కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
“నివేశక్ దీదీ- రెండో దశ”ను ప్రారంభించిన ఐఈపీఎఫ్ఏ:
మహిళల ద్వారా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను వేగవంతం చేయడం లక్ష్యంగా కార్యక్రమం
ఆర్థిక అవగాహనను బలోపేతం చేయడం, మరింతగా ప్రజల్లోకి వెళ్లడం, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు,
క్షేత్రస్థాయి సంస్థల సహకారంతో ప్రభావవంతంగా పనిచేస్తూ.. గ్రామీణ ప్రజలను సాధికారులను చేయడమే లక్ష్యం
Posted On:
01 SEP 2025 5:52PM by PIB Hyderabad
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అధారిటీ (ఐఈపీఎఫ్ఏ) దాని ప్రధాన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నివేశక్ దీదీ రెండో దశను ఈ రోజు హైదరాబాద్‌లో విజయవంతంగా ప్రారంభించింది.
ఆర్థిక అవగాహనను పెంచడంతోపాటు గ్రామీణ వర్గాలను, ముఖ్యంగా మహిళలను సాధికారులను చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఐఈపీఎఫ్ఏ సీఈవో శ్రీమతి అనితా షా ఆకెళ్ల, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తెలంగాణ సర్కిల్ ప్రాంతీయాధిపతి శ్రీ కృష్ణ కుమార్. ఎల్ సమక్షంలో పటేల్‌గూడలో ఆర్థిక అవగాహన శిబిరం ప్రారంభమైంది.

శ్రీమతి అనితా షా ఆకెళ్ల మాట్లాడుతూ.. మహిళలు, గ్రామీణ కుటుంబాలు ఆర్థిక పరిజ్ఞానంతో సన్నద్ధులై ఉండి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకోవడం, దేశ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల భాగస్వాములు కావడం ఎంత ముఖ్యమో వివరించారు. విజ్ఞానపరమైన అంతరాలను తొలగించడానికి, సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి నివేశక్ దీదీ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా స్థానిక భాష తెలుగులో ఈ శిబిరాన్ని నిర్వహించారు.
విస్తృతంగా గ్రామాలు, పంచాయతీలను చేరుకుంటూ.. ఆర్థిక అవగాహన, సేవలను క్షేత్రస్థాయి వరకు అందించడంలో ఐపీపీబీ కీలక పాత్ర పోషిస్తోందని శ్రీ కృష్ణ కుమార్ ఎల్ వివరించారు. సురక్షిత, పారదర్శకమైన ఆర్థిక మార్గాలను తెలుసుకునేందుకు ప్రజలకు ఇది వీలు కల్పిస్తుంది.
మొదటి దశ కార్యక్రమం విజయవంతమవడంతో.. విస్తృతిని పెంచుకుంటూ, మరిన్ని ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలను పరిచయం చేస్తూ, క్షేత్రస్థాయి సంస్థలతో సహకారంతో గరిష్ట ప్రభావాన్ని చూపేలా నివేశక్ దీదీ రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల నేతృత్వంలో ఆర్థిక సాధికారత, పొదుపు, పెట్టుబడి భద్రత, మోసాల నివారణ, సురక్షిత లావాదేవీల కోసం డిజిటల్ వేదికలను ఉపయోగించుకోవడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది.

ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల రక్షణను పెంపొందించడం, మరింత జాగరూకమైన - ఆర్థికంగా చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా వ్యూహాత్మక భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ఐఈపీఎఫ్ఏ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2162931)
Visitor Counter : 2