ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2028 వరకు బలవర్ధకమైన బియ్యం పథకం పొడిగింపు.. ప్రభుత్వ సాయం రూ. 17,082 కోట్లు
· పీఎం పోషణ్ పథకం ద్వారా విద్యార్థులకు బలవర్ధకమైన ఉత్పత్తులతో పోషకాలతో నిండిన ఆహారం
· ఎన్డీడీబీ ‘గిఫ్ట్ మిల్క్’ కార్యక్రమంతో 11 రాష్ట్రాల్లో 41,700 మంది పిల్లలకు లబ్ధి: పిల్లలకు బలవర్ధకమైన పోషకాలు
Posted On:
21 AUG 2025 3:20PM by PIB Hyderabad
ఈ ప్రశ్నలో పేర్కొన్న విషయం పరిపాలనపరంగా.. వినియోగదారీ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం, ప్రజా పంపిణీ విభాగం, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య- అక్షరాస్యత విభాగం, అలాగే మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక- పాడిపరిశ్రమ విభాగం, మహిళా- శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.
ఆహార, ప్రజా పంపిణీ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం.. బలవర్ధకమైన ఆహారాలకు ప్రాధాన్యమిస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018లో అనీమియా ముక్త్ భారత్ (ఏఎంబీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. బియ్యంలో బలవర్ధక పోషకాలను జోడించే ప్రయోగాత్మక కార్యక్రమం 2019లో ప్రారంభమైంది. వరి ప్రధాన ఆహారంగా తీసుకునే వారి కోసం దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారీగా విస్తరించేందుకు 2022లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024 మార్చి నాటికి, ఆహార భద్రత కార్యక్రమాల కింద మిల్లు నుంచి వచ్చిన బియ్యం పంపిణీ స్థానంలో బలవర్ధకమైన పోషకాలను జోడించిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పథకాల కింద అందరికీ బలవర్ధకమైన బియ్యం సరఫరాను 2028 డిసెంబర్ వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి భారత ప్రభుత్వం 100 శాతం నిధులను (రూ. 17,082 కోట్లు) సమకూరుస్తుంది.
ఈ ప్రశ్న తమకు సంబంధించినది కాదని ఆరోగ్, కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసింది.
పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం అందించిన సమాచారం ప్రకారం.. పీఎం పోషణ్ పథకం కింద భోజనం తయారీకి పోషకాలను జోడించిన బియ్యాన్ని ఉపయోగిస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బడి పిల్లల్లో సూక్ష్మపోషక లోపాలను పరిష్కరించడం దీని ముఖ్యోద్దేశం. రక్తహీనతను నివారించడం లక్ష్యంగా.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కలిగిన బియ్యాన్ని ఆహార- ప్రజా పంపిణీ శాఖ సరఫరా చేస్తోంది. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద భోజనం తయారీలో రెండింతల పోషకాలను జోడించిన ఉప్పు (డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ - డీఎఫ్ఎస్), బలవర్ధక పదార్థాలను జోడించిన వంటనూనె (విటమిన్లు ఎ, డి) ఉపయోగించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఈ వంటనూనె విటమిన్ ఎ, డి లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం అందించే ఉప్పు ఐరన్ లోపాన్ని, రక్తహీనతను, గాయిటర్ను నివారించడంలో సహాయపడుతుంది. బలవర్ధక పోషకాలను జోడించిన బియ్యం, గోధుమ పిండి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడడంతోపాటు పిల్లల్లో మానసిక, భావోద్వేగ, నాడీపరమైన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
ఈ ప్రశ్నకు సంబంధించి సమాచారం తమవద్ద లేదని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ పేర్కొన్నది. అయితే, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించి పోషకాహార లోపాన్ని నిర్మూలించడంతోపాటు పాలు, బలవర్ధకమైన పాల ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా.. గుజరాత్‌లోని ఆనంద్‌లో 2015లో రిజిస్టర్డ్ సంస్థ, ట్రస్టు అయిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఫౌండేషన్ ఫర్ న్యూట్రిషన్ (ఎన్ఎఫ్ఎన్) ఏర్పాటైందని వారు పేర్కొన్నారు. విరాళాలు, ఆర్థిక సాయం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) విరాళాల నుంచి నిధుల ద్వారా.. పోషకాహార లోపం గురించి అవగాహన పెంచడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ‘గిఫ్ట్ మిల్క్’ కార్యక్రమం కింద.. ఎన్ఎఫ్ఎన్ ద్వారా 7.10 లక్షల లీటర్ల పాలను పంపిణీ చేశారు. ఇది 35.4 లక్షల పిల్లలు ఒక రోజులో వినియోగించే పాలతో సమానం. 11 రాష్ట్రాల్లోని 257 పాఠశాలల్లో దాదాపు 41,700 మంది పిల్లలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఈ ప్రశ్నకు వారి వద్ద సమాచారం లేదని పేర్కొన్నది. అయితే, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి ప్రసంగానికి అనుగుణంగా 2021-22 నుంచి గోధుమ ఆధారిత పోషకాహార కార్యక్రమం (డబ్ల్యూబీఎన్పీ), కౌమార బాలికల పథకం (ఎస్ఏజీ) కింద సాధారణ బియ్యానికి బదులు బలవర్ధకమైన పోషకాలను జోడించిన బియ్యాన్ని అందిస్తున్నట్టు వారు తెలిపారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 వంటి సూక్ష్మపోషకాల లోపం వల్ల స్త్రీలు, పిల్లలలో తలెత్తే పోషకాహార లోపం, రక్తహీనతను ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది.
ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ విషయానికొస్తే... దేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రధాన పథకాలను ఆ శాఖ అమలు చేస్తోంది. వాటిలో 2 కేంద్ర ప్రభుత్వ పథకాలు - ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై), ఆహార శుద్ధి పరిశ్రమ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐఎస్ఎఫ్‌పీఐ). మరొకటి కేంద్ర ప్రాయోజిత పథకం- ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల అధికారికీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం. వ్యవసాయ క్షేత్రం నుంచి రిటైల్ దుకాణం వరకు సరఫరా వ్యవస్థ సమర్థ నిర్వహణ, రైతులకు మెరుగైన రాబడిని అందించడంలో సహాయపడడం, ఉపాధి అవకాశాల కల్పన, వృథాను తగ్గించడం, ప్రాసెసింగ్ స్థాయిని పెంచడం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఎగుమతిని పెంచడం ద్వారా ఆధునిక ఆహార శుద్ధి మౌలిక సదుపాయాలను పెంచడం ఈ పథకాల ప్రధాన లక్ష్యాలు. ఈ మూడు పథకాలను డిమాండు ఆధారంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఫుడ్ ప్రాసెసర్లు, తయారీదారులు తమ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు/సాంకేతికతలను సృష్టించుకునేందుకు ఆర్థిక సాయాన్ని పొందేలా చేయూతనివ్వడం కూడా ఈ పథకాల ప్రధానోద్దేశం.
ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రవనీత్ సింగ్ ఈ రోజు లోక్‌సభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2159600)
Visitor Counter : 8