నీతి ఆయోగ్
దేశమంతటా ప్రాంతీయ భాషల్లో నవకల్పనను ప్రోత్సహించడానికి ‘ఆసక్తి ప్రకటన’పై అటల్ ఇన్నొవేషన్ మిషన్, భాషిణిల మధ్య అవగాహన
Posted On:
07 AUG 2025 5:46PM by PIB Hyderabad
భాషాపరమైన అడ్డంకులను తొలగించి నవకల్పన విషయంలో ముందుకు దూసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక ఆసక్తి ప్రకటన (స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్..ఎస్ఓఐ)పై నీతి ఆయోగ్‌లో భాగంగా ఉన్న అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం), ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆధీనంలో పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ)కి చెందిన ‘భాషిణి’ సంతకాలు చేశాయి. భారత్‌లో శరవేగంగా ఎదుగుతున్న నవకల్పన రంగంలోను, ఔత్సాహిక పారిశ్రామికత్వాలతో ముడిపడ్డ అనుబంధ విస్తారిత వ్యవస్థలోను స్థానిక భాషల్లో నవకల్పనతో పాటు అన్ని భాషలను కలుపుకొని ముందుకు పోవడాన్ని ప్రోత్సహించడం కూడా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం.
ఇరు పక్షాల సారథులు ఒక సమావేశంలో పాల్గొని ఎస్ఓఐకి తుదిరూపాన్నిచ్చారు. ఈ సమావేశంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)కు చెందిన మిషన్ డైరెక్టరు శ్రీ దీపక్ బాగ్లా, డిజిటల్ ఇండియా భాషిణి విభాగం ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అమితాబ్ నాగ్ సహా ఇతరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో.. ఏఐఎంకు చెందిన దేశవ్యాప్త నవకల్పన సంబంధిత కార్యక్రమాల్లో భాషా సాంకేతికతను జోడించడానికి అమలుచేయాల్సిన వివిధ సహకార ప్రధాన వ్యూహాలపై.. ప్రధానంగా చర్చించారు.
మొదటి దశలో, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్..డబ్ల్యూఐపీఓ) రూపొందించిన కంటెంటును భాషిణి సాయంతో వివిధ భారతీయ భాషల్లోకి అనువదించనున్నారు. ఈ పనిని.. ఏఐఎం, నీతి ఆయోగ్, డబ్ల్యూఐపీఓ.. ఈ మూడు సంస్థలూ ఒక ‘ఆసక్తి పత్రం’పై సంతకాలు చేసిన ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న సహకార ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేస్తారు. భాషిణి ప్లాట్‌ఫాంలను ఉపయోగించి భవిష్యత్తులో శిక్షణ ప్రధాన కంటెంటును గేమ్స్ రూపంలో సమకూర్చడానికి (గేమిఫికేషన్) ఏ మేరకు అవకాశాలు ఉండేదీ కూడా పరిశీలిస్తారు. ఏఐఎంతో ముడిపడ్డ అనుబంధ విస్తారిత వ్యవస్థలో అంకుర సంస్థలకు, ఇతర ఆసక్తిదారులకు పలు భాషల్లో ఉత్పాదనల రూపకల్పనకు ఊతాన్నివ్వడానికి దోహదం చేసే ఉపకరణాలే కాక, శాండ్‌బాక్స్ సంబంధిత ఏర్పాట్లను కూడా అందిస్తారు.
ఈ సహకారానికి బాటవేయడం ద్వారా భాషిణికి చెందిన భాషా ఉపకరణాలు, సాంకేతికతలను సద్వినియోగపరుచుకొంటూ క్షేత్ర స్థాయిలో నూతన ఆవిష్కర్తలకు సాయం చేయడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టాలని కూడా ఏఐఎం, భాషిణిలు భావిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో నైపుణ్య శిక్షణ, సామర్థ్యాలను పెంచే కార్యక్రమాలను నిర్వహించడానికి భాషిణికి చెందిన ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకొనేందుకు అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఇప్పుడున్న ఏఐఎం అనుబంధ విస్తారిత వ్యవస్థ అన్వేషిస్తుంది. ఏఐఎం అనుబంధ విస్తారిత వ్యవస్థలో ప్రస్తుతం అటల్ ఇన్‌క్యుబేషన్ సెంటర్లు (ఏఐసీలు) కమ్యూనిటీ ఇన్నొవేషన్ సెంటర్ల (ఏసీఐసీలు), కొత్తగా ప్రారంభించిన లాంగ్వేజ్ ఇన్‌క్లూజివ్ ప్రోగ్రాం ఫర్ ఇన్నొవేషన్ (ఎల్ఐపీఐ) కేంద్రాలు భాగంగా ఉన్నాయి.
అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)కు చెందిన మిషన్ డైరెక్టరు శ్రీ దీపక్ బాగ్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సహకారం సమ్మిళిత నవకల్పనను ప్రోత్సహించాలన్న మా విస్తృత లక్ష్యానికి ఊతాన్నిస్తుంది. భాషా ప్రధాన టెక్నాలజీలను ఏఐఎం నిర్వహించే కార్యక్రమాలలో సమన్వయపరిచి, భాషల పరంగా ఎదురవుతున్న అవరోధాల్ని అధిగమించి, దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కర్తలకు సౌలభ్యాన్ని, అవకాశాలను అందించే దిశగా ఒక ఆచరణాత్మక నిర్ణయం తీసుకొంటున్నాం’’ అన్నారు.
డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అమితాబ్ నాగ్ తన అభిప్రాయాలను తెలియజేస్తూ, ‘‘నవకల్పనకు భాష ఎప్పటికీ ఒక అడ్డంకిగా ఉండకూడదు. భారతీయ నూతన ఆవిష్కర్తలందరికి .. వారు ఏ భాష మాట్లాడే వారయినా కావొచ్చు.. డిజిటల్, ఔత్సాహిక పారిశ్రామికత్వ విప్లవంలో పూర్తి స్థాయిలో భాగం పంచుకోవడానికి అవసరమైన ఉపకరణాల్ని అందించి, సాధికారతను కల్పించాలి అనేదే అటల్ ఇన్నొవేషన్ మిషన్‌తో ఈ సహకారాన్ని ఏర్పరుచుకోవడంలో మా లక్ష్యం. కమ్యూనికేషన్ అంతరాల్ని భర్తీ చేయడంలోను, దేశం నలు మూలలా సమ్మిళిత అభివృద్ధికి కొత్త బాటలు వేయడంలోను భాషిణి అభివృద్ధిపరిచిన భాషా సాంకేతికతలు సాయపడతాయి’’ అన్నారు.
దేశంలో డిజిటల్ సాధికారతకు సంబంధించిన విస్తృత లక్ష్యాల్ని సాధించడానికి తోడ్పడటంలో పాటు, నవకల్పన ప్రధాన వనరులను ఇప్పటి కంటే సులభతరంగాను, సమ్మిళితత్వాన్ని కలిగి ఉండేవిగాను తీర్చిదిద్దాలన్న ఉమ్మడి నిబద్ధతకు కూడా ఈ భాగస్వామ్యం అద్దం పడుతోంది.
***
(Release ID: 2154158)