రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ మంత్రి సమక్షాన విశాఖపట్నంలో ‘ఐఎన్‌ఎస్ ఉదయగిరి... హిమగిరి’ మల్టీ-మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్‌ల నావికాదళ ప్రవేశం


· భవిష్యత్తరం ఆయుధాలు-వ్యవస్థలుగల ఈ నౌకలతో సముద్ర కార్యకలాపాల్లో జాతీయ ప్రయోజనాల పరిరక్షణ దిశగా నావికాదళ సామర్థ్యం పెరుగుతుంది

· హిందూ మహాసముద్రంలో తొలి ‘ప్రతిస్పందనదారు... ప్రాధాన్య భద్రత భాగస్వాములు’గా ఈ నౌకలు తమ పాత్రను ప్రస్ఫుటం చేస్తాయి: మంత్రి

· “ప్రభుత్వ స్వావలంబన సంకల్పానికి ఐఎన్‌ఎస్ ఉదయగిరి... హిమగిరి ఉజ్వల ఉదాహరణలు”

· “స్వయంసమృద్ధ భారత్‌ కేవలం ఓ నినాదం కాదు... అది క్షేత్రస్థాయి వాస్తవంగా మారుతూ భవిష్యత్ దృక్కోణంతో సాయుధ దళాలు బలోపేతం అవుతున్నాయి”

· “దుందుడుకు విస్తరణ వాదాన్ని భారత్‌ ఎన్నడూ విశ్వసించదు... కానీ, మనకు హాని తలపెట్టే వారిముందు ఏ కోశానా తలవంచదు”

Posted On: 26 AUG 2025 5:45PM by PIB Hyderabad

విశాఖపట్నంలోని నావికాదళ స్థావరంలో ఈ రోజు రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ‘ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి’ మల్టీ-మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్‌ (బహుళ ప్రయోజన) యుద్ధనౌకలు నావికాదళ ప్రవేశం చేశాయి. నౌకా నిర్మాణంలో భారత్ సామర్థ్యం నానాటికీ ఇనుమడిస్తోంది, స్వావలంబన దిశగా దేశం ముందడుగు వేస్తున్నదనడానికి ఈ ఘట్టం ఒక నిదర్శనం. దేశీయంగా నిర్మితమైన రెండు ప్రధాన సముద్ర ఉపరితల యుద్ధ నౌకలను ఏకకాలంలో ప్రారంభించడం ఇదే తొలిసారి. రక్షణ మంత్రిత్వశాఖ ప్రారంభించిన ‘ప్రాజెక్ట్‌-17ఎ’ కింద ముంబయిలోని మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్‌), ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి నౌకను తయారు చేసింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్‌ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్‌ఎస్‌ఈ) ఐఎన్‌ఎస్‌ హిమగిరి నౌకను రూపొందించింది.

ఈ సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగిస్తూ- ఈ నౌకలు భారత సముద్ర భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. సముద్ర కార్యకలాపాల్లో మన దేశ ప్రయోజనాల పరిరక్షణతోపాటు మానవతా సహాయం-విపత్తు ఉపశమన చర్యల్లోనూ ఇవి తోడ్పడతాయని ప్రకటించారు. ఈ రెండు నౌకల జల ప్రవేశంతో భారత్‌ అనుసరిస్తున్న ‘పొరుగుకు ప్రాధాన్యం’ (ఇరుగుపొరుగు దేశాలకు ప్రాధాన్యం), ‘మహాసాగర్‌’ (పరస్పర-సంపూర్ణ పురోగమనంతో ఈ ప్రాంత దేశాలన్నిటికీ భద్రత-వృద్ధి) విధానాలు మరింత బలోపేతం కాగలవని ఆయన పేర్కొన్నారు. “ఈ యుద్ధనౌకలతో మన నావికాదళ సామర్థ్యం ఇనుమడిస్తుంది. తన సముద్ర సరిహద్దులు రక్షించుకోవడంలో భారత్‌కుగల సంపూర్ణ సామర్థ్యం ప్రస్ఫుటమవుతుంది. ముఖ్యంగా ఏదైనా గడ్డు పరిస్థితి తలెత్తితే తక్షణ  స్పందనకు దేశం సర్వసన్నద్ధంగా ఉందనే సందేశం పంపుతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

