రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహన రంగ తయారీలో ప్రపంచదేశాల్లో అగ్ర స్థానంలో నిలవాలన్నది భారత్ లక్ష్యం: నితిన్ గడ్కరీ
Posted On:
15 SEP 2025 5:03PM by PIB Hyderabad
వాహన రంగ తయారీ, హరిత రవాణా, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆవిష్కరణలలలో ప్రపంచంలోనే అగ్రగ్రామి దేశంగా భారత్‌ను నిలబెట్టేందుకు ఒక ప్రతిష్ఠాత్మక రోడ్‌మ్యాప్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి ఆవిష్కరించారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ వ్యాల్యూ సదస్సు- 2025లో ఇవాళ ప్రకటన చేశారు.
భారత్ ఇప్పుడు జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. రాబోయే ఐదు సంవత్సరాలలో అగ్ర స్థానంలోకి దూసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. “ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రధాన వాహన కంపెనీలు ఇప్పుడు భారత్‌లో ఉన్నాయి. వాటి దృష్టి అసెబ్లింగ్ నుంచి భారత్ నుంచి ప్రపంచానికి వాహనాలను ఎగుమతి చేయడం వైపు మళ్లింది” నితిన్ గడ్కరీ అన్నారు. దేశీయ ద్విచక్ర వాహన రంగ ఉత్పత్తిలో 50 శాతం కంటే ఎక్కువ ఎగుమతి అవుతోందని, ఇది ప్రపంచంలో బలపడుతున్న భారత్ స్థానాన్ని తెలియజేస్తోందని ప్రధానంగా చెప్పారు.
హరిత రవాణా గురించి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధనాలలో భారత్ నాయకత్వ స్థానాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. "మేం ఇప్పటికే హైడ్రోజన్ ట్రక్కులను ప్రారంభించాం. పది మార్గాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ప్రపంచాన్ని హరిత వాహనాలతో నడిపించడమే మా లక్ష్యం" అని అన్నారు. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, రిలయన్స్, ఇండియన్ ఆయిల్ వంటి కంపెనీల మద్దతుతో.. హైడ్రోజన్ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ. 600 కోట్ల గ్రాంట్లను అందించింది. ప్రస్తుతం క్రియాశీల పరీక్షల్లో ఉన్న ఐసోబుటనాల్, బయో-తారు వంటి కొత్త ఇంధనాల విషయంలో పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు.
భారతదేశంలో రహదారులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా భారీ పురోగతిని సాధించాయి. "భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థను కలిగి ఉంది. మేం ప్రయాణ సమయాన్ని బాగా తగ్గించాం. పానిపట్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి మూడు గంటలకు బదులుగా ఇప్పుడు కేవలం 35 నిమిషాలు పడుతోంది" అని వ్యాఖ్యానించారు. చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే, రూ. 23,000 కోట్ల బెంగళూరు రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులు అనుసంధానత రూపురేఖలను మార్చేందుకు, పట్టణ రద్దీని తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాయి.
సుస్థిరత ఇతివృత్తంగా మంత్రి ప్రసంగం కొనసాగింది. “మేం వ్యర్థాలను సంపదగా మారుస్తున్నాం. ఘాజీపూర్ నుంచి వచ్చిన 80 లక్షల టన్నుల వ్యర్థాలను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించాం. మేం అక్కడ పేరుకుపోయిన చెత్త ఎత్తును ఏడు మీటర్లు తగ్గించాం” అని మంత్రి అన్నారు. వరి పంట వ్యర్థాల నుంచి తయారు చేసిన బయో-తారు పరీక్షల విజయాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఇది పెట్రోలియం ఆధారిత తారు కంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ఇది పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రీకాస్ట్ ఆధారిత రహాదారుల నిర్మాణం, టన్నెల్ ఇంజనీరింగ్, హైడ్రోజన్ రవాణా వ్యవస్థలు, చక్రీయ ఆర్థిక వ్యవస్థ పరిష్కారాలు వంటి కీలక ఆవిష్కరణ రంగాలలో ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలకు నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. “మనకు వనరుల సమస్య లేదు. మన రోడ్లకు ఆదాయం కూడా ఉంది. మన ఆదాయం బలంగా ఉంది. మనకు కావలసింది మీ ఆవిష్కరణ, మీ సాంకేతికత, మీ సహకారం” అని ఆయన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలిపారు.
***
(Release ID: 2166986)
Visitor Counter : 2