జల శక్తి మంత్రిత్వ శాఖ
కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్
Posted On:
21 AUG 2025 3:50PM by PIB Hyderabad
కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్(కేడబ్ల్యూడీటీ-II) తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి 30.12.2010న సమర్పించింది. ఐఎస్ డబ్ల్యూఆర్ డీ చట్టం 1956, సెక్షన్ 5(2) ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని కూడా నివేదికలో పేర్కొంది. అనంతరం అదే చట్టంలోని సెక్షన్ 5(3) ప్రకారం మరిన్ని వివరాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు ట్రైబ్యునల్ ను కోరాయి. తదనుగుణంగా ఐఎస్ డబ్ల్యూఆర్ డీ చట్టం 1956, సెక్షన్ 5(3) ప్రకారం మరో నివేదికను 29.11.2013న ట్రైబ్యునల్ సమర్పించింది. అందులో అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు కృష్ణా జలాలు కేటాయించాలని సూచించింది. రాష్ట్రాల అభ్యర్థన మేరకు భవిష్యత్తులో ట్రైబ్యునల్ అవార్డు పునఃసమీక్షకు రావచ్చు. గతంలో వివిధ ట్రైబ్యునళ్లు కూడా తాము చేసిన కేటాయింపులను నిర్దిష్ట కాలం తరువాత పునఃసమీక్ష చేయాలని సూచించడమే ఇందుకు కారణం.
30.12.2010న కేడబ్ల్యూడీటీ-II ఇచ్చిన నివేదికను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూడు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిఫరెన్స్ పిటిషన్లపై ట్రైబ్యునల్ తీసుకునే నిర్ణయమేదైనా సరే.. చట్టంలోని సెక్షన్ 6 (1) ప్రకారం అధికారిక గెజిట్‌లో ప్రచురించకూడదని 16.09.2011న వెలువరించిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు స్టే విధించటంతో 29.11.2013 నాటి ట్రైబ్యునల్ నిర్ణయాన్ని నోటిఫై చేయలేదు.
తదుపరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 89లో ఉన్న సూచనలను పరిష్కరించడానికి ట్రైబ్యునల్ కాల పరిమితిని ప్రతి ఏటా పొడిగిస్తూ వచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 01.08.2025 నుంచి అమల్లోకి వచ్చే విధంగా కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II కాలపరిమితిని మరో ఏడాది పాటు పెంచింది. దానికి సంబంధించి 10.07.2025వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ నెం.3221(ఇ)ని 15.07.2025న ప్రచురించింది.
ఈ విషయాన్ని కేంద్ర జల శక్తి సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి ఇవాళ లోక్ సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 2159775)
Visitor Counter : 6