జాతీయ మానవ హక్కుల కమిషన్
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం నిర్లక్ష్యం కారణంగా
మహిళ మృతి చెందిన ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
రెండు వారాల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని
రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, అనంతపురం జిల్లా పోలీస్ అధికారికి నోటీసులు జారీ
Posted On:
22 AUG 2025 6:23PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 34 ఏళ్ల మహిళ మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తల్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. సదరు మహిళ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, శస్త్రచికిత్స అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మరణించింది.
వార్తల్లో వచ్చిన సమాచారం నిజమే అయితే, ఇది బాధిత మహిళ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్య అని కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఘటనపై దర్యాప్తు స్థితితో సహా వివరణాత్మక నివేదికను రెండు వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, అనంతపురం జిల్లా పోలీస్ అధికారికి నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 4, 2025న మీడియాలో ప్రచురితమైన సమాచారం ప్రకారం.. జిల్లా వైద్యారోగ్య శాఖ సంబంధిత ఆసుపత్రిని మూసివేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
***
(Release ID: 2160049)