అంతరిక్ష విభాగం
కచ్చితత్వం, అందరికీ అందుబాటులో డేటా.. నిసార్‌తో భూ పరిశీలనలో విప్లవాత్మక మార్పులు
· భారత్ - అమెరికా మధ్య సహకారానికి సంబంధించి అంతరిక్ష విజ్ఞానంలో కీలక మైలురాయి
· విమానయానం, షిప్పింగ్ వంటి రంగాలపై విస్తృత ప్రభావం: ఇస్రో- నాసా సమష్టి కృషిని అభినందించిన మంత్రి
· వైమానిక భద్రత, సముద్ర రవాణా, తీరప్రాంత నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి కీలక రంగాల్లో మన దృక్పథాన్ని నిసార్ విశేషంగా మార్చేస్తుంది
Posted On:
30 JUL 2025 7:51PM by PIB Hyderabad
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో, నాసా శాస్త్రవేత్తలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన, అంతరిక్ష, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.
పార్లమెంటరీ బాధ్యతల వల్ల న్యూఢిల్లీలోనే ఉన్నప్పటికీ, సీఎస్ఐఆర్ ఆడిటోరియంలోని సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని వీక్షించారు. ఉపగ్రహాన్ని మోసుకుంటూ, ఎలాంటి లోపమూ లేకుండా జీఎస్ఎల్వీ- ఎఫ్16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడంపై ప్రశంసలు కురిపించారు.
భారత్ - అమెరికా వైజ్ఞానిక సహకారంలో ‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణం’గా నిసార్‌ను అభివర్ణించిన డాక్టర్ జితేంద్ర సింగ్.. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్య శక్తికి ఈ మిషన్ ప్రతీక అన్నారు. “నిసార్ కేవలం ఉపగ్రహం మాత్రమే కాదు.. వైజ్ఞానికంగా దీనిద్వారా భారత్ ప్రపంచంతో కరచాలనం చేస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ ప్రయోగ వాహనం ఓ ఉపగ్రహాన్ని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇది జీఎస్ఎల్వీ 18వ ప్రయోగం కాగా, క్రయోజనిక్ దశను ఉపయోగించిన 12వ ప్రయోగం. అంతరిక్ష వ్యవస్థల్లో పెరుగుతున్న భారత సాంకేతిక పరిణతికి ఇది నిదర్శనం.
నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (నిసార్)ను నాసా- ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్లను ఒకే వేదికపై మోసుకెళ్లిన ప్రపంచంలో మొదటి భూ పరిశీలన ఉపగ్రహం ఇది. నాసాకు చెందిన ఎల్- బ్యాండును, ఇస్రోకు చెందిన ఎస్- బ్యాండును ఇందులో పొందుపరిచారు. ఇది అత్యంత స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. పగలూ రాత్రీ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూ, మంచు ఉపరితలాలను చిత్రిస్తుంది. ఒక్కో లొకేషన్‌కూ 12 రోజులకోసారి చేరుతుంది.
విపత్తు నిర్వహణ, వాతావరణ పర్యవేక్షణ, హిమానీనదాల ట్రాకింగ్, వ్యవసాయంలో నిసార్ ప్రయోజనాలు విస్తృతంగా ఉన్నప్పటికీ.. వాటిని మించి చాలా అంశాల్లోనూ ఈ ఉపగ్రహ ప్రభావం ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
“వైమానిక భద్రత, సముద్ర రవాణా, తీరప్రాంత నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి కీలక రంగాల విషయంలో మన దృక్పథాన్ని నిసార్ విశేషంగా మార్చేస్తుంది’’ అని ఆయన అన్నారు. “షిప్పింగ్ మార్గాలు, ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలు, జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక విషయంలోనూ తెలివైన, సైన్స్ ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు కీలక ఆధారంగా ఉపయోగపడుతుంది”
2,393 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని 747 కిలోమీటర్ల సన్ సింక్రనస్ కక్ష్యలోకి చేర్చారు. దాని అయిదేళ్ల మిషన్ కాలంలో.. ప్రపంచ వాతావరణ విజ్ఞానం, భూకంప, అగ్నిపర్వత పర్యవేక్షణ, అటవీ చిత్రణ, వనరుల నిర్వహణ కోసం అమూల్యమైన డేటాను నిసార్ అందిస్తుంది. డేటాను అందరికీ అందుబాటులో ఉంచాలన్న నిసార్ విధానం.. శాస్త్రవేత్తలు, పరిశోధకులకు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు, విపత్తు నిర్వహణ సంస్థల, వాతావరణ మార్పుల అంశంలో పనిచేస్తున్న సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
ఇస్రో ఐ-3కే స్పేస్ క్రాఫ్ట్ బస్ ఆధారంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం నాసా, ఇస్రో మధ్య బలమైన సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఎల్- బ్యాండ్ రాడార్, జీపీఎస్ రిసీవర్, హై రేట్ టెలికాం సిస్టమ్, సాలిడ్ స్టేట్ రికార్డర్, 12 మీటర్లు విస్తరించగల యాంటెన్నాను నాసా అందించింది. ఎస్-బ్యాండ్ రాడార్, స్పేస్‌క్రాఫ్ట్ బస్, జీఎస్ఎల్వీ-ఎఫ్16 ప్రయోగ వాహనం, అనుబంధ వ్యవస్థలు, సేవలను ఇస్రో అందించింది. ఈ మిషన్ ఖర్చు 1.5 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. రెండు సంస్థలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో- వినియోగ ఆధారిత మిషన్ల నుంచి విజ్ఞాన ఆధారిత కార్యక్రమాల దిశగా భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఆయన చెప్పారు. “చంద్రయాన్ నుంచి నిసార్ వరకు.. మనం ఉపగ్రహాలను మాత్రమే కాదు.. విజ్ఞానం, స్థిరత్వం, సమష్టి పురోగతి దిశగా అంతర్జాతీయంగా కొత్త అవకాశాలనూ మనం ప్రారంభిస్తున్నాం’’ అని వ్యాఖ్యానిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2151177)