మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
రొయ్యల పెంపకం, నిర్వహణ రంగంలో డ్రోన్ టెక్నాలజీ
Posted On:
23 JUL 2025 4:22PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్.. ఐసీఏఆర్) అధీనంలో పనిచేస్తున్న మత్స్య పరిశోధన సంస్థలు డ్రోన్లకు సంబంధించిన పరిశోధనపై దృష్టి సారిస్తున్నాయి. చెరువులు, చేరుకోవడానికి వీలుండని ప్రాంతాల నుంచి విశ్లేషణ కోసం నీటి నమూనాలను సేకరించడానికీ, మేత, మందుల పంపిణీ, బయోమాస్ అంచనాకూ, ఆరోగ్య పర్యవేక్షణతో పాటు ఇతర కార్యకలాపాల్లోనూ డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించారు. వీటికి అదనంగా, ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్‌వై)లో భాగంగా 70 కిలోల బరువును మోసే డ్రోన్ల సాయంతో చేపలను, రొయ్యలను చెరువుల నుంచి మార్కెట్ వరకూ రవాణా చేయడానికి ఉద్దేశించిన ఒక నమూనా డ్రోన్ కు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-సీఐఎఫ్ఆర్ఐ) రూపకల్పన చేస్తోంది.
చేపలు, రొయ్యల పెంపకం (ఆక్వాకల్చర్) రంగంలో డ్రోన్ సాంకేతికతను ప్రవేశపెట్టడానికి విధివిధానాలను రూపొందించడం కోసం ఒక సాంకేతిక కమిటీని మత్స్య విభాగం ఏర్పాటు చేసింది.
నవకల్పనలు, నూతన ఆవిష్కరణలతో ముడిపడిన ప్రాజెక్టులు, సంబంధిత కార్యకలాపాలు, అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్లు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు సహా సాంకేతికత ప్రదర్శన.. పీఎంఎంఎస్‌వైలోని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ పరిధిలో చేపట్టే కార్యకలాపాల్లో భాగంగా ఉన్నాయి. వీటిలో మత్స్య పరిశ్రమ, చేపలు, రొయ్యల పెంపకంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించడాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. పర్యవేక్షణ, సరుకు మూల్యాంకనం, పర్యావరణ సంబంధిత పర్యవేక్షణ, వ్యాధుల గుర్తింపు, రొయ్యల ఫారాలతో సహా చేపలు, రొయ్యల సాగుకు యంత్రాల సాయంతో మేత ఇవ్వడం, నీటి నమూనాల సేకరణ, ఖచ్చితత్వం ప్రాతిపదికన చేపలు పట్టడం వంటి ముఖ్య కార్యకలాపాలు మత్స్యపాలన రంగంలో చోటుచేసుకొన్న సాంకేతిక ప్రగతిని సూచిస్తున్నాయి. వీటిని పీఎంఎంఎస్‌వైకి చెందిన కేంద్ర రంగ పథకాల పరిధిలోకి చేర్చే వీలుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ రాజ్యసభలో ఈ రోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2147581)