వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా అంకుర సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న డీపీఐఐటీ, ఐసీఐసీఐ
డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకురాలకు యాక్సిలరేటర్ సౌలభ్యం, మార్గదర్శకత్వం, పైలట్
అవకాశాలను అందించడమే ఈ అవగాహన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
04 SEP 2025 3:06PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యాపార, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), ఐసీఐసీఐ బ్యాంకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంకు ఒక ప్రత్యేకమైన స్టార్టప్ అనుసంధాన కార్యక్రమాన్ని రూపొందించి, స్టార్టప్ ఇండియా వేదికపై అమలు చేయనుంది. ఈ కార్యక్రమం స్టార్టప్ ఇండియా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో సమన్వయం చేసుకొని, ఎక్కువ అంకుర సంస్థలు పాల్గొనేలా చేయనుంది. దేశవ్యాప్తంగా డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థల ప్రచారాన్ని పెంపొందించడం, అవగాహన కల్పించడం, సంబంధాలను ఏర్పాటు చేయడం వంటి అంశాల్లో ఐసీఐసీఐ బ్యాంకుకు స్టారప్ ఇండియా సహాయం చేస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన అంకుర సంస్థలకు ముంబయిలోని ఐసీఐసీఐ బ్యాంకుతో యాక్సిలరేటర్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో వీరికి ప్రత్యేకంగా కేటాయించిన పని ప్రాంతంతో పాటు నిర్మాణాత్మక పాఠ్యాంశాలు, పారిశ్రామికవేత్తల నుంచి మార్గదర్శకత్వం పొందే వెసులుబాటు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు వ్యాపార విభాగాలతో పైలట్ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం పరిశ్రమల ఆధారిత వర్క్‌షాప్‌లు, ఆవిష్కరణ ప్రదర్శనలలో పాల్గొనడానికి వీలు కల్పించడంతో పాటు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, పెట్టుబడిదారులు, సంభావ్య వినియోగదారులతో పరిచయాలు ఏర్పరుచుకునే అవకాశాలను కూడా విస్తరిస్తుంది.
ఈ భాగస్వామ్యం ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు యాక్సిలరేటర్ కార్యక్రమాలు, మార్గదర్శకత్వ అవకాశాలు, వ్యాపార వ్యవస్థతో అనుసంధానం వంటి అవకాశాలను అంకుర సంస్థలకు అందించనుంది.
ఈ కార్యక్రమం స్టార్టప్ ఇండియా పథకం కింద నిర్వహించనున్నారు. ఇది ప్రారంభించబోయే లేదా అభివృద్ధి దశలో ఉన్న స్టార్టప్‌లకు ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శక ప్రణాళికను అందించనున్నది. అంకుర సంస్థలకు తమ వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి పెరుగుదల, కార్యకలాపాల విస్తరణ వంటి రంగాల్లో సహకరించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది..
ఈ సందర్భంగా డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ మాట్లాడుతూ.. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం స్టార్టప్‌లతో అర్థవంతమైన అనుసంధానాన్ని ఏర్పరచడం ద్వారా దీర్ఘకాలిక ప్రభావాన్ని ఏర్పరచనుందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం ప్రారంభిచబోయే, అభివృద్ధి దశలో ఉన్న యువ పారిశ్రామికవేత్తలకు కొత్త మద్దతు మార్గాలను అందిస్తుందని చెప్పారు. వారు సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా దేశ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్ (బీఎస్ఈ: ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ: ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్వైఎస్ఈ: ఐబీఎన్) దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటి. జూన్ 30, 2025 నాటికి బ్యాంకు మొత్తం ఆస్తులు రూ. 21,23,839 కోట్లుగా ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2163917)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12