బొగ్గు మంత్రిత్వ శాఖ
శుద్ధి చేసిన గని నీటి వినియోగం
Posted On:
30 JUL 2025 3:55PM by PIB Hyderabad
శుద్ధి చేసిన గని నీటిని సంబంధిత పర్యావరణ, నీటి సంరక్షణ మార్గదర్శకాలకు అనుగుణంగా తాగు, సాగు, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించటాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. దాని ఆధ్వర్యంలో ఉన్న బొగ్గు, లిగ్నైట్‌కు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలైన (పీఎస్‌యూ) కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)ద్వారా ఈ దిశగా కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ చట్టం- 1986, నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం- 1974.. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ), సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (సీపీసీబీ) జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నీటి నాణ్యత ఉండేలా చూసుకుంటోంది. వివిధ పనుల కోసం శుద్ధి చేసిన గని నీటిని సురక్షితంగా, సమర్థవంతంగా వాడుకునేలా చూసుకునేందుకు బొగ్గు, లిగ్నైట్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సొంత ప్రామాణిక నిర్వహణ నిబంధనలను రూపొందించాయి.
తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తోన్న శుద్ధ గని నీరు.. ఆరోగ్య, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందన్న నిర్ధారణ కోసం ఆయా సంస్థలు వివిధ నాణ్యత నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్ ఐఎస్ 10500:2012), జాతీయ భూగర్భ జలవనరుల ప్రాధికార సంస్థ (సీజీడబ్ల్యూఏ), ఈ విషయంలో వర్తించే ఇతర ప్రమాణాలు సూచించిన పరిమితుల ప్రకారం గుర్తింపు పొందిన ప్రయోగశాలల ద్వారా శుద్ధి చేసిన గని నీటిని కాలానుగుణంగా పరీక్షిస్తున్నారు. సరఫరాకు ముందు అవక్షేపణ, వడపోత, క్రిమిసంహారణ వంటి సరిపడా శుద్ధి ప్రక్రియలు చేపడుతున్నాయి.
బొగ్గు, లిగ్నైట్ గనులున్న అన్ని రాష్ట్రాలలో గని నీటి నిర్వహణ కార్యక్రమాలను అమలు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. మిగులు గని నీటిని గృహ, నీటిపారుదల, పారిశ్రామిక అవసరాల కోసం లాభదాయకంగా ఉపయోగించుకునే ప్రాజెక్టులను బొగ్గు, లిగ్నైట్ పీఎస్‌యూలు చేపట్టాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి ఈరోజు లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.
***
(Release ID: 2150493)