నౌకారవాణా మంత్రిత్వ శాఖ
సాగర్‌మాలలో భాగంగా రైలు-రోడ్డు మార్గాల అనుసంధానం
Posted On:
29 JUL 2025 1:39PM by PIB Hyderabad
సాగర్‌మాల కార్యక్రమంలో భాగంగా 272 రోడ్డు, రైలు అనుసంధాన ప్రాజెక్టులను గుర్తించారు. వీటిని రోడ్డు, రవాణా, హైవేల శాఖ, రైల్వేల మంత్రిత్వ శాఖ, ప్రధాన ఓడరేవులు, నిర్దిష్ట ప్రాంతంలో ఫలానా వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతిని పొందిన సంస్థలు (కన్సెషనేర్లు) వంటి ఏజెన్సీలు అమలు చేస్తున్నాయి. మొత్తం 272 ప్రాజెక్టుల్లో 74 ప్రాజెక్టులు పూర్తి కాగా, 67 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 131 ప్రాజెక్టులు రూపకల్పన దశలో ఉన్నాయి.
సాగర్‌మాలను ఆరంభించినప్పడే సమగ్ర విధాన మార్గదర్శనం, ఉన్నత స్థాయి సమన్వయం కోసం ఉన్నత స్థాయిలో నేషనల్ సాగర్‌మాల ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రణాళికతో పాటు ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా వివిధ ఆసక్తిదారుల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి మ్యారిటైం స్టేట్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎంఎస్డీసీ) సమావేశాలను మంత్రిత్వ శాఖ తరచుగా నిర్వహిస్తోంది.
సాగర్‌మాల కార్యక్రమంలో భాగంగా, 839 ప్రాజెక్టులను గుర్తించారు. ఈ ప్రాజెక్టులను దాదాపు రూ.5.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయాలని సంకల్పించారు. వీటిలో 119 ప్రాజెక్టులను రూ.2.42 లక్షల కోట్ల మొత్తం ప్రాజెక్టు వ్యయంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అమలు చేస్తున్నారు. మిగతా ప్రాజెక్టులను ప్రభుత్వమే నేరుగా అందించే డబ్బుతో ఈపీసీ పద్ధతిలో చేపడుతున్నారు.
సాగర్‌మాల పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రాజెక్టుల విషయంలో, ఆయా ప్రాజెక్టులను మరింత వేగంగా అమలు చేయడానికీ, నిధులను నిజాయతీతో సరి అయిన పద్ధతిలో నియమాల ప్రకారం ఖర్చుచేయడానికీ సంబంధించిన సాగర్‌మాల ఆర్థిక సహాయ మార్గదర్శక సూత్రాలను ఓడరేవులు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ సవరించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2149797)