రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రణ్ సంవాద్-2025కు సర్వం సిద్దం.. యుద్ధం, యుద్ధతంత్రం, రణరీతులపై మొట్టమొదటి త్రివిధ దళాల చర్చాసభ.. దీనికి మధ్యప్రదేశ్‌లోని ఆర్మీ వార్ కాలేజీయే వేదిక

• సర్వసభ్య సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్న రక్షణ మంత్రి

• తెర ముందుకు రానున్న సంయుక్త సిద్ధాంతాలు, సాంకేతిక దృష్టికోణం, సామర్థ్యాల మార్గ సూచి

Posted On: 25 AUG 2025 4:27PM by PIB Hyderabad

యుద్ధం, యుద్ధతంత్రం, రణరీతులపై మొట్టమొదటి త్రివిధ దళాల చర్చ ‘రణ్ సంవాద్-2025’కు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేద్కర్ నగర్‌ ఆర్మీ వార్ కాలేజీలో రేపే (ఆగస్టు 26న) ఈ విశిష్ట కార్యక్రమాన్ని మొదలు పెట్టి, రెండు రోజులు నిర్వహించనున్నారు. సైన్య నిపుణులు పాల్గొనే ఈ వ్యూహాత్మక చర్చ ముగింపు కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. ఆయన కీలకోపన్యాసాన్నిస్తారు. సెమినార్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని సంయుక్త సిద్ధాంతాలు, సాంకేతిక దృష్టికోణం, సామర్థ్యాల మార్గసూచిని కూడా ఆవిష్కరించనున్నారు.

 

ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించబోవడం ఇదే తొలి సారి. దీనిలో అగ్రగామి అధికారులు ఆధునిక రణరంగంలో పాలుపంచుకొన్న తమ ప్రత్యక్ష అవగాహనను, ఆలోచనలను స్వయంగా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీడీఎస్ మార్గదర్శకత్వం వహిస్తుండగా ఆర్మీ ట్రయినింగ్ కమాండ్ సహకారంతో హెడ్‌క్వార్టర్స్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్ దీనికి సారథ్యం వహిస్తోంది.

 

రణరీతుల్లో కీలకాంశాలపై సైనిక సముదాయాల నడుమ పరస్పర అవగాహన, కమ్యూనికేషన్‌తో పాటు సహకారాన్ని ఇప్పటితో పోలిస్తే మరింతగా పెంచడం ‘రణ్ సంవాద్-2025’ ధ్యేయం. ఆచరణసాధ్య దృష్టికోణాలకు, ప్రత్యక్ష అనుభవాలకు స్థానం కల్పిస్తున్న హుషారైన వేదికగా దీనిని రూపొందించారు. విద్యాబోధన ప్రక్రియను మించి, ఈ సెమినార్ మారుతున్న యుద్ధతంత్ర తాజా స్వభావాలను అర్థం చేసుకోవడానికీ, సమరాంగణాన నిలిచి కర్తవ్యపాలన చేసే జవానుల వ‌‌ృత్తినైపుణ్యాన్నుంచి నేర్చుకోవడానికీ విలువైన అవకాశాన్ని అందించనుంది.

 

పదాతిదళం, వైమానిక దళాలతో పాటు నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారులే కాకుండా, రక్షణ రంగ నిపుణులు, రక్షణ పరిశ్రమ ప్రముఖులు, అంతర్జాతీయ స్థాయి భద్రత రంగ వృత్తికుశలురు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనే అవకాశాలు ఉన్నాయి. అర్థవంతమైన చర్చ చేపట్టి, సమాచార ప్రధాన రణతంత్రం మొదలు గ్రే జోన్ త్రెట్స్‌తో పాటు సమీకృత యుద్ధ కార్యకలాపాలు, భావి సంగ్రామ సాంకేతికతల వరకు అనేక అంశాలు ఈ సెమినార్ లో ప్రస్తావనకు రానున్నాయి. ఇండియన్ ఆర్మీ ఆతిథ్యం వహించే ఈ సంవత్సర కార్యక్రమానికి తరువాయిగా రాబోయే సంవత్సరాల్లో నిర్వహించే ఇదే రకం కార్యక్రమాలకు ముందు ముందు భారతీయ నౌకాదళంతో పాటు భారతీయ వైమానిక దళం కూడా వంతులవారీ సారథ్య బాధ్యతలు తీసుకొనేలా ఒక పటిష్ఠ పునాదిని వేయబోతున్నారు.

 

భారత్ భద్రతను బలోపేతం చేస్తూనే, భద్రత పరంగా ప్రపంచ దేశాలు కూడా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఒక ముఖ్య చర్చావేదికగా నిలవాలనేదే ‘రణ్ సంవాద్-2025’ ఆకాంక్ష. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సాధించడం, మూడు రకాల సైన్య దళాల మధ్య మెరుగైన సమన్వయాన్ని ఏర్పరచడంతో పాటు ఒక్క మన దేశ వాస్తవాలనే కాకుండా అంతర్జాతీయ భద్రత స్థితిని కూడా లెక్కలోక తీసుకొని విశ్వసించదగ్గ సైనిక పాటవాన్ని పెంపొందించడం .. ఈ అవసరాల్ని తీర్చడానికి ఉన్న ప్రాధాన్యం రోజు రోజుకూ పెరిగిపోతోందనే సంగతిని ఈ చర్చాసభ నిర్వహణ ప్రయత్నం ప్రతిబింబిస్తోంది.‌

 

***


(Release ID: 2160688)
Read this release in: English , Urdu , Hindi , Bengali