సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో 28వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు (ఎన్‌సీఈజీ)
· ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వాములందరి నమోదు కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ https://nceg.gov.in/ ప్రారంభం
Posted On:
20 AUG 2025 7:01PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 2025 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో 28వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు (ఎన్‌సీఈజీ) నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) పరిధిలోని పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. 28వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు-2025కు విశాఖపట్నం ఐఐఎం నాలెడ్జి పార్టనర్‌గా ఉంటుంది.
రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ‘‘వికసిత భారత్: ప్రభుత్వ సేవలు, డిజిటల్ దిశగా పరివర్తన’’ అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరు సర్వసభ్య (ప్లీనరీ) సదస్సులు, ఆరు ప్రత్యేక (బ్రేకవుట్) సదస్సులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఇ-గవర్నెన్స్‌లో వినూత్న పద్ధతులు, ఆధునిక ధోరణులపై చర్చించడం కోసం సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఆలోచనాపరులు, విద్యావేత్తలు, ఈ రంగంలో నిపుణులు, అవార్డు గ్రహీతలు అందరినీ ఈ సదస్సు ఒక్కచోట చేరుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, రాష్ట్ర సమాచార సాంకేతికత, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎన్. లోకేశ్ కీలక ప్రసంగాలు చేస్తారు.
సదస్సు సందర్భంగా.. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, శాస్త్ర సాంకేతికత శాఖ, భౌగోళిక విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి విభాగం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సెప్టెంబరు 22న జాతీయ ఇ-గవర్నెన్స్ పురస్కారాలు-2025ను అందిస్తారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, అంకుర సంస్థలు, ఇ-గవర్నెన్స్ రంగం, ఎగ్జిబిటర్లలో నుంచి పురస్కార గ్రహీతలు, ప్యానలిస్టులు, వక్తలు, కార్యక్రమంలో పాల్గొనేవారి నమోదు కోసం అధికారిక పోర్టల్ www.nceg.gov.inను డీఏఆర్‌పీజీ ప్రారంభించింది. తద్వారా కార్యక్రమంలో పాల్గొనడం సులభతరమవుతుంది.
సహకారాన్ని పెంపొందించడం, ఉత్తమ విధానాలను తెలియజేయడం, దేశంలో ప్రజా సేవల్లో డిజిటల్ నిర్వహణలో తాజా పరిణామాలపై చర్చించడం ఈ సమావేశం లక్ష్యం.
***
(Release ID: 2158718)