హోం మంత్రిత్వ శాఖ
కొత్త క్రిమినల్ చట్టాలలో బాధితులకు అనుగుణంగా మార్పులు
Posted On:
30 JUL 2025 5:34PM by PIB Hyderabad
భారతీయ న్యాయ సంహిత-2023లో మొదటిసారిగా మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నిబంధనలకు ప్రాధాన్యత లభించింది. ఇవన్నీ ఒకే ఆధ్యాయం కింద ఉన్నాయి. మహిళలపై నేరాల విషయంలో మరణశిక్షతో కూడిన కఠినమైన శిక్షలు ఉన్నాయి. 18 సంవత్సరాల లోపు వయసున్న మహిళలపై సామూహిక అత్యాచారానికి శిక్ష.. దోషికి మిగిలి ఉన్న సహజ జీవితంలో మిగిలిన భాగం లేదా మరణం వరకు జీవిత ఖైదు. వివాహం, ఉద్యోగం, పదోన్నతి, గుర్తింపును దాచిపెట్టడం వంటి తప్పుడు హామీలతో లైంగిక సంబంధం పెట్టుకున్న విషయాలను ఇప్పుడు నేరంగా పరిగణిస్తోంది. మానవ అక్రమ రవాణా, అక్రమ రవాణా చేసిన పిల్లలపై లైంగిక దాడుల నేరాలకు జీవిత ఖైదు వరకు కఠినమైన శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. పిల్లల అక్రమ రవాణా విషయంలో కనీస శిక్ష జరిమానాతో సహా 10 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు కాగా.. గరిష్ఠంగా జరిమానాతో సహా జీవిత ఖైదు. అక్రమ రవాణా విషయంలో దోపిడీ చేసేందుకు 'భిక్షాటన’ను ఉపయోగించటం అనేది న్యాయ సంహితలోని సెక్షన్ 143 ప్రకారం శిక్షార్హమైనది. నేరం చేసేందుకు పిల్లలను నియమించడం, నేరంంలో వారిని నిమగ్నం చేయడం కూడా శిక్షార్హమైన నేరంగా ఉంది. కొత్త క్రిమినల్ చట్టాలలో మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన ప్రధాన నిబంధనలు అనుబంధం-2లో ఉన్నాయి.
అనుబంధం -1
బాధితులకు అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలలో ఉన్న నిబంధనలు
1. ఆన్‌లైన్‌లో సంఘటనలను నివేదించటం: భౌతికంగా పోలీస్ స్టేషన్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సంఘటనలను నివేదించవచ్చు. దీని ద్వారా సులభంగా, వేగంగా నివేదించడానికి వీలు అవుతుంది. పోలీసులు కూడా సత్వర చర్యలు తీసుకోవచ్చు.
2. ఏదైనా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయండి: జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టడంతో అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేయొచ్చు. ఇది చట్టపరంగా చర్యలు ప్రారంభించటంలో జరిగే జాప్యాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా వెంటనే నేరాన్ని నివేదించేలా చూసుకుంటుంది.
3. ఉచిత ఎఫ్‌ఐఆర్ నకలు: బాధితుడు ఎఫ్‌ఐఆర్ నకలును ఉచితంగా పొందవచ్చు. ఇది చట్టపరమైన ప్రక్రియలో వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటుంది.
4. అరెస్టు చేసిన తర్వాత సమాచారం ఇచ్చే హక్కు: అరెస్టైన వ్యక్తికి తాను ఎంపిక చేసుకున్న వ్యక్తికి తన పరిస్థితి గురించి తెలియజేసే హక్కు ఉంది. ఇది నిందితుడికి తక్షణ సహాయం అందేలా చూసుకుంటోంది.
5. అరెస్టు సమాచారం వెల్లడి: అరెస్టైన వారి సమాచారానికి సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ స్థాయికి తగ్గని పోలీసు, ప్రతి జిల్లాలో ఒక నియామక అధికారి బాధ్యత వహించాలి. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్‌లో అరెస్టైన వారి సమాచారం ప్రముఖంగా ప్రదర్శించాలి. ఇది నిందితుల హక్కులను కాపాడుతుంది. అంతేకాకుండా కస్టడీలో హింస, అక్రమ నిర్బంధ సంఘటనలను తగ్గిస్తుంది.
6. భాదితులకు కేసు పురోగతి వివరాల అందజేత: 90 రోజుల్లోపు వారి కేసు పురోగతి వివరాలు పొందే హక్కు బాధితులు కలిగి ఉంటారు. బాధితులకు సమాచారం అందేలా ఈ నిబంధన చూసుకోవటంతో పాటు చట్టపరమైన ప్రక్రియలో వారిని పాల్గొనేలా చేస్తూ పారదర్శకత, నమ్మకాన్ని పెంచుతుంది.
7. పోలీసు నివేదిక, ఇతర దస్త్రాల పొందటం: నిందితుడు, బాధితుడు ఇద్దరూ కూడా 14 రోజుల్లోపు ఎఫ్‌ఐఆర్, పోలీసు నివేదిక లేదా ఛార్జ్‌షీట్, స్టేట్‌మెంట్‌లు, నిందితులు ఒప్పుకున్న అంశాలు, ఇతర పత్రాల కాపీలను పొందవచ్చు.
