రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
Posted On:
07 AUG 2025 8:26PM by PIB Hyderabad
‘రోడ్డు ప్రయాణంలో ప్రమాదానికి గురైన వారికి నగదు రహిత చికిత్స పథకం-2025’ను ఈ ఏడాది మే 5వ తేదీ నాటి ఎస్.ఒ. 2015 (ఈ) తో అఖిల భారత స్థాయిలో నోటిఫై చేశారు. ఈ పథకం మార్గదర్శకాలను ఇదే ఏడాది జూన్ 4 న ఎస్.ఒ. 2489 (ఈ) లో భాగంగా నోటిఫై చేశారు. మోటారు వాహనాన్ని నడుపుతున్న కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదం బారిన పడ్డ ఏ వ్యక్తికైనా దేశమంతటా ఏ నిర్దేశించిన ఆసుపత్రిలోనైనా.. దుర్ఘటన తేదీ నాటి నుంచి గరిష్ఠంగా 7 రోజుల లోపల.. బాధితుల్లో ప్రతి ఒక్కరికి రూ.1.5 లక్షల వరకు చికిత్స చేయించుకునే హక్కును ఈ పథకం ద్వారా కల్పించారు.
ఈ పథకం ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎం-జేఏవై) పరిధిలోకి రాదు. అయినప్పటికీ ఇది ఒక చట్టబద్ధ పథకం. ఈ కారణంగా ఇది రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో న్యాయబద్ధమైన, నగదు చెల్లించనక్కరలేని ప్రమాదవేళ సంరక్షణ సంబంధిత సేవలను అందిస్తుంది. ఈ పథకం రిజిస్ట్రేషన్, తనిఖీ, క్లెయిము పరిష్కారం కోసం జాతీయ ఆరోగ్య ప్రాధికరణ సంస్థ (నేషనల్ హెల్త్ అథారిటీ)కి చెందిన ఐటీ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో, కాగితాలను సమర్పించనక్కరలేకుండా, సమర్థ సేవలను అందించడానికి వీలవుతుంది. ప్రస్తుత ఆసుపత్రుల నెట్‌వర్కును, సూచించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను ఉపయోగించుకొంటూ ఈ పథకం అత్యవసర పరిస్థితుల్లో సంరక్షణ సంబంధిత సేవల్ని నిరంతరాయంగా అందించడంతో పాటు పోర్టబులిటీకి, ఆర్థిక రక్షణకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది.
నియమాలను ఉల్లంఘించిన మోటారు వాహనానికి బీమా సదుపాయం ఉన్న కేసుల్లో, సాధారణ బీమా కంపెనీలందించే కంట్రిబ్యూషన్లతో సంయుక్త పద్ధతిలో ఈ పథకానికి ఆర్థికసహాయాన్ని అందిస్తారు. బీమా ఉన్న మోటారు వాహనాలు కాకుండా ఇతర మోటారు వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించిన కేసుల్లో అయితే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సహాయాన్ని అందిస్తుంది. బీమా సహిత కేసులు కాకుండా ఇతర కేసుల్ని దృష్టిలో పెట్టుకొని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.272 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ జైరాం గడ్కరీ లోక్‌సభకు రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2154050)