రక్షణ మంత్రిత్వ శాఖ
‘ఆపరేషన్ సిందూర్’: ప్రపంచవ్యాప్త అసమతుల యుద్ధ రీతికి భిన్నమైన సమతుల సైనిక ప్రతిస్పందన
· భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సైనికులకు సందేశం’లో రక్షణశాఖ మంత్రి వ్యాఖ్య
· “సరికొత్త యుద్ధకళకు.. నవ్య దృక్పథానికి.. సాంకేతిక పురోగమనానికి... స్వావలంబనకు ఈ ఆపరేషన్ ఒక నిదర్శనం”
· “సాంప్రదాయక హద్దులకు ఇకపై భారత్ కట్టుబడదు... ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన నిఘా సమాచారం ప్రాతిపదికన అత్యాధునిక వ్యూహాలను రచిస్తుంది”
· “మన సహనశీలత అసమానం... కానీ, మన భద్రతకు.. గౌరవానికి భంగం కలిగించే ప్రతి సవాలును సమైక్యంగా.. సాహసంతో తిప్పికొడతాం”
· “ఉగ్రవాద మూలాలు ఎంత లోతున ఉన్నా కూకటివేళ్లతో పెకలించడం తథ్యం”
Posted On:
14 AUG 2025 5:33PM by PIB Hyderabad
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్- ప్రపంచవ్యాప్త అసమతుల యుద్ధరీతికి భిన్నమైన సమతుల సైనిక ప్రతిస్పందనగా గుర్తింపు పొందింది” అని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆకాశవాణి ద్వారా ‘సైనికులకు సందేశం’ ఇస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సమయంలో దేశం చేపట్టిన చర్యలు కచ్చితత్వంతో కూడిన, విజయవంతమైన సైనిక వ్యూహానికి ఉజ్వల ఉదాహరణగా అభివర్ణించారు. సరికొత్త యుద్ధకళకు, నవ్య దృక్పథానికి, సాంకేతిక పురోగమనానికి, స్వావలంబనకు ఇదొక నిదర్శనమని చెప్పారు.
డ్రోన్ సమరం, అంచెలవారీ రక్షణ ఛత్రం, ఎలక్ట్రానిక్ యుద్ధరీతి, నెట్‌వర్క్-కేంద్రక ఆపరేషన్ వంటి అత్యాధునిక ఉపకరణాలను మన దేశం విజయవంతంగా వినియోగించిందని తెలిపారు. భారత్ ఇకపై విదేశీ సాంకేతికత మీద ఆధారపడబోదని ఆపరేషన్ సిందూర్ నిరూపించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటనను ఉటంకిస్తూ- మన సైనికుల శౌర్యపరాక్రమాలకు ఆపరేషన్ సిందూర్ ఒక నిదర్శనం మాత్రమే కాదన్నారు. రక్షణ రంగంలో వేగవంతమైన స్వావలంబనకు, స్వదేశీ సాంకేతికతపై ప్రభుత్వ నిబద్ధతకు ఇదొక ప్రతీకగా పేర్కొన్నారని గుర్తుచేశారు. భారత సైనిక స్వావలంబనను ఈ ఆపరేషన్ సమున్నత స్థాయికి చేర్చిందని ఆయన చెప్పారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా సమతుల వ్యూహం ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు సహా 9 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు కచ్చితమైన క్షిపణి దాడులతో నేలమట్టం అయ్యాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడిలో పాకిస్థాన్‌లోని పౌర ప్రాంతాలు, సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకోలేదనే వాస్తవాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే మన సాయుధ దళాలు నియంత్రణ రేఖను దాటలేదని, అంతర్జాతీయ సరిహద్దును ఉల్లంఘించలేదని, అయినప్పటికీ శత్రు భూభాగంలో నక్కిన ఉగ్రవాదులను, వారి మౌలిక సదుపాయాలను చావుదెబ్బ కొట్టాయని ఆయన అన్నారు.