8. సాక్షుల సంరక్షణ పథకం(విట్‌నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్): కొత్త చట్టం ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షుల భద్రత నిర్ధారించేందుకు.. చట్టపరమైన చర్యల విశ్వసనీయత, ప్రభావాన్ని పెంచడానికి సాక్షుల సంరక్షణ పథకాన్ని అమలు చేయటం తప్పనిసరి.
9. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా మినహాయింపు: మహిళలు, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, వైకల్యం లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా మినహాయింపు ఉంది.
10. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 360 ప్రకారం అభియోగాలను వెనక్కి తీసుకునే ముందు బాధితుడి వాదనను వినడం తప్పనిసరి. బాధితుడి వాదన వినిపించే హక్కును చట్టబద్ధంగా గుర్తించడం అనేది క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో న్యాయం కేంద్రంగా ఉండే విధానానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. కేసుల ఉపసంహరణకు సంబంధించి బాధితుడి వాదనను తప్పనిసరి చేయటం ద్వారా నేరాల ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమైన వారి అవసరాలు, ఆందోళనలకు న్యాయ వ్యవస్థ మరింత స్పందిస్తుంది.
అనుబంధం- 2
స్త్రీలు, పిల్లల రక్షణకు సంబంధించిన నిబంధనలు
1. భారతీయ న్యాయ సంహిత- 2023లోని అధ్యాయం-5లో స్త్రీ, పిల్లలపై జరిగే నేరాలకు అన్ని ఇతర నేరాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
2. సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాధితులకు సంబంధించి ఉన్న వయస్సు వ్యత్యాసం భారతీయ న్యాయ సంహిత-2023లో తొలగిపోయింది. గతంలో 16, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై సామూహిక అత్యాచారానికి వేర్వేరు శిక్షలు ఉండేవి. ఈ నిబంధన ఇప్పుడు మారింది. ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న ఆడవారిపై సామూహిక అత్యాచారం విషయంలో జీవిత ఖైదు శిక్ష లేదా మరణశిక్ష ఉంది.
3. సమన్లు పొందిన వ్యక్తి తరపున సమన్లు స్వీకరించగల కుటుంబంలోని వయోజన సభ్యురాలిగా మహిళలకు గుర్తింపు లభించింది. 'కొంతమంది వయోజన పురుష సభ్యుడు' అనే మునుపటి పదాలు 'కొంతమంది వయోజన సభ్యులు'తో భర్తీ అయ్యాయి.
4. అత్యాచారానికి సంబంధించిన బాధితురాలికి మరింత రక్షణ కల్పించేందుకు, దర్యాప్తులో పారదర్శకతను తీసుకొచ్చేందుకు పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా రికార్డ్ చేయాలి.
5. స్త్రీలపై జరిగే కొన్ని నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని సాధ్యమైనంతవరకు మహిళా మేజిస్ట్రేట్.. ఆమె లేనప్పుడు మహిళల సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ నమోదు చేయాలి. ఇది సున్నితత్వం, పారదర్శకతను నిర్ధారించేందుకు బాధితులకు సహాయక వాతావరణాన్ని సృష్టించేందుకు ఉపయోగపడుతుంది.
6. అత్యాచార బాధితురాలి వైద్య నివేదికను వైద్య నిపుణులు తప్పనిసరిగా 7 రోజుల్లోపు పంపాలి.
7. పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లేదా 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న (ఇంతకు ముందు 65 సంవత్సరాలు) పురుషుడు లేదా స్త్రీ లేదా.. మానసికంగా లేదా శారీరకంగా వైకల్యం ఉన్న వ్యక్తి లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎక్కడ నివసిస్తారో అక్కడే విచారించాలి. వేరే ప్రదేశంలో విచారణకు హాజరుకానవసరం లేదు. అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్న సందర్భాల్లో అందుకు అనుమతించొచ్చు.
8. మహిళలు, పిల్లలపై నేరాల విషయంలో బాధితులకు అన్ని ఆసుపత్రులలో ఉచిత ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్సను అందించాలనే నిబంధన కొత్త చట్టాల్లో ఉంది. ఇది సమస్యల్లో ఉన్న బాధితుల సంక్షేమం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాధాన్యతనిస్తోంది. అంతేకాకుండా వారికి అవసరమైన వైద్య సంరక్షణను తక్షణమే అందేలా చేస్తుంది.
9. ఒక నేరాన్ని చేసేందుకు పిల్లలను నియమించడం వంటివి భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 95 ప్రకారం శిక్షార్హమైన నేరాలు. ఇందులో కనీసం ఏడు సంవత్సరాల జైలు శిక్షను విధించొచ్చు. దీన్ని పదేళ్ల వరకు పొడిగించొచ్చు. ఈ నిబంధన పిల్లలను నేరాల కోసం ముఠాలు, వివిధ నేర సమూహాలు నిరోధించకుండా చూసుకుంటుంది.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2150479)