ప్రధాన మంత్రి కార్యాలయం
ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహం - ప్రజలు, ఆర్థికం, ఆవిష్కరణల్లో పెట్టుబడులు అనే అంశంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని ప్రసంగం
ఈ ఏడాది బడ్జెట్ బలమైన శ్రామిక శక్తికి, ఆర్థికాభివృద్ధికి బాటను ఏర్పాటు చేసింది: పీఎం
పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు ఇచ్చే ప్రాధాన్యాన్నే ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలకు ఇస్తున్నాం: పీఎం
మూడు ప్రధానాంశాలపై ఆధారపడి ప్రజాసంక్షేమంలో పెట్టుబడి - విద్య, నైపుణ్యం, ఆరోగ్యసేవలు: పీఎం
అనేక దశాబ్దాల తర్వాత భారత్‌లో విద్యావ్యవస్థ భారీగా సంస్కరణల మార్గంలో ప్రయాణించడం మనం చూస్తున్నాం: పీఎం
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ టెలిమెడిసిన్ సౌకర్యాలను విస్తరించాం: పీఎం
డే-కేర్ క్యాన్సర్ కేంద్రాలు, డిజిటల్ ఆరోగ్యసేవల మౌలిక సదుపాయాల ద్వారా సమాజంలో చివరి అంచున ఉన్నవారికి సైతం నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని మేం భావిస్తున్నాం: పీఎం
దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ బడ్జెట్లో అనేక నిర్ణయాలు తీసుకున్నాం: పీఎం
పర్యాటకంపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల అభివృద్ధి: పీఎం
ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల హోదాను ఇవ్వడం ద్వారా పర్యాటకాన్ని, స్థానికంగా ఉపాధిని పెంపొందించవచ్చు: పీఎం
ఏఐ సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏర్పాటు
Posted On:
05 MAR 2025 2:59PM by PIB Hyderabad
ఉపాధి కల్పన అంశంపై జరిగిన బడ్జెట్ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వెబినార్ ప్రధానాంశమైన ‘‘ప్రజలు, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల్లో పెట్టుబడులు’’ ప్రాముఖ్యం గురించి ఆయన వివరించారు. ఇది వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకొనే మార్గాన్ని నిర్వచిస్తుందని అన్నారు. ఈ ఇతివృత్తాన్ని ఈ ఏడాది బడ్జెట్ ప్రతిబింబిస్తోందని, దేశ భవిష్యత్తుకు ప్రణాళికలా పనిచేస్తుందని అన్నారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థికం, ఆవిష్కరణల్లో పెట్టుబడులకు సమప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. సామర్థ్య నిర్మాణం, ప్రతిభను ప్రోత్సహించడం దేశ ప్రగతికి పునాదుల లాంటివన్న ప్రధాని మోదీ, తదుపరి దశ అభివృద్ధికి ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పెట్టుబడిదారులను కోరారు. దేశ ఆర్థిక విజయానికి ఇది చాలా అవసరమని, ప్రతి సంస్థ విజయానికి ఆధారమని అన్నారు.
‘‘ప్రజా సంక్షేమంపై పెట్టుబడి పెట్టడం అనే అంశం మూడు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంది: అవి విద్య, నైపుణ్యాలు, ఆరోగ్య సేవలు’’ అని శ్రీ మోదీ అన్నారు. అనేక దశాబ్దాల తర్వాత భారతీయ విద్యావ్యవస్థ గణనీయమైన సంస్కరణలకు నోచుకుంటుందని తెలిపారు. జాతీయ విద్యావిధానం, ఐఐటీల విస్తరణ, విద్యావ్యవస్థలో సాంకేతికతను ఏకీకృతం చేయడం, ఏఐ సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం తదితర కీలక కార్యక్రమాల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. పాఠ్య పుస్తకాలను డిజిటలైజ్ చేయడం, 22 భాషల్లో పాఠ్యాంశాలను అందుబాటులో ఉంచేందుకు చేపడుతున్న చర్యల గురించి ప్రధానమంతి వివరిస్తూ.. ‘‘యుద్ధ ప్రాతిపదికన చేపడుతన్న ఈ ప్రయత్నాలు 21వ శతాబ్దపు అవసరాలు, ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ విద్యావ్యవస్థను మారుస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు.
2014 నుంచి మూడు కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం అందించిందన్న ప్రధాని, 1,000 ఐటీఐలను మెరుగుపరిచామని, 5 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను సన్నద్ధం చేయాలని ఆయన అన్నారు. అంతర్జాతీయ నిపుణుల సాయంతో, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా యువతను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పరిశ్రమలు, విద్యాసంస్థల పాత్రను శ్రీ మోదీ వివరించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ వేగాన్ని అందుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి, ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి అవసరమైన అవకాశాలను యువతకు కల్పించాలని అన్నారు. యువతకు కొత్త అవకాశాలు, ప్రయోగాత్మక నైపుణ్యాలు అందించేందుకు ప్రారంభించిన పీఎం- ఇంటర్న్షిప్ పథకం గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి స్థాయిలోనూ పరిశ్రమలు భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు.