ఇది సరికొత్త యుద్ధకళకు సంకేతమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. భారత్ ఇకపై సంప్రదాయ హద్దులకు కట్టుబడదని, ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన నిఘా సమాచారం ప్రాతిపదికన వివేచనతో సైనిక వ్యూహాలను రచిస్తున్నదని పేర్కొన్నారు. “మన సహనశీలత అసమానమని దేశం ఇప్పటికే చాటింది. కానీ, మన భద్రతకు, గౌరవానికి భంగం కలిగించే ప్రతి సవాలును సమైక్యంగా, సాహసంతో తిప్పికొడతాం” అని శ్రీ రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. “ఉగ్రవాదంపై భారత్ సరికొత్త విధానంలో ఆపరేషన్ సిందూర్ ఒక భాగం. ఉగ్రవాద మూలాలు ఎంత లోతుగా పాదుకుని ఉన్నా, కూకటివేళ్లతో పెకలించడం తథ్యమని విస్పష్ట సందేశమిచ్చాం. ఉగ్రవాద సమూల నిర్మూలన లక్ష్యాన్ని సాధించేదాకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది” అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22నాటి అమాయక పౌరుల ఊచకోతను గుర్తుచేస్తూ దాన్ని ఉగ్రవాదుల పిరికిదాడిగా, అమానుష చర్యగా రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ దారుణంతో ప్రతి భారతీయుడి కళ్లు చెమర్చాయి... ప్రతి ఒక్కరి గుండె మండింది. “ఇది ఓ యాదృచ్ఛిక దాడి కాదు... మన ఐక్యత, ధైర్యం, సమగ్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీసే కుట్ర. అందుకే, ఆపరేషన్ సింధూర్ సహా ఆపరేషన్ మహాదేవ్ ద్వారా దానికి దీటైన జవాబిచ్చాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
పహల్గామ్‌లో అనాగరిక ఉగ్రదాడితోపాటు లోగడ పార్లమెంటు సౌధంపైనా, ముంబైలో తాజ్ హోటల్ మీద, అమర్‌నాథ్ యాత్రికులపైన ఉగ్రదాడులన్నిటికీ ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గత నెలలో జమ్మూకాశ్మీర్‌లోని దాచిగామ్‌లో ‘ఆపరేషన్ మహాదేవ్’ కింద పహల్గామ్ దాడి ముష్కరులైన లష్కరే తాయిబా ‘ఎ’ కేటగిరీ కమాండర్లయిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిందని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్‌లో మన సైనిక, సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు జమ్మూకాశ్మీర్ పోలీసుల కృషిని, ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. గతంలో పఠాన్‌కోట్, పుల్వామా ఉగ్రదాడులకు స్పందనగా మెరుపు దాడి, వైమానిక దాడులతో మన సైన్యం గుణపాఠం నేర్పిందని కూడా ఆయన గుర్తుచేశారు.
బలమైన ఆర్థిక వ్యవస్థకు స్వావలంబనే తొలి మెట్టుగా అభివర్ణిస్తూ- గడచిన దశాబ్ద కాలంలో రక్షణరంగం రూపాంతరీకరణను రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు నేడు మనం 65 శాతం ఆయుధాలు, యుద్ధ పరికరాలను దేశీయంగా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ఒకనాడు 65 నుంచి 70 శాతందాకా రక్షణ పరికరాలు దిగుమతి చేసుకునేవారమని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు దిగుమతులు 35 శాతానికి తగ్గిపోయాయని ఆయన వివరించారు. రక్షణ రంగ బడ్జెట్ నిరంతరం పెరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ... 2013-14లో ఇది రూ.2.53 లక్షల కోట్లు కాగా, 2025-26లో 6.81 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.
దేశంలో రక్షణ రంగ వార్షిక ఉత్పాదన 2014-15లో రూ.46,000 కోట్లు కాగా, నేడు రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్లకు చేరిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అదేవిధంగా దాదాపు రూ.1,900 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు రూ.23,622 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఈ నేపథ్యంలో “రక్షణ ఉత్పాదనను 2029కల్లా రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని, ఎగుమతులను రూ.50,000 కోట్లకు పెంచాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాం” అని ఆయన వివరించారు.