స్వయంసమృద్ధ నావికాదళం

‘ప్రాజెక్ట్‌-17 (శివాలిక్‌ క్లాస్‌) తదుపరి తరం ‘ప్రాజెక్ట్‌-17ఎ’ (నీలగిరి క్లాస్‌) కింద రూపొందుతున్న అత్యాధునిక యుద్ధ నౌకలలో తొలి నౌక ‘ఐఎన్‌ఎస్‌ నీలగిరి.’ ఆ తర్వాత ఇప్పుడు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి నౌకలు నావికాదళంలో భాగమయ్యాయి. ఈ తరగతి నౌకలలో “మెరుగైన నిగూఢత లక్షణాలు (స్టెల్త్ ఫీచర్స్‌), రాడార్‌కు దొరకని విశిష్టత (రెడ్యూస్డ్‌ రాడార్‌ సిగ్నేచర్స్‌), అత్యాధునిక నిఘా రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, ఉపరితలం నుంచి ఉపరితలంలోకి, ఆకాశంలోకి ప్రయోగించగల సూపర్‌సోనిక్ క్షిపణులు, రాపిడ్-ఫైర్ గన్” వంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెండు కొత్త నౌకలలో ‘కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ ప్లాంట్లు’ అత్యాధునిక ‘ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ కూడా ఉన్నాయి. వీటివల్ల ఈ నౌకలకు అధిక వేగంతోపాటు ఇంధన పొదుపు సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.

ఈ రెండూ మన నావికాదళంలోని యుద్ధనౌకల రూపకల్పన విభాగం (డబ్ల్యూడీబీ) రూపుదిద్దిన 100, 101వ యుద్ధనౌకలు కాగా, పూర్తిగా భారత్‌లోనే తయారు కావడం విశేషం. యుద్ధ నౌకలలో స్వదేశీ వ్యవస్థల పాత్ర పెంపుతోపాటు స్వావలంబన దిశగా మన నావికాదళం నిరంతర కృషిని ఇవి ప్రతిబింబిస్తాయి. ఇందులో అనేక ‘సూక్ష్మ-చిన్న-మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల భాగస్వామ్యం ఉంది. దీంతోపాటు దేశీయ వాస్తవ పరికర తయారీదారుల నుంచి ప్రధాన ఆయుధాలు, సెన్సర్ల వగైరాలలో 75 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందాయి.

స్వయంసమృద్ధ భారత్‌పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వప్న సాకారంలో ఈ రెండు యుద్ధ నౌకల ప్రారంభోత్సవం ఒక కీలక ముందడుగని రక్షణశాఖ మంత్రి అభివర్ణించారు. అంతేగాక ప్రభుత్వ దార్శనికత, నిబద్ధతలకు ఇదొక రుజువని పేర్కొన్నారు. “స్వావలంబనపై ప్రభుత్వ దృఢ సంకల్పానికి ‘ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి’ నౌకలే ఉజ్వల ఉదాహరణ. ప్రగతిశీల పరిణామానికి సంకేతాలు మాత్రమేగాక భాగస్వాముల సమష్టి కృషితో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహించగలదని, స్వావలంబన లక్ష్యాన్ని చేరగలదనే విశ్వాసానికి నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. శక్తిమంతమైన ఈ రెండు యుద్ధనౌకల నిర్మాణం, సకాలంలో సరఫరా దిశగా ‘ఎండీఎల్‌, జీఆర్‌ఎస్‌ఈ’ల మధ్య నిరంతర సహకారాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు.

నీలి సముద్రాన్ని శాసించగల నావికా దళం

భారత సముద్ర రంగంలో అన్ని కీలక కార్యకలాపాలు సజావుగా సాగడంలో ఈ బహుళ ప్రయోజన యుద్ధ నౌకలు ఎంతగానో తోడ్పడతాయి. భవిష్యత్తరం ఆయుధాలు-వ్యవస్థలుగల ఈ నౌకలతో జాతీయ ప్రయోజనాల పరిరక్షణ దిశగా నావికాదళ సామర్థ్యం ఇనుమడిస్తుంది. గగనతల, ఉపరితల, జలాంతర్గత యుద్ధ పద్ధతులన్నిటా సాటిలేని రీతిలో ఈ యుద్ధనౌకలు రూపొందాయి. రక్షణ, యుద్ధ విధుల్లోనే కాకుండా సముద్ర ప్రాదేశిక నియంత్రణ, మానవతా కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోగల సామర్థ్యం వీటి సొంతం.

‘ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి’ నౌకల ప్రవేశంతో నావికాదళ పోరాట సామర్థ్యం మరింత బలపడుతుంది. అంతేగాక హిందూ మహాసముద్ర ప్రాంతంలో తొలి ‘ప్రతిస్పందనదారు, ప్రాధాన్య భద్రత భాగస్వామి’గా నావికాదళ పాత్రను ఇవి ప్రస్ఫుటం చేస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “సముద్ర దొంగల దాడులను తిప్పికొట్టడం, వస్తువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణాను అరికట్టడం, సముద్ర ఉగ్రవాద నియంత్రణలో వీటి సామర్థ్యం అపారం. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టే ఉపశమన చర్యల్లో తోడ్పడగలగడం వీటి ప్రత్యేకత. ఈ విధంగా అన్ని రకాల ప్రమాదకర, సంక్లిష్ట పరిస్థితులలో విశేష సేవలందించే వినూత్న నౌకలు నావికాదళ సామర్థ్యాన్ని కొత్త మలుపు తిప్పగలవు” అని ఆయన పేర్కొన్నారు.

అరేబియా సముద్రం నుంచి మధ్యప్రాచ్యం, తూర్పు ఆఫ్రికా సముద్ర తీరందాకా మన నావికాదళ కార్యకలాపాలు సాగుతుంటాయి. అయినప్పటికీ, కర్తవ్య నిబద్ధతతో దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుందని రక్షణశాఖ మంత్రి గుర్తుచేశారు. ఆ విధంగా మన నావికాదళం భారత సముద్ర రంగ సామర్థ్యానికి ఒక చిహ్నమని ఆయన అభివర్ణించారు. “భౌగోళిక-వ్యూహాత్మక పరిస్థితుల రీత్యా మన ఆర్థికాభివృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేయగల సామర్థ్యం నావికాదళానికి ఉంది. దేశ ఇంధన అవసరాలు, చమురు, సహజ వాయువు రవాణా మొత్తం ఈ ప్రాంత భద్రతపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల జాతీయ ఆర్థిక భద్రతకు కీలక మూలస్తంభంగా నావికాదళం ప్రధాన పాత్ర పోషిస్తుంది” అని ఆయన వివరించారు.

నిరంతర సర్వసన్నద్ధ నావికాదళం

ఆపరేషన్ సిందూర్ సమయంలో నావికాదళ సత్వర వ్యూహ రచన-అమలును శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. “భారత నావికాదళ శక్తిసామర్థ్యాలు ఎలాంటివో, అది రెప్పపాటులో ఎంతటి విధ్వంసం సృష్టించగలదో శత్రువుకు అవగతమైంది” అన్నారు. భారత్‌ నిటారుగా నిలబడగలదని ఈ ఆపరేషన్‌లో త్రివిధ దళాలు సహా ఇతర భద్రత సంస్థలు/విభాగాల మధ్య నిరంతర సమన్వయం రుజువు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

“దుందుడుకు విస్తరణ వాదాన్ని భారత్‌ ఎన్నడూ విశ్వసించదు. దాడికి దిగడం లేదా రెచ్చగొట్టడం మన విధానాలు కావు. కానీ, మనకు హాని తలపెట్టేవారిని ఏ కోశానా ఉపేక్షించే ప్రసక్తే లేదు. భద్రతకు ముప్పు వాటిల్లితే దీటైన జవాబు ఇవ్వడం ఎలాగో మనకు తెలుసు. పహల్గామ్‌లో అమాయక పౌరులు బలయ్యారు. దీనిపై ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం ప్రభావశీల, సమతుల, కచ్చితమైన ప్రతిస్పందనను ప్రదర్శించాం. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతినబూనడమే కాకుండా ఎంచుకున్న లక్ష్యాలను విజయవంతంగా సాధించాం. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ ముగియలేదని, ఇది విరామం మాత్రమేనని పునరుద్ఘాటిస్తున్నాను. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ రోజున యావద్దేశం ఉగ్రవాద నిర్మూలనపై ఏకాభిప్రాయంతో ఉంది. ఈ జాతీయ ఐక్యత, క్రమశిక్షణ, త్యాగం, అంకితభావాలే మన వాస్తవిక బలం” అని రక్షణశాఖ మంత్రి వ్యాఖ్యానించారు.