వైద్య రంగం గురించి ప్రస్తావిస్తూ, ఈ బడ్జెట్లో కొత్తగా 10,000 మెడికల్ సీట్లు జోడించినట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 75,000 సీట్లను అదనంగా పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపడుతున్న టెలిమెడిసిన్ సేవల విస్తరణ గురించి వివరించారు. సమాజంలోని చివరి వ్యక్తికి సైతం నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేలా డే కేర్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు, డిజిటల్ ఆరోగ్య సేవల మౌలిక సదుపాయాల విస్తరణ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ప్రజల జీవితాలపై గుణాత్మక ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు. ఈ ప్రయత్నాలు యువతకు లెక్కలేనన్ని అవకాశాలు కల్పిస్తాయన్న ప్రధాని, బడ్జెట్లో ప్రకటించిన కార్యక్రమాల ప్రయోజనాలు ఎక్కువ మంది ప్రజలకు చేరుకొనేలా వాటిని వేగంగా అమలు చేయాలని అధికారులను కోరారు.
గత దశాబ్దంలో భవిష్యత్ లక్ష్యాలకు తగినట్టుగా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు వచ్చాయని ప్రధాని అన్నారు. 2047 నాటికి భారతదేశ పట్టణ జనాభా సుమారు 90 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. పరిపాలన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సుస్థిరతపై దృష్టి సారించడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. "స్థిరమైన పట్టణాభివృద్ధి, డిజిటల్ ఏకీకృతం, స్థిరమైన వాతావరణ ప్రణాళికల అంశంలో భారతీయ నగరాలు గుర్తింపు పొందుతాయి" అని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని ఆయన ప్రైవేటు రంగాన్ని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాలను కోరారు. అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్ తదితర కార్యక్రమాల్లో సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులపై మాట్లాడుతూ, పర్యాటక రంగ సామర్థ్యంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీ మోదీ అన్నారు. దేశ జీడీపీలో 10% వరకు సమకూర్చగల సమర్థత పర్యాటక రంగానికి ఉందని, ఈ రంగం కోట్లాదిగా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించగలదని ప్రముఖంగా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో తీసుకున్న అనేక చర్యలను ఆయన ప్రస్తావించారు. పర్యాటక రంగంపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా 50 ప్రదేశాలను అభివృద్ధి చేయబోతున్నామన్న ప్రధానమంత్రి.. మౌలిక సదుపాయాల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో హోటళ్లను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులకు సౌలభ్యం పెరగడంతోపాటు అది స్థానికంగా ఉపాధికి ఊతమిస్తుందన్నారు. వసతి గృహ సదుపాయాల (హోమ్ స్టే) అభివృద్ధికి చేయూతనిచ్చేలా ముద్ర యోజనను విస్తరించడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘హీల్ ఇన్ ఇండియా’, ‘ల్యాండ్ ఆఫ్ బుద్ధ’ వంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకుంటాయన్నారు. “అంతర్జాతీయ పర్యాటక, ఆరోగ్య నిలయంగా భారత్ ను నిలిపేందుకు కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
హోటళ్లు, రవాణా పరిశ్రమలకు మాత్రమే కాకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అన్ని ఇతర రంగాలకూ ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా పెట్టుబడులు పెట్టాలని ఆ రంగ భాగస్వాములను ఆయన కోరారు. యోగా, ఆరోగ్య రంగాల్లో పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్యా పర్యాటకంలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉందని తెలిపారు. ఈ దిశగా వివరణాత్మకమైన చర్చలు జరగాల్సి ఉందన్న ఆయన.. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి బలమైన ప్రణాళికను రూపొందించాలని పిలుపునిచ్చారు.
“ఆవిష్కరణల్లో పెట్టుబడులే దేశ భవితను నిర్దేశిస్తాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు లక్షల కోట్ల రూపాయలను సమకూర్చగల సామర్థ్యం కృత్రిమ మేధకు ఉన్నదన్న ఆయన.. ఈ దిశలో వేగవంతమైన పురోగతి అత్యావశ్యకమని పునరుద్ఘాటించారు. కృత్రిమ మేధ ఆధారిత విద్య, పరిశోధన కోసం బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జాతీయ విస్తృత భాషా నమూనాను నెలకొల్పడం ద్వారా భారత్ లో కృత్రిమ మేధ సామర్థ్యాలను మెరుగుపరిచే ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. ఈ రంగంలో ప్రపంచంతో పోటీపడి అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో నిలవాలని ప్రైవేటు రంగాన్ని కోరారు. “అందుబాటు వ్యయంలో ఏఐ సాధనాలను అందించగల విశ్వసనీయ, సురక్షితమైన, ప్రజాస్వామిక దేశం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’’ అని ఆయన అన్నారు. ఈ రంగంలో నేడు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తాయని స్పష్టం చేశారు.
“ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా భారత్ నిలిచింది’’ అని ప్రధానమంత్రి తెలిపారు. అంకుర సంస్థలను ప్రోత్సహించడం కోసం ఈ బడ్జెట్లో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమివ్వడం కోసం రూ. లక్ష కోట్ల ప్రత్యేక నిధిని (కార్పస్ ఫండ్) ఆమోదించడాన్ని ప్రస్తావించారు. ‘సాంకేతికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా వివిధ నిధుల నుంచి కేటాయించిన మొత్తం (డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా అది పలు అధునాతన రంగాల్లో పెట్టుబడులను పెంచుతుందన్నారు. పరిశోధనలను ప్రోత్సహించి, ప్రతిభావంతులైన యువతకు అవకాశాలను అందించేలా.. ఐఐటీలు, ఐఐఎస్సీలలో 10,000 ఫెలోషిప్‌లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో నేషనల్ జియో-స్పేషియల్ మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా అన్ని స్థాయిల్లోనూ సమష్టి కృషి అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
సుసంపన్నమైన భారతీయ తాళపత్ర వారసత్వాన్ని పరిరక్షించడంలో ‘జ్ఞాన భారతం’ మిషన్ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా కోటికి పైగా తాళపత్రాలను డిజిటలీకరించనున్నట్టు శ్రీ మోదీ ప్రకటించారు. తద్వారా జాతీయ డిజిటల్ బాండాగారం ఏర్పడుతుందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు, పరిశోధకులకు భారత చారిత్రక, సాంప్రదాయక విజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుందని ఆయన చెప్పారు. భారతీయ మొక్కల జన్యు వనరుల సంరక్షణ కోసం జాతీయ జన్యు బ్యాంకు ఏర్పాటును కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. భవిష్యత్తు తరాలకు జన్యు వనరులు, ఆహార భద్రత పట్ల భరోసా కల్పించడం దీని లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలను మరింత విస్తరించాలని కోరిన ఆయన.. వివిధ సంస్థలు, విభిన్న రంగాలు ఇందులో క్రియాశీలకంగా భాగం వహించాలని పిలుపునిచ్చారు.
గత నెలలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ చేసిన అద్భుతమైన విశ్లేషణలను ప్రస్తావిస్తూ.. 2015 - 2025 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 66% వృద్ధిని నమోదు చేసి, 3.8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అధిగమించి ఈ వృద్ధి నమోదైందన్నారు. భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే రోజు మరెంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ విస్తరణ కొనసాగాలంటే, సరైన దిశలో సరైన పెట్టుబడులు అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రకటనలను సాకారం చేయడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలన్నింటి సహకారం అత్యంత కీలకమన్నారు. సమన్వయం లేకుండా అడ్డదిడ్డంగా పనిచేసే సంప్రదాయం తొలగిపోయిందని చెప్పారు. ‘జన భాగిదారీ’ నమూనాను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. పథకాలు, కార్యక్రమాల మెరుగైన అమలు కోసం భాగస్వాములతో బడ్జెట్ పూర్వ సంప్రదింపులు, బడ్జెట్ అనంతర చర్చలు రెండింటినీ ప్రభుత్వం ఇప్పుడు నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వెబినార్ లో జరిగిన ఫలవంతమైన చర్చలు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విశేష పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
నేపథ్యం
ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధానమంత్రి సంకల్పానికి అనుగుణంగా ఉద్యోగ కల్పనలో వృద్ధిని ప్రోత్సహించడానికి, మరింత ఎక్కువగా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ వెబినార్ ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యావేత్తలు, పౌరుల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. విప్లవాత్మకమైన మార్పులనుద్దేశించిన బడ్జెట్ ప్రకటనల నుంచి సమర్థవంతమైన ఫలితాలను సాధించడానికి దోహదపడేలా చర్చలను వెబినార్ ప్రోత్సహిస్తుంది. ప్రజలను సాధికారులను చేయడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను పెంపొందించడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సుస్థిర, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయడంతోపాటు సాంకేతికత, ఇతర రంగాలకు నేతృత్వం వహించేలా.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా నిపుణులైన, సమర్థులైన శ్రామిక శక్తి కృషి చేసేలా స్ఫూర్తినివ్వడం ఈ చర్చల లక్ష్యం.
(Release ID: 2159187)
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada