ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్ సీఏ), కల్చరల్ ఆర్కైవ్స్ అండ్ కన్జర్వేషన్ డివిజన్, 'మరో బుద్ధ ప్రతిమకు మూలం' అనే థీమ్ తో ఆనంద కెంటిష్ కుమారస్వామి నాలుగో స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించింది. భారతీయ కళలు వాటి సౌందర్యాత్మక భావనలను అర్థం చేసుకునేందుకు ఆయన రచనలు మార్గం చూపించాయి. ఈ ఉపన్యాసాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ నమన్ పి. అహుజా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కళా చరిత్రకారుడు, ఐజీఎన్ సీఏ మాజీ సభ్య కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. కల్చర్ ఆర్కైవ్స్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ విభాగాధిపతి ప్రొఫెసర్ అచల్ పాండ్య ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ నమన్ అహుజా మాట్లాడుతూ.. భారతీయ కళల అధ్యయనానికి ఆనంద కె. కుమారస్వామి చేసిన సేవలు, ముఖ్యంగా మూర్తి పూజ, విగ్రహారాధన ప్రారంభ మూలాలను అర్థం చేసుకోవటానికి ఆయన చేసిన పరిశోధనల గురించి వివరించారు. గాంధార కళపై గ్రీకు ప్రభావం గురించి విస్తృతంగా ఆమోదయోగ్యమైన ఆల్ఫ్రెడ్ ఫౌచర్ సిద్ధాంతాన్ని తిరస్కరించటం ఆయన రచనల్లో కీలకమైనదన్నారు. కుమారస్వామి 'దిఆరిజిన్ ఆఫ్ ది బుద్ధ ఇమేజ్' అనే తన వ్యాసంలో.. బుద్దుడి విగ్రహాలు కేవలం గ్రీకు ప్రభావం వల్ల పుట్టలేదని, భారతీయ సంప్రదాయాలు, తాత్వికత నుంచే వచ్చాయని రాశారు. ఈ ఆలోచనలు జాతీయవాద భావనలకు మాత్రమే పరిమితం కాకుండా భగవద్గీతలో వివరించినట్లుగా, విగ్రహారాధన, దేవునిపై నమ్మకం, భక్తి వంటి వాటి నుంచి వచ్చాయని కుమారస్వామి భావించారని ప్రొఫెసర్ అహుజా వెల్లడించారు. కుషాణుల కాలంలో ప్రసిద్ధి చెందిన మధుర, గాంధార, అమరావతిలోని బౌద్ధ విగ్రహాలు ప్రత్యేక లక్షణాలతో నియమానుగుణంగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు.
ఇటీవల జరిగిన పరిశోధనల ఆధారంగా, మొదట్లో ఉన్న అన్ని చిత్రాలూ బుద్ధుడిని వర్ణించలేదని, చాలా వరకు అవి బోధిసత్వుల విగ్రహాలని ప్రొఫెసర్ అహుజా అన్నారు. ఒకటో శతాబ్దం నాటికి సూర్యుడు, లక్ష్మీ, బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతామూర్తులు బౌద్ధ సంస్కృతిలో భాగమయ్యాయని చెప్పారు. బెంగాల్ లోని చంద్రకేతుగఢ్ లో లభించిన పురాతన వస్తువుల గురించి ప్రస్తావిస్తూ, రాతి శిల్పాలకు భిన్నంగా బంకమట్టి, టెర్రకోట, కలప, దంతాలను ఉపయోగించినట్లు ప్రొఫెసర్ అహుజా వెల్లడించారు. తవ్వకాల్లో లభించిన దంతాల అవశేషాల పేటికలు, క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. రెండో శతాబ్దం మధ్య కాలానికి చెందినవని, అవి బుద్ధుని జీవితంలోని సంఘటనలను కాలానుక్రమంలో కాకుండా శాతవాహనుల కళా సంప్రదాయంలో చిత్రీకరించినవన్నారు. అవి బౌద్ధ సిద్ధాంతాలు ప్రాంతీయ శైలిలోకి అనువాదం జరిగిన తీరుని వివరిస్తాయని అహుజా తెలిపారు.
