పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంట్ ప్రశ్న- ‘దేశమంతటా ఒకే కార్యాచరణ: ప్లాస్టిక్ కాలుష్యానికి స్వస్తి చెబుదాం’
Posted On:
04 AUG 2025 4:27PM by PIB Hyderabad
‘దేశమంతటా ఒకే కార్యాచరణ: ప్లాస్టిక్ కాలుష్యానికి స్వస్తి చెబుదాం’ (వన్ నేషన్, వన్ మిషన్: ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్).. ఈ నినాదంతో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025’ను ఈ ఏడాది జూన్ 5న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాని కంటే ముందు, ఒక నెల రోజులు ముందస్తు- ప్రచారోద్యమ కార్యకలాపాలను నిర్వహించారు. వీటిలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 69వేల ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 21 లక్షల మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ‘సంపూర్ణ ప్రభుత్వం’, ‘సంపూర్ణ సమాజం’ దృక్పథాన్ని అనుసరిస్తూ కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోని సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, పౌర సమాజం, పరిశ్రమ రంగానికి చెందిన వారు పాల్గొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (5 జూన్, 2025) పురస్కరించుకొని ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటడం) కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక మర్రి మొక్కను స్వయంగా నాటి, మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఈ కార్యక్రమం పర్యావరణాన్ని సంరక్షించడం పట్ల భారత్‌కున్న కట్టుబాటుకు అద్దం పట్టింది. ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు’లో భాగంగా ఈ మొక్కను నాటారు. ఆరావళీ పర్వత శ్రేణికి చెందిన 700 కి.మీ.ల ప్రాంతంలో మళ్లీ వనాలను పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలుచేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం సుస్థిర రవాణా ధ్యేయంతో శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన 200 ఎలక్ట్రిక్ బస్సులను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ సమతౌల్యాన్ని సంరక్షించడంలో దేశ ప్రజలందరి ఉమ్మడి బాధ్యతకు కూడా ఒక ప్రతీకగా నిలిచింది.
జాతీయ ప్లాస్టిక్ కాలుష్య తగ్గింపు ప్రచార ఉద్యమం (నేషనల్ ప్లాస్టిక్ పొల్యూషన్ రిడక్షన్ క్యాంపెయిన్..ఎన్‌పీపీఆర్‌సీ)ను ఈ ఏడాది జూన్ 5 నుంచి అక్టోబరు 31 వరకు అమలు చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ ప్రచార ఉద్యమంలో.. ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోను, పులుల అభయారణ్యాల్లోను ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ‘స్పెషల్ క్యాంపెయిన్ 5.0’గా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేకించి ఒక్కసారే ఉపయోగించదగిన ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్.. ఎస్‌యూపీ) ఉత్పత్తుల వినియోగాన్ని ఇక తగ్గించుకోవడం మంచిదనే విధానంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌కు ప్రత్యామ్నాయంగా అనుసరించదగిన పర్యావరణ అనుకూల విధానాలపై ఒక హ్యాకథాన్, ‘ప్లాస్టిక్ కాలుష్యానికి స్వస్తి చెబుదాం’ అంశంపై కవితల పోటీ, నినాదాల రచన పోటీ, వీధి నాటకాల నిర్వహణ వంటి సృజనాత్మక పోటీలను ఏర్పాటు చేసి వీటిలో యువతను భాగస్వాములను చేయడం కూడా ఈ ప్రచార ఉద్యమంలో ఓ భాగమే.
కిందటి సంవత్సరం మార్చి నెల 14న నోటిఫై చేసిన ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (సవరణ) నియమావళి-2024’లో పేర్కొన్న ప్రకారం, నిర్దేశిత నమూనాలో వార్షిక నివేదికను ఏటా జూన్ 30 కల్లా ప్రతి పట్టణ స్థానిక సంస్థతో పాటు జిల్లా స్థాయిలో కూడా రూపొందించాల్సి ఉంటుంది. ప్రతి పట్టణ స్థానిక సంస్థ తన నివేదికను పట్టణాభివృద్ధి విభాగానికీ, పంచాయతీ తన నివేదికను గ్రామీణాభివృద్ధి విభాగానికీ ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఇవే నివేదికలను సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్‌పీసీబీ)కి లేదా కాలుష్య నియంత్రణ కమిటీ (పీసీసీ)కి కూడా సమర్పించాలి. వార్షిక నివేదికలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలని పేర్కొనడం అనేక అంచెలతో కూడిన కాగిత ప్రధాన నివేదికల పద్ధతితో పోలిస్తే పెనుమార్పును సూచిస్తోంది. జాతీయ ప్లాస్టిక్ వ్యర్థాల నివేదికలకు సంబంధించిన పోర్టల్ (National Plastic Waste Reporting Portal)ను ఈ ఏడాది జూన్ 5న ప్రారంభించారు.
‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన సవరణ నియమావళి-2021’ని పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ 2021 ఆగస్టు 12న నోటిఫై చేసింది. దీనితో.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులుగా గుర్తించిన వాటిని నిషేధించారు. ఈ వస్తువులకు ఉపయోగం స్థాయి తక్కువగాను, చెత్త పోగయ్యే ప్రమాదం ఎక్కువగాను ఉంటుంది. ఈ వస్తువులను 2022 జులై 1 నుంచి నిషేధించారు. గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని అమలు చేయడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్‌పీసీబీ),కాలుష్య నియంత్రణ కమిటీ (పీసీసీ)..ఆయా ప్రాంతాల స్థానిక అధికార యంత్రాంగం సహకారంతో దేశం నలుమూలలా క్రమం తప్పక తగిన చర్యలు తీసుకొంటున్నాయి. మొత్తం 8,61,740 తనిఖీలు నిర్వహించి 1,985 టన్నుల నిషిద్ధ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను జప్తు చేసినట్లు, రూ.19.82 కోట్ల జరిమానా విధించినట్లు ఎస్‌పీసీబీ, పీసీసీ తెలిపిన వివరాలతో పాటు ఎస్‌యూపీ నియమ పాలన పర్యవేక్షక పోర్టల్‌లో నమోదు చేసిన వివరాలు సూచిస్తున్నాయి.
ఒకసారి మాత్రమే వాడదగిన ప్లాస్టిక్ వస్తువులను గుర్తించి నిషేధాన్ని అమలులోకి తీసుకురావడంతో, పర్యావరణానికి హాని చేయని ఇతర ఐచ్ఛికాలను అభివృద్ధిపరిచే ప్రక్రియ జోరందుకొంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల ప్రాధికార సంస్థలు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల దిశగా ముందంజ వేశాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కాలుష్య నియంత్రణ కమిటీలు అందజేసిన సమాచారం ఆధారంగా చేసుకొని, ‘‘నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేసే, విక్రయించే సంస్థల జాబితా’’ను పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి లు రూపొందించాయి. ఈ జాబితాలో దేశవ్యాప్తంగా విస్తరించిన సుమారు 1,000 యూనిట్ల వివరాలను పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అభివృద్ధిచేయడాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ ప్రమాణాల మండలి.. ఆహారాన్నందించడం కోసం వ్యవసాయ ఉప-ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసిన పాత్రలకు ‘ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ 18267’ను కేటాయిస్తూ.. ఆ మేరకు నోటిఫై చేసింది.
ప్లాస్టిక్ ప్యాకేజింగుకు సంబంధించిన కేంద్రీకృత ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబులిటీ (ఈపీఆర్) పోర్టల్‌లో పేర్కొన్న ప్రకారం.. ఉత్పత్తిదారు సంస్థలు (ప్రొడ్యూసర్లు), దిగుమతిదారు సంస్థలు, బ్రాండ్ యాజమాన్య సంస్థలు కలిపి 51,838 సంస్థలతో పాటు 2,948 ప్లాస్టిక్ వ్యర్థాల శుద్ధి సంస్థలు (ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసర్లు) కూడా ఈ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఈపీఆర్ మార్గదర్శకాలను 2022 ఫిబ్రవరి 16న నోటిఫై చేసినప్పటి నుంచి దాదాపు 157 లక్షల టన్నుల మేరకు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాల రీసైకిలింగ్ పనులను పూర్తి చేశారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమావళిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటిఫై చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియమ నిబంధనలను పాటించని సంస్థలపై ‘కాలుష్యానికి కారకులైన వర్గాలే చెల్లింపు చేయాలి’ అనే సూత్రం ఆధారంగా ‘పర్యావరణానికి కలిగించిన నష్టాన్ని భర్తీ చేయాలి’ అనే ఒక ప్రత్యేక నిబంధనను పొందుపరిచారు. పర్యావరణ సంబంధిత పరిహారం మదింపు విషయంలో సవరించిన మార్గదర్శకాలను సీపీసీబీ 2024 ఆగస్టులో జారీ చేసింది. ఉల్లంఘనలకు పాల్పడినందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సంబంధిత అధికారులు కూడా చర్యలను చేపట్టారు. ఈ చర్యలలో.. నిషేధిత ‘ఒకసారే వాడదగిన ప్లాస్టిక్ వస్తువుల’ను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్ట ప్రకారం జరిమానాను కూడా విధించవచ్చు.
ఈ సమాచారాన్ని లోక్‌సభలో ఒక ప్రశ్నకు, కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ఈరోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు.
***
(Release ID: 2152598)
Visitor Counter : 17