రైల్వే మంత్రిత్వ శాఖ
పదమూడు జిల్లాల్లో మల్టిట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం.. ఈ జిల్లాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందినవి.. ఈ ప్రాజెక్టులతో సుమారు 574 కి.మీ. మేర విస్తరించనున్న భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్
*ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా ఖర్చు దాదాపు రూ.11,169 కోట్లు.. 2028-29 కల్లా పూర్తి
*ఈ ప్రాజెక్టులతో సుమారు 2 కోట్ల 29 లక్షల పనిదినాల మేరకు ప్రత్యక్ష ఉపాధికల్పన
Posted On:
31 JUL 2025 3:13PM by PIB Hyderabad
ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమై, దాదాపు రూ.11,169 కోట్ల వ్యయంతో రైల్వేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన 4 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఇవీ..:
(1) ఇటార్సీ-నాగ్‌పూర్ 4వ లైను,
(2) ఔరంగాబాద్ (ఛత్రపతి సంభాజీనగర్) - పర్భాని డబ్లింగు,
(3) అలువాబాడీ రోడ్డు-న్యూ జల్‌పాయిగుడీ 3వ, 4వ లైనుతో పాటు,
(4) డంగోపోసీ-జారోలీ 3వ, 4వ లైను.
మార్గం సామర్థ్యాన్ని పెంచినందువల్ల రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకొని, భారతీయ రైల్వేల కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. రైల్వేలు అందిస్తున్న సేవలను ప్రజలు మరింత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు. మల్టి-ట్రాక్ కు సంబంధించిన ఈ ప్రతిపాదనలు రైల్వే కార్యకలాపాలను సువ్యవస్థీకరించడంతో పాటు రద్దీ సమస్యను పరిష్కరిస్తాయి. ఆయా ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తే తద్వారా ఆ ప్రాంతాల ప్రజలు స్వావలంబనను సాధించుకోవడానికి దోహదపడి నవ భారతావని వైపు అడుగులు పడతాయన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ఈ ప్రాజెక్టులు సాకారం చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలతో పాటు స్వయంఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయి.
సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకొని, ఆసక్తిదారులతో సంప్రదింపులు నిర్వహించడం ద్వారా బహుళ విధ సంధానాన్ని, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థను ఇప్పటి కంటే అభివృద్ధిచేయడంపై పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో దృష్టిని కేంద్రీకరించింది. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు ప్రయాణికులకే కాక వస్తువులు, సేవల రవాణాకు కూడా ఎలాంటి అసౌకర్యం ఎదురవని సంధానాన్ని ఈ ప్రాజెక్టులు సమకూరుస్తాయి.
ఈ 4 ప్రాజెక్టులను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందిన 13 జిల్లాల పరిధిలో అమలుచేస్తారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్ స్థాయి సుమారు 574 కి.మీ. మేర విస్తరిస్తుంది.
ప్రతిపాదిత మల్టి-ట్రాకింగ్ ప్రాజెక్టు దాదాపుగా 2,309 గ్రామాలకు సంధాన సదుపాయాన్ని పెంచుతుంది. ఈ గ్రామాల్లో సుమారు 43 లక్షల 60 వేల మంది నివసిస్తున్నారు.
ఈ మార్గాలు బొగ్గు, సిమెంటు, క్లింకర్, జిప్సమ్, ఫ్లయ్ యాష్, కంటెయినర్లు, వ్యవసాయ వస్తువులతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు వగైరా సరకుల రవాణాకు అత్యంత కీలకం. సామర్థ్యాన్ని పెంచే పనులను పూర్తి చేస్తే అదనంగా ఒక్కో సంవత్సరంలోనూ 95.91 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సరకు రవాణాకు మార్గం సుగమం అవుతుంది. మనకున్న రవాణా సాధనాల్లో రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవీ, ఇంధనాన్ని ఆదా చేసేవీ కావడంతో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన లక్ష్యాలను సాధించడంలో, దేశ ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ సంబంధిత ఖర్చును కుదించడంలో రైల్వే శాఖ తోడ్పడనుంది. చమురు దిగుమతులు 16 కోట్ల లీటర్ల మేరకు, కర్బన ఉద్గారాలు 515 కోట్ల కేజీల మేరకు తగ్గుతాయి. ఇది 20 కోట్ల మొక్కలను సంరక్షించడంతో సమానం.
***
(Release ID: 2150909)