ఈ ఆవిష్కరణలు కుమారస్వామి ప్రాథమిక వాదనలను పునః పరిశీలించాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయంటూ ప్రొఫెసర్ అహుజా తన ప్రసంగాన్ని ముగించారు. దైవారాధన, విగ్రహారాధన గురించి కుమారస్వామి అవగాహన అమూల్యమైనదైనప్పటికీ మధుర నుంచి బెంగాల్ వరకు లభించిన ఆధారాలు బుద్ధుడు, బోధిసత్వుల విగ్రహాల సృష్టి ఒకటి కాదని, అవి దశలవారీగా, ప్రాంతాలవారీగా మారినట్లు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు.
భారతదేశంలో దాదాపు 30,000 స్మారక కట్టడాలు, పురావస్తు ప్రదర్శనశాలల్లో ఎన్నో విగ్రహాలున్నప్పటికీ, దాని పురావస్తు, శాసనాలకు సంబంధించి చాలా వరకు ఇంకా అధ్యయనం చేయలేదని డాక్టర్. కె.కె. చక్రవర్తి పేర్కొన్నారు. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, భౌతిక సంస్కృతిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి జరుగుతున్న ప్రస్తుత ప్రయత్నాలు సరైనవన్నారు. పాశ్చాత్య దృక్పథాన్ని వదిలి, ఉత్తర, దక్షిణ భారత్ మధ్య జరిగిన కళా మాండలీకాలపై కుమారస్వామి చేసిన అధ్యయనం వల్ల ఉత్తర భారతంలో ప్రధానంగా కనిపించే రేఖాగణిత ఆకారాలు క్రమంగా దక్షిణ భారతదేశంలోని సున్నితమైన, స్థూలమైన కళా శైలిగా పరిణామం చెందిన క్రమం స్పష్టంగా అర్థమైందని డాక్టర్ చక్రవర్తి వివరించారు. ప్రపంచ మేధావులతో కుమారస్వామి నిర్వహించిన సంభాషణలతో ఉత్తర-దక్షిణ భారత శిల్పకళా రీతులపై ఆయనకున్న అవగాహన తెలుస్తుందన్నారు. దక్షిణ, మధ్య ఆసియాలో విగ్రహారాధన, విగ్రహం లేకుండా పూజించే సంప్రదాయాలు రెండూ ఏకకాలంలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇందుకు ఉదాహరణగా, తాలాలో శివ-బుద్ధ సమ్మేళనం.. శైలి, తత్వశాస్త్రాల సమ్మేళనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తొలినాళ్లలో యక్షుడిని పోలి ఉన్న మధుర బుద్ధ విగ్రహాలు కాలక్రమేణా గాంధార శైలిలో దివ్యమైన రూపాలుగా మారాయని డాక్టర్ చక్రవర్తి తెలిపారు. కుమారస్వామి దృష్టిలో బుద్ధుడు కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, పురాణాలు, తత్వశాస్త్రం, విశ్వవిజ్ఞాన శాస్త్రాల సమ్మేళనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ నమన్అహుజా కృషిని ప్రశంసిస్తూ, భారతదేశపు వారసత్వానికి సంబంధించి పరిశోధించని అంశాలు ఇంకా చాలా ఉన్నాయని, సంబంధిత చిహ్నాలను సందర్భానుసారంగా సమన్వయం చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వారికి, హాజరైన వారికి కల్చరల్ ఆర్కైవ్స్ డివిజన్ ఇన్ఛార్జ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిల్పి రాయ్ కృతజ్ఞతలు తెలిపారు. కళలు, చరిత్ర, సాంస్కృతిక రంగాల నుంచి పెద్ద సంఖ్యలో పరిశోధకులు, ఉపాధ్యాయులు, పండితులు, కళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళలు, సంస్కృతికి సంబంధించి కుమారస్వామి ప్రతిపాదించిన ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఈ వార్షిక ఉపన్యాసాన్ని నిర్వహించారు.
***