గనుల మంత్రిత్వ శాఖ
గనుల రంగంలో సంస్కరణలపై శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన మేధోమథన సమావేశం
Posted On:
07 AUG 2025 7:10PM by PIB Hyderabad
గనుల రంగంలో సంస్కరణలపై ఉన్నతస్థాయి మేధోమథన సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబేతో కలిసి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
దేశంలో గనుల రంగ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవసరమైన నియంత్రణ, నిర్మాణాత్మక కార్యాచరణ సంబంధిత సంస్కరణలపై పరిశ్రమ నాయకులు, వాటాదారులతో చర్చించడం ఈ సమావేశపు ఉద్దేశం. 2047 నాటికి వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ వంటి జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ, వేదాంత, అదానీ, హిందాల్కో సహా ప్రముఖ మైనింగ్, మెటల్ కంపెనీలకు చెందిన 45 మందికి పైగా సీనియర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖనిజ అన్వేషణ, వేలం ప్రక్రియలు, అనుమతులు, రవాణా, సుస్థిరమైన మైనింగ్ పద్ధతులకు సంబంధించిన ఆచరణాత్మక ఆలోచనలను వారు పంచుకున్నారు. విధానపరమైన అంశాలను, సవాళ్లను గురించి కూడా చర్చించారు. సమావేశంలో ఉత్పన్నమైన పలు సందేహాలకు మంత్రిత్వ శాఖ సమాధానాలు ఇచ్చింది. అదేవిధంగా ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, అడ్డంకులను తగ్గించడానికి మైనింగ్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడానికి పరిశ్రమ నుంచి మరిన్ని సూచనలు కూడా కోరింది.
గనుల కేటాయింపు కోసం 2015లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి చేపట్టిన నిరంతర ప్రయత్నాలలో భాగంగా జరిగిన ఈ సమావేశం బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన మైనింగ్‌కు భారతదేశాన్ని ఒక ప్రపంచ కేంద్రంగా నిలపాలన్న మంత్రిత్వ శాఖ క్రియాశీలక విధానాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ ఆర్థిక వృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన, ఆవిష్కరణలతో కూడిన వ్యవస్థను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
****
(Release ID: 2153964)