జల శక్తి మంత్రిత్వ శాఖ
‘జల్ జీవన్ మిషన్’ అమలు 2028 వరకు పొడిగింపు
Posted On:
28 JUL 2025 1:47PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ నల్లా కనెక్షన్‌ను (ఎఫ్హెచ్టీసీ) అందజేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం ‘జల్ జీవన్ మిషన్’ను 2024 వరకు అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో మొదలుపెట్టింది.
ఈ మిషన్‌ను ప్రారంభించే నాటికి, గ్రామీణ ప్రాంతాల్లో 3 కోట్ల 23 లక్షల ఇళ్లకు మాత్రమే నల్లా నీటి కనెక్షన్ల సదుపాయం ఉంది. అప్పటికి, నల్లా నీటి కనెక్షన్లు `6.7 శాతం గ్రామీణులకే అందుబాటులో ఉన్నాయి. ఇంతవరకు, అంటే ఈ నెల 23 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తెలిపిన ప్రకారం ‘జల్ జీవన్ మిషన్ (జేజేఎం)- హర్ ఘర్ జల్’ లో భాగంగా అదనంగా సుమారు 12 కోట్ల 44 లక్షల గ్రామీణ కుటుంబాలకు నల్లా నీటి కనెక్షన్లను సమకూర్చారు. ఈ విధంగా, ఈ నెల 23 నాటికి దేశంలో మొత్తం 19 కోట్ల 36 లక్షల కుటుంబాల్లో 15 కోట్ల 67 లక్షల కన్నా ఎక్కువ కుటుంబాలకు నల్లాల ద్వారా నీటి సరఫరా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో, మొత్తం కుటుంబాల్లో 80.95 శాతం కుటుంబాలకు నల్లా కనెక్షన్లు సమకూరినట్లయింది.
పౌర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాలకు గొట్టపుమార్గం ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పథకాలను దీర్ఘకాలం పాటు నిలకడగా అమలుచేయాలని, అందుకు అవసరమయ్యే నాణ్యమైన మౌలిక సదుపాయాలను సమకూర్చడం ఒక్కటే కాకుండా ఆయా పథకాల నిర్వహణ, మరమ్మతులపై దృష్టి సారించాలన్నది జల్ జీవన్ మిషన్ లక్ష్యం. ఈ మిషన్‌కు పెట్టాలనుకున్న మొత్తం ఖర్చును మరింత పెంచి, ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించనున్నట్లు గౌరవ ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెటు సమర్పణ వేళ తన ప్రసంగంలో భాగంగా ప్రకటించారు. దీనికి అనుగుణంగా అదనపు నిధులకు మార్గదర్శకాలు, ఇతరత్రా అంశాలతో ఒక ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీవి. సోమన్న రాజ్యసభలో ఈ రోజు ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2149274)