బొగ్గు మంత్రిత్వ శాఖ
జార్ఖండ్‌లోని సీసీఎల్ మగధ-సంఘమిత్ర ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్‌తో శ్రీ జి. కిషన్ రెడ్డి భేటీ
జేఎస్ఎస్‌పీఎస్‌లో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను సత్కరించి.. రాంచీలో ఐబీఎమ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
బొగ్గు తవ్వకాల కార్యకలాపాలను సమీక్షించిన శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
12 SEP 2025 7:54PM by PIB Hyderabad
జార్ఖండ్ పర్యటన రెండో రోజున కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి.. ఇంధన భద్రత, సమాజ సంక్షేమం, క్రీడలను ప్రోత్సహించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటే అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముందుగా హోత్వార్‌లోని ఖేల్‌గావ్‌లో జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ (జేఎస్ఎస్‌పీఎస్)ని శ్రీ కిషన్ రెడ్డి సందర్శించారు. శిక్షణార్థులు ఆయనకు ఒక మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. యువ క్రీడాకారులు, వారి కోచ్‌లతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ద్వారా దేశానికి కీర్తి తెచ్చిన ఆటగాళ్లను సత్కరించారు.
జేఎస్ఎస్‌పీఎస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్‌ను పరిశీలించిన శ్రీ కిషన్ రెడ్డి అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలుసుకున్నారు. సెప్టెంబరులో జన్మించిన 16 మంది పిల్లల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి.. కేక్ కట్ చేయడంతో పాటు, కానుకలిచ్చి వారిని ఆశీర్వదించారు. యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కఠినమైన శిక్షణను కొనసాగిస్తూ రాష్ట్రానికీ, దేశానికీ కీర్తి తేవాలని శ్రీ కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
సీసీఎల్, జార్ఖండ్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన జేఎస్ఎస్‌పీఎస్.. హాకీ, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, విలువిద్య సహా 11 విభాగాల్లో ఆధునిక క్రీడా శిక్షణ సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటివరకు జేఎస్ఎస్‌పీఎస్ క్రీడాకారులు 15 అంతర్జాతీయ పతకాలు, 262 జాతీయ పతకాలు, 1352 రాష్ట్ర పతకాలతో ప్రశంసనీయ విజయాన్ని సాధించారు.
అనంతరం శ్రీ జి. కిషన్ రెడ్డి రాంచీలో మీడియా ప్రతినిధులతో సంభాషించారు. సీసీఎల్‌లో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్-కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) గురించి ప్రస్తావిస్తూ.. మైనింగ్‌లో అత్యాధునిక సాంకేతికత, ఆధునిక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ కృషిని ఆయన వివరించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ లాభాపేక్షతో నడిచేది కాదనీ, భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, "వికసిత్ భారత్" దార్శనికత సాకారం కోసం తన వంతు కృషి చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.
రాంచీలో కొత్తగా నిర్మించిన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎమ్) ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఇది ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మధ్యాహ్నం ఛత్రా జిల్లాలోని సీసీఎల్ మగధ-సంఘమిత్ర ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ స్థానికులు ఆయనకు సాంప్రదాయికంగా స్వాగతం పలికారు. వ్యూ పాయింట్ నుంచి కేంద్ర మంత్రి మైనింగ్ కార్యకలాపాలను సమీక్షించారు. సమగ్ర వివరాలను అడిగి తెలుసుకోవంతో పాటు సమర్థమైన, సుస్థిర మైనింగ్ పద్ధతులకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రాజెక్టు ప్రభావితులైన 24 మందికి ఇంటర్వ్యూ లేఖలను అందజేశారు. మహిళా ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన కేంద్ర మంత్రి.. వారి సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, కార్మికులను కలిసి మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మగధ-సంఘమిత్ర ప్రాంతం ప్రత్యేక ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించింది.
ఈ పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి వెంట బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ పీ.ఎమ్. ప్రసాద్, సీసీఎల్ సీఎండీ శ్రీ నీలేందు కుమార్ సింగ్, సీఎంపీడీఐఎల్ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్, బీసీసీఎల్ సీఎండీ శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్, మంత్రిత్వ శాఖ, సీఐఎల్, సీసీఎల్లకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సాయంత్రం జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్‌తో సమావేశమయ్యారు. బొగ్గు తవ్వకం, సమాజ సమగ్రాభివృద్ధి, కార్మిక సంక్షేమం వంటి అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
***
(Release ID: 2166243)
Visitor Counter : 9