బొగ్గు మంత్రిత్వ శాఖ
ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలతో గిరిజన విద్యార్థులకు సాధికారత: కోల్ ఇండియా... ఎన్ఎస్టీఎఫ్‌డీసీ మధ్య అవగాహన ఒప్పందం
Posted On:
09 SEP 2025 9:52PM by PIB Hyderabad
ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలల్లో చేరిన గిరిజన విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా.. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని- కోల్ ఇండియా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని- జాతీయ గిరిజన తెగల ఆర్థిక, అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్టీఎఫ్‌డీసీ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. గిరిజన విద్యార్థుల సంక్షేమం దిశగా ఇదో కీలక చర్య. కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువల్ ఓరం సమక్షంలో న్యూఢిల్లీలోని జాతీయ గిరిజన పరిశోధన సంస్థలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
“డిజిటల్ సదుపాయాలు, కెరియర్ మార్గనిర్దేశం, రుతుస్రావ సమయంలో పరిశుభ్రత, ఉపాధ్యాయుల్లో సామర్థ్యాభివృద్ధి ద్వారా ఏకలవ్య ఆదర్శ గిరిజన ఆవాస పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల సాధికారత’’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. విద్య, సాంకేతికత, సమగ్రాభివృద్ధి ద్వారా దేశంలోని గిరిజన యువత అభ్యున్నతి దీని లక్ష్యం. ప్రాజెక్టులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
-
డిజిటల్ విద్య: డెస్కుటాప్ కంప్యూటర్లు, యూపీఎస్, మినీ కంప్యూటర్లు (టాబ్లెట్లు) పంపిణీ ద్వారా సాంకేతిక సదుపాయాలను మెరుగుపరచడం.
-
కెరియర్ మార్గనిర్దేశం: కెరియర్ కు సంబంధించి గిరిజన విద్యార్థులు తెలివిగా నిర్ణయాలు తీసుకునేలా నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా మార్గనిర్దేశం.
-
రుతుస్రావ సమయంలో పరిశుభ్రత: బాలికల ఆరోగ్యం, గౌరవాన్ని పెంపొందించేలా శానిటరీ నాప్కిన్ విక్రయ యంత్రాలు, ఇన్సినిరేటర్ల ఏర్పాటు.
మైనింగ్ ప్రాంతాల పరిసరాల్లోని గిరిజన వర్గాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధిపరంగా అంతరాలను తగ్గించడంలో సీఐఎల్ కృషిని కేంద్ర బొగ్గు - గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రశంసించారు. గిరిజన వర్గాలు అభ్యున్నతి సాధించినప్పుడే వికసిత భారత్ లక్ష్యం సాకారమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ యంత్రాంగమంతా కలసికట్టుగా అంకితభావంతో పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. నాణ్యమైన విద్యతో ఆధునిక, సాధికారిక తరాన్ని సన్నద్ధం చేసే దిశగా ఏకలవ్య ఆదర్శ ఆవాస పాఠశాలలు అత్యంత ప్రాథమికమైనవని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఒప్పందం పాఠశాలల్ని బలోపేతం చేసి, గిరిజన విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం మాట్లాడుతూ.. సీఐఎల్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని, సంస్థ అందిస్తున్న చేయూతను స్వాగతించారు. గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం ప్రత్యేక సీఎస్సార్ ద్వారా చేయూతనిచ్చేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కోల్ ఇండియా డైరెక్టర్ (హెచ్ఆర్) శ్రీ వినయ్ రంజన్ మాట్లాడుతూ.. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఐఎల్ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా, బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి కోసం క్రియాశీల సహకారాన్ని అందిస్తూ దేశాభివృద్ధిలో ముందు వరుసలో ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతపై.. సీఎస్సార్ కార్యక్రమాల ద్వారా సీఐఎల్ విప్లవాత్మక ప్రభావాన్ని చూపిందని ఆయన పేర్కొన్నారు. ఈఎంఆర్ఎస్, ఎన్ఎస్టీఎఫ్‌డీసీ వంటి సంస్థలతో సీఐఎల్ భాగస్వామ్యాల ద్వారా గిరిజన యువతకు శాశ్వత అవకాశాలు లభిస్తాయన్నారు.
అవగాహన ఒప్పందం విజయవంతమవడంలో భాగస్వాములైన అందరినీ బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపీందర్ బ్రార్ ప్రశంసించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఐఎల్, ఇతర ప్రభుత్వ సంస్థల మధ్య సమష్టి కృషితోనే.. సీఎస్సార్ కార్యక్రమాలు గిరిజన విద్యార్థులకు సమర్థంగా అందుతాయని, ఈ సహకారం అత్యావశ్యకమని ఆమె స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతిని ఉమ్మడి బాధ్యతగా భావించే సమ్మిళిత అభివృద్ధి దృక్పథానికి ఈ తరహా భాగస్వామ్యాలు ఉదాహరణగా నిలుస్తాయన్నారు. ఈ అవగాహన ఒప్పందం ప్రారంభం మాత్రమేనన్న ఆమె.. నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా అమలు చేసి, సాధించడం కోసం అందరూ సమష్టిగా కృషిచేయాలని కోరారు.
***
(Release ID: 2165225)
Visitor Counter : 4