జాతీయ మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్‌లో రెండు రోజుల బహిరంగ విచారణ, శిబిరాన్ని ముగించిన ఎన్‌హెచ్ఆర్‌సీ: 109 కేసుల విచారణ
* 9 కేసుల్లో రూ.49.65 లక్షలు చెల్లించాలని సిఫార్సు, ఈ మొత్తంలో రూ.22.50 లక్షలు చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం: మిగిలిన రూ.27.15 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం
* మహిళలు, చిన్నారులు, ఇతర బలహీన వర్గాల వారిపై జరుగుతున్న నేరాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులకు అవగాహన
* భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పౌర ప్రతినిధులు ఎన్జీవోలు, మానవ హక్కుల కార్యకర్తలతో సమావేశమైన కమిషన్
Posted On:
29 JUL 2025 8:40PM by PIB Hyderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన 109 కేసుల విచారణ అనంతరం రెండు రోజుల ‘బహిరంగ విచారణ, శిబిరాన్ని’ జాతీయ మానవ హక్కుల కమిషన్ ముగించింది. బాధితులు, ఫిర్యాదిదారులు, అధికారుల సమక్షంలో ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ శ్రీ రామసుబ్రమణియన్, సభ్యులు జస్టిస్ (డాక్టర్) బిద్యుత్ రంజన్ సారంగి, శ్రీమతి విజయ భారతి సయాని విచారణ చేపట్టారు. సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (విచారణ) శ్రీ ఆర్‌పీ మీనా, రిజిస్ట్రార్ (న్యాయం) శ్రీ జోగిందర్ సింగ్, కమిషన్‌కు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసిన రెండు బెంచులు 90 కేసులను విచారించాయి. వీటిలో ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల కారణంగా చిన్నారుల మరణం, నివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోవడం, అగ్ని ప్రమాదాల్లో మరణాలు, పులుల దాడులు, గిరిజన మహిళల మానవ అక్రమ రవాణా, గిరిజన కుటుంబాలను బలవంతంగా తరలించడం, కనీస మానవ అవసరాలను నిరాకరించడం, అత్యాచారాలతో సహా మహిళలపై జరుగుతున్న దాడులు, చిన్నారులపై జరిగిన నేరాలు, పోలీసుల దురాగతాలు, ఆత్మహత్యలు, దళితబంధు పథకం నిధుల దుర్వినియోగం, కుటుంబ పింఛను కేసులు, ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, గురుకులాల్లో కల్తీ ఆహారం, పోషకాహర లోపం కేసులు, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం తదితరమైనవి ఉన్నాయి.
అర్హతలను పరిశీలించిన అనంతరం తగిన ఆదేశాలను కమిషన్ జారీ చేసింది. కమిషన్ ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో కొన్ని:
-
ఖమ్మం జిల్లాలో కుల వివక్ష, సామాజిక బహిష్కరణకు సంబంధించిన కేసులో, ఎన్హెచ్ఆర్సీ జోక్యం తర్వాత పోలీసులు చర్యలు తీసుకున్నారు. గ్రామస్థులు ఆ కుటుంబంపై కుల వివక్ష లేదా సామాజిక బహిష్కరణను అమలు చేయకుండా చేశారు.
-
తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 48 మంది విద్యార్థులు మరణించడం, 886 ఫుడ్ పాయిజన్ ఘటనల కేసుకు సంబంధించిన నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని అయిదు గురుకుల పాఠశాలల కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది.
-
అక్రమ అరెస్టు, లాఠీఛార్జికి సంబంధించిన మరో కేసులో పర్యావరణ అనుమతి, ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సమ్మతితో సహా సంబంధిత పత్రాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.
-
డీఆర్‌డీవో రాకెట్ ప్రొపెల్లెంట్ యూనిట్లో జరిగిన పేలుడులో మరణించిన నలుగురి కుటుంబాల్లో మూడింటికి మొత్తంగా రూ.50 లక్షల పరిహారాన్ని చెల్లించారు. మరో బాధిత కుటుంబానికి సైతం పరిహారం అందించాలని కమిషన్ ఆదేశించింది.
-
పెరుగుతున్న వీధికుక్కల బెడదకు సంబంధించి అయిదో తరగతి విద్యార్థి సమర్పించిన కేసులో, ఈ సమస్యను తగ్గించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానంతో రావాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది.