భవిష్యత్‌ సంసిద్ధ నావికాదళం

ప్రపంచంలో యుద్ధరీతులు వేగంగా మారిపోతున్న నేటి పరిస్థితులను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావిస్తూ- ప్రతి సందర్భంలోనూ కొత్త సాంకేతికతలు, వ్యూహాలు, ఆయుధాలు కనిపిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రతి దేశం నిత్య నవీకరణ మార్గంలో నిరంతర అన్వేషణ ద్వారా మునుపెన్నడూ ఎరుగని సామర్థ్యాన్ని సంతరించుకోవడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. “నేటి ఆధునిక యుగంలో పాతకాలపు ఆలోచన ధోరణి పనికిరాదు. రక్షణ రంగంలో రాబోయే కొత్త ముప్పును ముందుగానే పసిగట్టి, తగిన పరిష్కారాలను సిద్ధం చేసుకోవాలి. అందుకే, మా ప్రభుత్వం రక్షణ రంగ పరిశోధన-ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తోంది. ఇంతకుముందు మనం అత్యాధునిక పరికరాల కోసం కొన్ని దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు భారత్‌ తన సొంత గడ్డపై వీటిని ఉత్పత్తి చేసుకోగలుగుతోంది” అని ఆయన అన్నారు.

స్వయంసమృద్ధ భారత్‌ కార్యక్రమం సాధించిన ఘన విజయాన్ని భావికాలపు దృక్కోణంతో సాయుధ దళాల బలోపేతంపై ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనంగా రక్షణశాఖ మంత్రి అభివర్ణించారు. “నేడు భూ, జల, గగనతలాలనే కాకుండా అంతరిక్షం, సైబర్ ప్రపంచం, ఆర్థిక-సామాజిక రంగాలనూ మన సొంత బలంతో రక్షించుకుంటున్నాం. స్వావలంబన ఇకపై ఓ నినాదానికి పరిమితం కాదు... అది క్షేత్రస్థాయి వాస్తవంగా రూపుదాలుస్తోంది. మన శాస్త్రవేత్తలు, సాయుధ దళాల అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తుండటమే ఇందుకు కారణం” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నావికాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠీ కూడా ప్రసంగించారు. భారత సముద్ర శక్తి నిరంతర ప్రగతికి, గతిశీల విస్తరణకు ఈ జంట యుద్ధనౌకల జల ప్రవేశమే ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన అభివర్ణించారు. నేటి అనిశ్చిత, పోటీ యుగంలో సముద్రంపై అసమాన నావికాదళ శక్తిసామర్థ్యాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... భారత్‌ శత్రువులకు ఇది సింహస్వప్నమని పేర్కొన్నారు. “ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన నావికాదళం మెరుపు వేగంతో మోహరింపు, దూకుడైన వ్యూహాలతో పాకిస్థాన్ నావికాదళం ఆటకట్టించింది. దీంతో దాడి నిలిపివేత కోసం కాళ్లబేరానికి వచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.

దేశ భద్రత వ్యవస్థలో ఒక ఆశ్చర్యకర పరిణామంగా, విశిష్టతకు నిదర్శనంగా స్వదేశీ పరికరాల తయారీ కోసం ప్రధాని మోదీ పిలుపునివ్వడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా రక్షణ ఉత్పాదనలో స్వావలంబనను చాటుతూ 75 శాతానికిపైగా స్వదేశీ సామగ్రితో ‘ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, హిమగిరి’ యుద్ధనౌకలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు నౌకల జలప్రవేశం దిశగా రాత్రింబవళ్లు భుజం కలిపి కృషిచేసిన కమాండింగ్‌ ఆఫీసర్లు, సిబ్బందితోపాటు నౌకా నిర్మాణంలో పాలుపంచుకున్న భాగస్వామ్య సంస్థలను అడ్మిరల్‌ త్రిపాఠీ అభినందించారు.  

ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ సహా ఇతర సీనియర్ అధికారులు, నావికాదళ మాజీ అధికారులు తదితర ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

ఐఎన్ఎస్ ఉదయగిరి... హిమగిరి గురించి మరిన్ని విశేషాలు

భారత నావికాదళంలో సేవలందించిన పాతతరం యుద్ధనౌకల పేరిట వాటి స్థానంలో ప్రవేశపెట్టే కొత్త నౌకలకు నామకరణం చేయడం సంప్రదాయం. తదనుగుణంగా దశాబ్దాలపాటు దేశానికి గర్వకారణంగా నిలిచిన మునుపటి ఉదయగిరి, హిమగిరి పేర్లనే కొత్త నౌకలకు కొనసాగించారు. ఈ మేరకు ఆధునిక ఉదయగిరి నౌక, 1976 నుంచి 2007దాకా సేవలందించిన ‘ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి’కి నివాళి అర్పించింది. అలాగే కొత్త హిమగిరి నౌక 1974 నుంచి 2005 వరకూ సేవ చేసిన పూర్వపు ‘ఐఎన్‌ఎస్‌ హిమగిరి’ని గౌరవించింది. ఇవాళ జల ప్రవేశం చేసిన కొత్త నౌకలు భారత ఉజ్వల సముద్ర వారసత్వాన్ని ఆశాజనక భవిష్యత్ ఆకాంక్షలతో అనుసంధానిస్తాయి.

ఈ రెండు ప్రధాన యుద్ధనౌలు తూర్పు సముద్ర తీరంపై భారత నావికాదళ ఆధిపత్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. తూర్పు నావికాదళ కమాండ్ కింద జలప్రవేశం చేసిన ఈ నౌకలు సముద్ర జలాల్లో తలెత్తే ఎలాంటి ఆకస్మిక పరిస్థిల్లోనైనా వేగంగా స్పందించగలవు. అంతేగాక బంగాళాఖాతం సహా ఇతర సముద్ర మార్గాల భద్రతలో భారత్‌ సామర్థ్యం గణనీయంగా ఇనుమడిస్తుంది.

భారత స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యంపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. ప్రపంచ ప్రమాణాలకు దీటుగా సంక్లిష్ట వేదికల నిర్మాణం, నిర్వహణ సంకల్పాన్ని పునరుద్ఘాటించింది. ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, హిమగిరి నౌకలతో భారత నావికాదళం తన అమ్ముల పొదికి రెండు శక్తియుత బహుళ ప్రయోజన ఫ్రిగేట్ల (యుద్ధనౌకల)ను జోడించింది. తద్వారా భారత సముద్ర ప్రాబల్యంతోపాటు హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా నావికాదళ శక్తిని చాటుతూ భద్రతా సామర్థ్యం మరింత బలోపేతమైంది.

‘నీలగిరి’ తరగతి (క్లాస్‌) కింద నిర్మించే 6 నౌకలలో ‘ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి’కి 2019 మే 7న ఉక్కు చట్రం (కీల్‌) ఏర్పాటు చేయగా, 2022 మే 17న నిర్మాణం పూర్తయింది. అలాగే ‘ఐఎన్‌ఎస్ హిమగిరి’కి 2018 నవంబర్ 10న శ్రీకారం చుట్టగా, 2020 డిసెంబర్ 14న సిద్ధమైంది. జల ప్రవేశానంతరం ఈ రెండు యుద్ధ నౌకలను 2025 జూలై 1, 31 తేదీల్లో భారత నావికాదళానికి అప్పగించారు. దీనికిముందు నౌకాశ్రయంతోపాటు సముద్రంలో సమగ్ర పరీక్షలు పూర్తిచేశారు. మిగిలిన 4 నౌకలను కూడా ‘ఎండీఎల్‌, జీఆర్‌ఎస్‌ఈ’ సంస్థలే నిర్మిస్తుండగా 2026 మధ్యలో ఇవి నావికదళానికి అందవచ్చునని అంచనా.

 

***


(Release ID: 2161281) Visitor Counter : 18