైన భాగస్వామ్యం అనే అంశాల ప్రాముఖ్యతను తెలియజేశాయి. ఎన్సీఎంఎం కింద భాగస్వామ్యాల ద్వారా పనిచేయటంపై ఈ సెమినార్‌లో చేపట్టిన చర్చలు బలమైన పునాది వేశాయి. కీలక ఖనిజాల పరిశోధన, ప్రాసెసింగ్, సాంకేతిక ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉంచేందుకు ఇవి ఒక రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి జీ. కిషన్ రెడ్డి.. “కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో భారత్‌ను కేంద్రంగా చేయటం” అనే సీఈఈడబ్ల్యూ నివేదికతో పాటు దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన రోడ్‌మ్యాప్ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. గనుల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు శ్రీ షకీల్ ఆలం, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్. మూర్తి.. విద్యా సంస్థలు- పరిశ్రమ సహకారంపై పరిశీలనలను పంచుకున్నారు. పరిశోధన, సామర్థ్య నిర్మాణానికి కృషికి చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లకు అవార్డులను ఇచ్చారు. రేపటి నుంచి మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (సీపీఎస్‌యూ) ఏకరీతి సంక్షేమ చట్రాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా.. భద్రత, గౌరవం, సామాజిక భద్రత ఉండేలా చూసుకునేందుకు రూ. 1 కోటి బీమా పథకం కిందకు సాధారణ మైనింగ్ ఉద్యోగులందరూ వస్తారని తెలిపారు.
13 రాష్ట్రాలలో 19 కాంపోజిట్ లైసెన్స్ (సీఎల్), 4 అద్దె గనుల (ఎంఎల్) బ్లాక్‌లతో కూడిన 6వ విడత వేలాన్ని మంత్రి జీ. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో విస్తరించి ఉన్న ఈ బ్లాక్‌లు స్వచ్ఛ విద్యుత్, అధునాతన తయారీ, వ్యూహాత్మక రంగాలకు సంబంధించిన కీలక ఖనిజాలకు సంబంధించినవి. ఇందులో భూమిలో లభించే అరుదైన మూలకాలు (ఆర్ఈఈ), నియోబియం, టాంటాలమ్, సీసియం, టంగ్స్టన్, లిథియం, టిన్, గ్రాఫైట్, వనాడియం, కోబాల్ట్, టైటానియం, గాలియం, జిర్కోనియం, రాక్ ఫాస్ఫేట్, పొటాష్, ఇతర అరుదైన లోహాలు ఉన్నాయి. టెండర్ పత్రాల అమ్మకం 2025 సెప్టెంబర్ 23న ప్రారంభమై.. 2025 నవంబర్ 24న సాయంత్రం సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. బిడ్ల సమర్పణకు చివరి తేదీ 2025 డిసెంబర్ 1 (సాయంత్రం 5:00 గంటలు). మరిన్ని వివరాలు https://www.mstcecommerce.com/auctionhome/mlcln/ లో అందుబాటులో ఉన్నాయి. గనుల మంత్రిత్వ శాఖ 55 బ్లాకులను సంబంధించిన అయిదు విడతల వేలాన్ని పూర్తి చేసింది. ఇందులో 34 బ్లాకుల వేలం విజయవంతమైంది. ఈ వేలంపాటల నుంచి వచ్చే ఆదాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది.
1వ విడత అన్వేషణ లైసెన్స్ (ఈఎల్- ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్) బ్లాక్‌లకు సంబంధించిన ప్రాధాన్య బిడ్డర్లను మంత్రి జీ. కిషన్ రెడ్డి ప్రకటించారు. సంస్థలు పరస్పరం చర్చించుకోవటానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది. లిథియం, రాగి, బంగారం, భూమిలోని అరుదైన మూలకాల వంటి విలువైన ఖనిజాల కోసం నిర్వహించిన ఈఎల్ బ్లాక్‌ల మొదటి వేలం విజయవంతంగా పూర్తయింది. వేలం కోసం పెట్టిన 13 బ్లాక్‌లలో 7 బ్లాక్‌లు రెండో రౌండ్‌కు చేరుకున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది వేలానికి సంబంధించి ఆదాయాన్ని పెంచటంతో పాటు.. ఖనిజాన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, హరిత సాంకేతికతలకు మద్దతునివ్వటం, ఇంధన పరివర్తన, అత్యాధునిక పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది.
పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.. పరిశోధన ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడం, భారత వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా స్వావలంబనతో కూడిన ఖనిజ రంగ వ్యవస్థను తయారు చేయటంపై నిబద్ధతతో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. కీలక ఖనిజాల రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములందరికీ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో కూడా నిరంతరం కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.
***
(Release ID: 2167408)
Visitor Counter : 2