సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
2047 భారతదేశ దార్శనికతను నిజం చేసేది ఈ రోజు ఉద్యోగాల్లో చేరే యువ అధికారులేనన్న డాక్టర్ జితేంద్ర సింగ్
శిక్షణ పొందుతున్న అధికారుల కోసం భారతదేశ.. జిల్లా పారిశ్రామిక ప్రదర్శన కోసం
అకాడమీలోని ఓడీఓపీ డిస్‌ప్లే హాల్
డ్యూటీ ముఖ్యం: రూ.50 కోట్లతో నిర్మించిన 'కర్తవ్యశిల' ఆడిటోరియాన్ని జాతికి అంకితం చేసిన మంత్రి
సివిల్ సర్వెంట్లు.. పరిపాలనను తప్పనిసరిగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో
అనుసంధానించాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
31 AUG 2025 7:42PM by PIB Hyderabad
ముస్సోరి, ఆగస్టు 31: అకాడమీలో రూ.50 కోట్లతో కొత్తగా నిర్మించిన 800 సీట్ల సామర్థ్యం గల "కర్తవ్యశిల" ఆడిటోరియాన్ని ఇవాళ కేంద్ర సైన్స్, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్, సహాయ మంత్రి (స్వతంత్ర), పీఎంఓ, సిబ్బంది సహాయ మంత్రి, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి శాఖ, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.
అన్ని సర్వీసుల నుంచి వచ్చే వారిలో సమష్టి అభ్యాసాన్ని, ఐక్యతను పెంపొందించడానికి రూపొందించిన "ఆలోచనలు, చర్చలు, ప్రేరణలకు ఇది ఒక వేదిక" అని మంత్రి అభివర్ణించారు.
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్
(ఎల్‌బీఎస్ఎన్ఏఏ)లో కొత్తగా శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్ సివిల్ సర్వెంట్లకు సంబంధించి 100వ ఫౌండేషన్ కోర్సులో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... వారు "భారతదేశ 2047 రూపశిల్పులు" అనీ, రాజ్యాంగానికి సంరక్షకులుగా అభివృద్ధి చెందిన, పౌర-కేంద్రీకృత దేశాన్ని నిర్మించడంలో వారి పాత్ర కీలకమనీ వ్యాఖ్యానించారు.
భారతదేశం స్వాతంత్ర్యం పొంది 2047 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో, ఈ రోజు ఉద్యోగాల్లో చేరే ఈ యువ అధికారులకు దేశ గమనాన్ని తీర్చిదిద్దే బాధ్యతను అప్పగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన 2025 బ్యాచ్ అభ్యర్థులను అభినందిస్తూ, విద్యా శిక్షణ కన్నా ఫౌండేషన్ కోర్సు కీలకమని మంత్రి అన్నారు. "ఈ కోర్సు మీ విద్యాభ్యాసం నుంచి ప్రజాసేవ వ్యవస్థీకృత రంగానికి మారటాన్ని సూచిస్తుంది. పాలనాపరమైన బాధ్యతలను తీసుకోవటానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది" అని తెలిపారు.
అన్ని భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులు, రాయల్ భూటాన్ సివిల్ సర్వీసుతో సహా 19 సివిల్ సర్వీసులకు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు ఈ బృందంలో ఉన్నారని, ఇది భారతదేశ పరిపాలనా సమగ్ర స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.
అకాడమీలో రూ.50 కోట్లతో కొత్తగా నిర్మించిన 800 సీట్ల సామర్థ్యం గల "కర్తవ్యశిల" ఆడిటోరియాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఇది అన్ని సర్వీసుల నుంచి వచ్చే వారిలో సమష్టి అభ్యాసాన్ని, ఐక్యతను పెంపొందించడానికి రూపొందించిన "ఆలోచనలు, చర్చలు, ప్రేరణలకు ఒక వేదిక" అని అభివర్ణించారు.
అకాడమీలో నూతనంగా ప్రారంభమైన ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) ప్రదర్శన హాల్, ఫెసిలిటేషన్ సెంటర్‌పై ఆయన మాట్లాడారు. దీని లక్ష్యం స్థానిక పారిశ్రామికతను ప్రదర్శించటం, దాన్ని జాతీయ మార్కెట్లకు అనుసంధానించడం. సమ్మిళిత అభివృద్ధిలో క్షేత్రస్థాయి జీవనోపాధి అవకాశాల ప్రాముఖ్యతను గుర్తించడంలో శిక్షణ పొందుతున్న అధికారులకు ఓడీఓపీ సహాయపడుతుందని మంత్రి అన్నారు. శిక్షణలో నూతన ఆవిష్కరణల గురించి ప్రస్తావించిన మంత్రి... హిమాలయన్ స్టడీ టూర్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌తో అనుసంధానం, గ్రామ ప్రజలతో మమేకమవటం, గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఆరంభ్ 7.0 కార్యక్రమం గురించి వివరించారు. ఇందులో భాగంగా శిక్షణ పొందుతున్న వారు ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులను కలిసి మాట్లాడతారు. ఈ అనుభవాలు వృత్తిపరమైన సామర్థ్యంతో పాటు సహనం, సానుభూతి, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. వేగంగా మారుతున్న పాలనా వాతావరణంలో, అధికారులకు నిరంతర అభ్యాస సాధనాలను అందించడానికి రూపొందించిన మిషన్ కర్మయోగి గురించి మాట్లాడారు. “బాధ్యతలు మారుతున్న కొద్దీ, మీరు వాటికి అనుగుణంగా ఉంటూ అంకితభావం, సమగ్రత, నైతిక ధైర్యాన్ని కాపాడుకోవాలి” అని చెప్పారు.
ప్రధానమంత్రి సూచన మేరకు అకాడమీలో ప్రారంభించిన ఒక పద్దతిలో 2024 బ్యాచ్ వారి విజన్ స్టేట్‌మెంట్లను టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచే కార్యక్రమాన్ని కూడా మంత్రి పర్యవేక్షించారు. శిక్షణ పొందినవారు తమ ప్రయాణాన్ని, దేశానికి చేసిన సేవలను సమీక్షించుకోవడానికి 2047లో తిరిగి వచ్చినప్పుడు వీటిని తెరుస్తారు.
సివిల్ సర్వెంట్ల ముందున్న సవాళ్లను గుర్తుచేస్తూ యువ అధికారులు తమ రాజ్యాంగ విధిని, రాజకీయ వాస్తవాలను, పౌరుల అంచనాలను గౌరవప్రదంగా సమం చేసుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించాలని వారిని కోరారు. “మీరు మీ జనన సమయాన్ని ఎంచుకోలేదు. కానీ ఈ బాధ్యత మీకు అప్పగించారు. దీన్ని దేవుడిచ్చిన ప్రత్యేక అవకాశంగా భావించండి” అని యువ సివిల్ సర్వెంట్లకు చెప్పారు.
***
(Release ID: 2162831)
Visitor Counter : 2