బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గనుల తవ్వకం విధుల్లో మహిళలు

Posted On: 18 AUG 2025 2:41PM by PIB Hyderabad

కోల్ ఇండియా (సీఐఎల్) మహిళల నిర్వహణలో తన తొలి ఔషధశాల సేవలను బిలాస్‌పూర్‌లో గల సౌత్ ఈస్ట్రన్  కోల్‌ఫీల్డ్‌స్ (ఎస్ఈసీఎల్)కు చెందిన వసంత్ విహార్ డిస్పెన్సరీలో గత నెల 14న ప్రారంభించింది. ఈ డిస్పెన్సరీలో పనిచేసే సిబ్బంది అంతా మహిళలే. వీరు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అన్ని సేవలను అందిస్తున్నారు.
 
పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలను కల్పించాలన్న మా కట్టుబాటును మరింత పక్కాగా అమలుచేయాలనే ఉద్దేశంతో మహిళల నాయకత్వంలో అనేక ముఖ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. దీని ద్వారా సంస్థాగత శ్రేష్ఠత్వానికి ఊతాన్నివ్వడంతో పాటు బొగ్గు రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక, ప్రణాళిక విభాగాలు తదితర విభిన్న రంగాల్లో నాయకత్వ అవకాశాలను కల్పించాలన్నదే మా నిబద్ధత.

1. సీఐఎల్‌కు చెందిన వివిధ అనుబంధ సంస్థల్లో మహిళల సారథ్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:

• ఎస్ఈసీఎల్‌కు చెందిన వసంత్ విహార్ ఔషధశాల. ఇది బిలాస్‌పూర్‌లో ఉంది.
• సీసీఎల్‌కు చెందిన రాజేంద్ర నగర్ ఔషధశాల. ఇది రాంచీలో ఉంది.
• బీసీసీఎల్‌కు చెందిన కోయ్‌లా నగర్ ఆసుపత్రి (ఉదయం పూట  మాత్రమే పనిచేస్తుంది). ఇది ధన్‌బాద్‌లో ఉంది.
• డబ్ల్యూసీఎల్‌కు చెందిన సద్భావన కాలనీ డిస్పెన్సరీ. ఇది నాగ‌పూర్‌లోని పాటన్‌సాంగీలో ఉంది.  
• ఎస్‌ఈసీఎల్‌కు చెందిన ‘కండీషన్ ఆధారిత పర్యవేక్షక ప్రయోగశాల’. ఇది గేవ్‌రా‌లోని సెంట్రల్ ఎక్స్‌కవేషన్ వర్క్‌షాపులో ఓ భాగం.
• ధన్‌బాద్‌లోని ఎల్ఈడీ, సౌర సామగ్రికి సంబంధించిన కేంద్రీకృత సాంకేతిక కేంద్రం.
• ఎన్‌సీఎల్‌కు చెందిన కాస్ట్, బడ్జెట్ సెల్. ఇది సింగ్‌రౌలీలోని ఎన్‌సీఎల్ ప్రధాన కేంద్రంలో ఓ భాగం.

2. మహిళల నాయకత్వంలో ‘‘జ్యోతి - రైజింగ్ టుగెదర్, లీడింగ్ ది వే’’ (జ్యోతి.. కలిసి ఎదుగుదాం, దారిని చూపిద్దాం) పేరిట ఒక  ప్రధాన కార్యక్రమాన్ని కోల్ ఇండియా తన అత్యున్నత శిక్షణ సంస్థ ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్‌మెంట్’ (ఐఐసీఎం) ఆధ్వర్యంలో ప్రారంభించింది. సీఐఎల్‌లో ఉన్నత బాధ్యతలను నిర్వహించడానికి మహిళా అధికారులను సన్నద్ధపరచడానికి ఉద్దేశించిన అయిదు నెలల కార్యక్రమమిది. దీనిలో భాగంగా కమ్యూనికేషన్, నిర్ణయాలు తీసుకోవడం, మానసిక జ్ఞానార్జన, వ్యవహార నైపుణ్య సాధన, వ్యక్తిగా ఎదగడంతో పాటు నాయకత్వ బాధ్యతను స్వీకరించడానికి తయారుగా ఉండడం వంటి విషయాల్లో అభ్యర్థినుల సామర్థ్యాలను పెంచుతారు. ఈ కార్యక్రమం అత్యుత్తమ పద్ధతులపై అవగాహన కలిగించడం, నెట్‌వర్కింగ్ అవకాశాలు, మార్గదర్శనం, సంస్థాగత సహాయం వంటివి కూడా సమకూర్చి బొగ్గు రంగంలో సమర్థులైన మహిళా నేతలను తయారు చేస్తుంది.
 