సాయుధ దళాల ఆధునికీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా “ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్, రాఫెల్-మెరైన్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, సి-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ప్రచండ్ హెలికాప్టర్లు, ఉన్నతీకరించిన ఎస్‌యు-30 వంటి వేదికలు వంటివాటితో దేశ రక్షణ సన్నద్ధత ఇనుమడిస్తుందని ఆయన చెప్పారు. దేశ భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, భవిష్యత్తులో రక్షణపరంగా సంపూర్ణ స్వావలంబన సాధించగలమని విశ్వాసం వెలిబుచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వ తిరుగులేని సంకల్పమని స్పష్టం చేశారు. దేశ ప్రగతిలో, స్వయంసమృద్ధ భారత్ సాకారంలో దేశీయ రక్షణ పరిశ్రమ కీలక పాత్ర పోషించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
యుద్ధ సమయాల్లో దేశాన్ని రక్షించడంతోపాటు ప్రకృతి విపత్తుల వేళ సాహసం, క్రమశిక్షణ, సన్నద్ధతతో రక్షణ-సహాయ కార్యకలాపాల్లో ముందంజ వేయడంపై సాయుధ దళాలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు ప్రశంసించారు. “అసోంలో వరదలు, తీరప్రాంతాల్లో తుఫానులు, ఉత్తరకాశీలో ఇటీవలి దుర్ఘటన వంటి ఎలాంటి వైపరీత్యాలలో అయినా, ప్రజల భద్రత తమకెంత ముఖ్యమో మన దళాలు పలుమార్లు స్పష్టం చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ ‘ఆపరేషన్ సింధు’ పేరిట అత్యంత విపత్కర పరిస్థితుల నుంచి వందలాది ప్రవాస భారతీయులను మాతృభూమికి చేర్చారు. వారి సాహసం, సత్వర నిర్ణయాత్మకతకు ఇది నిదర్శనం. ఈ ఆపరేషన్ మన సైనిక సామర్థ్యం, సంసిద్ధతను ప్రతిబింబించింది. అంతేకాదు... ప్రపంచ విషయంలో భారత్ బాధ్యతాయుత స్పందన, తన పౌరుల క్షేమంపై తిరుగులేని నిబద్ధతకూ ఇది ఉదాహరణ” అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సాయుధ దళాలకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత కఠిన భౌగోళిక-వాతావరణ పరిస్థితుల నడుమ రేయింబవళ్లు సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ఆయన అభివందనం చేశారు. అలాగే దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణలో అమరులైన సాహస సైనికులకు, మాతృభూమి సేవ దిశగా వారిని ప్రోత్సహించడంలో తమవంతు పాత్ర పోషించడంపై వారి కుటుంబాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “భారత్ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందింది. దీనికి సమర యోధులైన జాతిపిత మహాత్మాగాంధీ, షహీద్ భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవకారులు సహా అసంఖ్యాక దేశభక్తుల మొక్కవోని ధైర్యం, త్యాగాలే పునాదులు. అనేకమంది అమేయ త్యాగనిరతితో సిద్ధించిన ఈ స్వాతంత్ర్యాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకోవడంలో మీరంతా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకుగాను దేశంలోని యావత్ ప్రజానీకం సదా మీకు రుణపడి ఉంటుంది” అని ఆయన సైనికులలో ఉత్తేజం రగిల్చారు.
దేశ భద్రత పరిరక్షణకు తమ జీవితాలను అంకితం చేసిన మాజీ సైనికులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్’ పథకం సహా వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ- వారి శ్రేయస్సుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. “పెన్షన్, ఆరోగ్యం లేదా పునరావాసం వంటి ఏ అంశంలోనైనా మన మాజీ సైనికులకు ఎటువంటి సమస్యలు రాకుండా నిరంతరం కృషి చేస్తాం” అని ప్రకటించారు.
సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ- ఏడాది కాలంలో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) ద్వారా చేపట్టిన 125 ప్రాజెక్టులు కార్యాచరణ సంసిద్ధతను పెంచాయని మంత్రి చెప్పారు. అలాగే మారుమూల ప్రాంతాల అనుసంధానం మెరుగుతోపాటు సర్వతోముఖాభివృద్ధికి అవి తోడ్పడ్డాయని పేర్కొన్నారు. “తుపాకులు, ట్యాంకులతో మాత్రమే కాకుండా, నేడు రహదారులు-సొరంగాల ద్వారా కూడా సరిహద్దు భద్రతకు భరోసా లభించింది. ఈ మేరకు ‘బీఆర్‌వో’ నిర్మిస్తున్న కీలక ప్రాజెక్టులలో షిన్‌కున్ లా సొరంగం ఒకటి. ఇది లద్దాఖ్ పరిధిలో 15,800 అడుగుల ఎత్తున నిర్మితమవుతోంది. ఈ పనులు పూర్తయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తునగల సొరంగంగా రికార్డులకు ఎక్కుతుంది. దీనివల్ల సైనికుల కదలికలు సులభం కావడమేగాక లద్దాఖ్ ప్రాంత సామాజిక-ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయి” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
సాయుధ దళాలలో మహిళల పాత్ర పెరుగుతుండటాన్ని మంత్రి గుర్తుచేస్తూ- నారీశక్తి ముందంజ ఇకపై సామాజిక మార్పులకు మాత్రమే సూచిక కాదన్నారు. భూమి, నీరు, ఆకాశం... ఎల్లెడలా నాయకత్వం వహించడమే కాకుండా దేశ భవిష్యత్తుకు మహిళలు నవ్య దిశను నిర్దేశిస్తున్నారని చెప్పారు. “ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీఏ)లో తొలిసారి 17 మంది మహిళా కేడెట్లు ఉత్తీర్ణత సాధించారు. దేశానికి ఇదొక చరిత్రాత్మక క్షణం. అలాగే నావికా సాగర్ పరిక్రమ-II కింద నావికాదళంలోని ఇద్దరు సాహస మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ కె.దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూప 25,600 నాటికల్ మైళ్ల కఠినతర సముద్ర ప్రయాణంతో దేశం గర్వించేలా చేశారు. ఇది మన నావికాదళ సామర్థ్యానికి నిదర్శనం. మరోవైపు త్రివిధ దళాల నుంచి మొత్తం మహిళా సభ్యులున్న సెయిలింగ్ బృందం 1,800 నాటికల్ మైళ్ల అంతర్జాతీయ సముద్ర యానం తర్వాత సీషెల్స్ నుంచి స్వదేశానికి తిరిగి రావడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇది భారత సాయుధ దళాల మహిళలు చేపట్టిన తొలి అంతర్జాతీయ సముద్ర సాహస యాత్ర. మన నారీశక్తికి సవాళ్లను అధిగమించడం వెన్నతో పెట్టిన విద్య. దేశ రక్షణలో, భరతమాతను గౌరవించడంలో వారు సదా ముందు వరుసలో ఉంటారు” అని ఆయన ప్రశంసలు కురిపించారు.
అంకుర సంస్థల నుంచి వ్యూహాత్మక రంగాల దాకా దేశం ముందంజ వేయడంలో యువతరం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని రక్షణ మంత్రి అన్నారు. “డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా” వంటివి ఇకపై కేవలం పథకాలు కావు- అవన్నీ యువ భారత్ ఆకాంక్షలకు ప్రతీకలు” అని వ్యాఖ్యానించారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో భారత్ తన కోసమేగాక యావత్ ప్రపంచానికీ పరిష్కారాలను సమకూరుస్తున్నదని ఆయన సగర్వంగా ప్రకటించారు. చివరగా- నవ భారత్ స్వప్న సాకారం దిశగా పయనంలో ప్రజలంతా ప్రేక్షకులుగా మిగిలిపోరాదని, కర్తవ్య నిబద్ధతతో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
***
(Release ID: 2156729)