-
గిరిజన మహిళల మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తప్పు చేసిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించారు. అక్రమ రవాణాకు గురైన అనేక మంది గిరిజన మహిళలను రక్షించారు.
అనంతరం, పెండింగ్‌లో ఉన్న19 కేసులను కమిషన్ ఫుల్ బెంచ్ విచారించింది. వాటిలో 9 కేసుల్లో బాధితులకు రూ. 49.65 లక్షల ఆర్థిక సాయం అందించాలని కమిషన్ సిఫారసు చేసింది. వాటిలో రూ. 22.50 లక్షలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. అలాగే మిగిలిన రూ. 27.15 లక్షల మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మెరిట్ ఆధారంగా 29 కేసులను కమిషన్ ముగించింది. చెల్లింపులకు సంబంధించిన సాక్ష్యంతో పాటు అమలు నివేదిక చూపిన అనంతరం రెండు కేసులను ముగించారు.
2025, జులై 28న కేసుల విచారణ అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో 2025, జులై 29న మానవ హక్కులకు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్ సమావేశం నిర్వహించింది. ఎవరినీ విస్మరించకుండా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన విధానంపై వారికి అవగాహన కల్పించింది. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చేపట్టాల్సిన నివారణ, వ్యవస్థీకృత చర్యలకు ప్రాధాన్యమిచ్చింది. పర్యావరణం, వాతావరణ మార్పులు, వ్యాపారాల వల్ల ప్రభావితమవుతున్న మానవ హక్కుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, తెలంగాణలో చాలా జిల్లాల్లో మరణాలకు దారితీస్తున్న మనిషి-జంతువు మధ్య సంఘర్షణ, పెద్ద సంఖ్యలో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడటం, ఎస్సీ కార్పొరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు లేకపోవడం, చేప పిల్లలను ఉత్పత్తి చేసే వారితో సహా రైతుల దుస్థితి, ఎల్జీబీటీక్యూఐ సమాజం హక్కులు, తదితర అంశాలపై చర్చించారు.
ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర అధికారులు చేపడుతున్న చర్యలను కమిషన్ ప్రశంసించింది. తాము అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధికారులు కమిషన్ ముందుంచారు. మానవ హక్కుల ఉల్లంఘన బాధితులకు న్యాయం జరిగేలా సమయానుగుణంగా నివేదికలను తమకు సమర్పించాలని కమిషన్ సూచించింది. మానసిక ఆరోగ్యం, వెట్టి చాకిరీ, ఆహారం, భద్రతా హక్కు సహా వివిధ అంశాలకు సంబంధించి కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. కమిషన్ సిఫారసులను పూర్తిగా పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు.
అనంతరం.. పౌర ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్త (హెచ్ఆర్‌డీ)లతో కమిషన్ సమావేశం నిర్వహించింది. మానవ హక్కుల పరిరక్షణ, ప్రోత్సాహం కోసం ఎస్హెచ్ఆర్సీలు, పౌర ప్రతినిధులతో కలసి పనిచేయడంపై తమకు విశ్వాసం ఉందని కమిషన్ పునరుద్ఘాటించింది. వయోధికులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగులు, తదితరులకు సంబంధించిన సమస్యలను ఎన్జీవో ప్రతినిధులు, హెచ్ఆర్డీలు తెలియజేశారు. సంరక్షులకు తోడ్పాటు ఇచ్చేలా తీవ్రమైన వైకల్యంతో ఇబ్బంది పడుతున్న దివ్యాంగజనులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. గుర్తింపు ధ్రువపత్రాలను పొందడంలో పేద చిన్నారులకు ఎదురవుతున్న సమస్యలను వారు వివరించారు. రాష్ట్రంలో వారు చేస్తున్న కార్యక్రమాలను కమిషన్ ప్రశంసించింది. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా పనిని కొనసాగించాలని ప్రోత్సహించింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో ఎన్జీవోలు, హెచ్ఆర్డీల భాగస్వామ్యం దేశంలో మానవ హక్కులను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందన్న ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్ పరిశీలనతో సమావేశం ముగిసింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి hrcnet.nic.in ద్వారా ఆన్ లైనులో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని వారికి తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్ని సమావేశాల్లోనూ పాల్గొన్నారు.
అనంతరం, తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణ, శిబిరం ఫలితాలను విలేకరులకు వివరించారు.
***
(Release ID: 2150091)