3. కోల్ ఇండియాలో ఉద్యోగి మరణించినట్లయితే, ఆ ఉద్యోగిపై ఆధారపడ్డ ఆడపిల్లలకు.. వారికి పెళ్లి అయినా, కాకపోయినా.. ఉద్యోగం ఇచ్చే అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ అవకాశం ఇంతకు ముందు లేదు.
   
4. సీఐఎల్ సంస్థాగత వ్యవహారాలలో మహిళల భాగస్వామ్యం ఇదివరకటి కంటే పెరిగింది. దీనిని ప్రోత్సహించడానికి సంస్థ కట్టుబడి ఉంది. పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు, మహిళలను కలుపుకొని ముందుకు పోయేందుకు అన్ని కమిటీలలో ఒక మహిళా ప్రతినిధిని తప్పక చేర్చుకోవాలనే నియమాన్ని ఏర్పరిచారు.
 
5. ఎల్ఈడీ ఆధారిత, సౌర శక్తి ఆధారిత పరికరాల మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా మహిళా సాంకేతిక నిపుణులే నిర్వహించే విధంగా మొట్టమొదటి కేంద్రీకృత సాంకేతిక కేంద్రాన్ని భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) ప్రారంభించింది. ధన్‌బాద్‌లోని కోయ్‌లా నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇంతవరకు పురుషులదే పైచేయిగా ఉన్న కీలక సాంకేతిక కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను మహిళలకు అప్పగించిన మార్గదర్శక నిర్ణయానికి నిదర్శనంగా నిలిచింది.  

6. కోల్ ఇండియాలో, ఆ సంస్థ అనుబంధ  సంస్థలలో పురుషులు, మహిళల మధ్య సమానత్వం, సంస్థాగత శ్రేష్ఠత్వాలను ప్రోత్సహించాలనే నిబద్ధతను మరింత పెంచడానికి మహిళా ఉద్యోగులను ‘మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ’ని సంపాదించుకొనేలా భూగర్భంలో విధుల్ని నిర్వహించడంలో శిక్షణ తీసుకోవాడానికి పంపిస్తున్నారు.

7. రక్షణ కార్యకలాపాలలో పాలుపంచుకొనే విధంగా కూడా మహిళలను ప్రోత్సహిస్తున్నారు. రెస్క్యూ, రికవరీ పనులలోనూ వారికి శిక్షణనిస్తున్నారు. ఇంతవరకు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌స్ (డబ్ల్యూసీఎల్)లో 19 మంది మహిళా ఉద్యోగులతో పాటు మహానది కోల్‌ఫీల్డ్‌స్ (ఎంసీఎల్)లో 9 మందికి రెస్క్యూ, రికవరీ పనులలో శిక్షణనిచ్చారు.
 
8. మహిళా ఉద్యోగులను కాపాడడానికి అంతర్గత ఫిర్యాదుల సంఘాలను (ఐసీసీస్) సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్టు - 2013 (పీఓఎస్‌హెచ్ యాక్టు)లో భాగంగా ఏర్పాటు చేశారు. పని చేసే చోటులో మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని అడ్డుకోవడానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ సంఘాలు పనిచేస్తున్నాయి.
 
దీనికి అదనంగా, ఎన్ఎల్‌సీ ఇండియా (ఎన్ఎల్‌సీఐఎల్) కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకొంటోంది. మహిళలను గనుల్లోనూ పని చేయడానికి నియమించింది. ఈ సంస్థలో 190 మంది గని తవ్వకం పనుల్లో చేరారు. 48 మంది అధికారి పదవుల్లో ఉన్నారు. ఈ సంస్థ తన చరిత్రలో మొట్టమొదటి సారి బొగ్గు తవ్వక కార్యకలాపాల్లో మహిళలకు స్థానం కల్పించింది. ఇది పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలను కల్పించాలన్న సంస్థ నిబద్ధతలో ఒక ముఖ్య ఘట్టానికి సూచికగా నిలిచింది. తొమ్మిది కీలక పదవుల్లో.. సర్వేయర్లు, మైనింగ్ సర్దార్లతో పాటు ఓవర్‌మెన్ వంటి ముఖ్య పదవుల్లో కూడా.. మహిళలను నియమించారు.  
   
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి రాజ్యసభలో ఈ రోజు ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

 

***


(Release ID: 2157605)
Read this release in: English , Urdu , Hindi